భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం ఉంటే పర్యవసానాలు ఇవే..!
posted on Nov 4, 2025 9:30AM
.webp)
దాంపత్య జీవితం అనేది ఇద్దరి మధ్య ఉండే ఒక పవిత్ర బంధం. ఇది శరీర సంబంధం మాత్రమే కాదు.. ప్రేమ, నమ్మకం, కమ్యునికేషన్, బాధ్యత, గౌరవం అనే ఐదు స్థంభాల మీద నిలబడే సంబంధం. చాలావరకు భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం గురించి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో భార్యాభర్తల గొడవ, సమస్య మూడవ వ్యక్తికి చెప్పడం వల్ల.. ఆ మూడవ వ్యక్తి భార్యాభర్తలను కూర్చోబెట్టి, వారి మధ్య అపార్థాలు తొలగిస్తారు అని అంటుంటారు. కానీ చాలామంది మాత్రం మూడవ వ్యక్తి జోక్యం వల్ల భార్యాభర్తల బంధం విచ్ఛిన్నం అవుతుంది అంటుంటారు. భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం గురించి.. కలిగే పర్యవసానాలు గురించి తెలుసుకుంటే..
“మూడవ వ్యక్తి జోక్యం” అంటే..
భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలలో, ఎమోషన్ పరిస్థితులలో, నిర్ణయాలలో, కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు లేదా ఎవరైనా ఇతర వ్యక్తి ప్రభావం చూపించడం. అలాంటి వ్యక్తులనే థర్డ్ పర్సన్ అని అంటారు. ఈ “మూడవ వ్యక్తి” ఎప్పుడూ చెడు ఉద్దేశంతో ఉండకపోవచ్చు.
కానీ సమస్య ఏమిటంటే, ఆ మూడవ వ్యక్తి దంపతుల మధ్య ఉన్న నిజమైన అభిప్రాయాలు, ఆలోచనలు, పరిస్థితులు, అనుభవాలను అర్థం చేసుకోలేరు. దాంతో వాదన పెద్దదవుతుంది, అనుమానం పెరుగుతుంది, ప్రేమ తగ్గుతుంది.
మూడవ వ్యక్తి జోక్యం ఉంటే ఏమవుతుంది?
భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం పాయిజన్ లా పనిచేస్తుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటంటే..
నమ్మకం దెబ్బతింటుంది..
భార్యకు లేదా భర్తకు “వారి మాట వినడం కంటే బయట వాళ్ల మాట ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు” అన్న భావన వస్తుంది. ఇది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.
ప్రైవసీ ఉండదు..
దంపతుల మధ్య జరిగిన విషయాలు మూడవ వ్యక్తి వద్దకి వెళ్లడం వల్ల “ప్రైవసీ” కోల్పోతుంది. అది తర్వాత చాలా దారుణంగా మారుతుంది. ప్రతి చిన్న విషయాన్ని చెప్పుకోవడం, చర్చించడం, తప్పుగా అర్థం చేసుకోవడం వంటి సమస్యలను పదే పదే తెస్తుంది.
నిర్ణయాలు దెబ్బతింటాయి..
మూడవ వ్యక్తి అభిప్రాయం విని తీసుకున్న నిర్ణయాలు చాలా సార్లు అసలైన పరిస్థితికి దూరంగా ఉంటాయి.
ఎందుకంటే మూడవ వ్యక్తికి ఎప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య, పరిస్థితి 100% అర్థం కాదు. ఎదురు వ్యక్తులు వారి అనుభవాల పరంగా నిర్ణయాలు చెబుతారు.
కోపం, అసహనం, దూరం పెరుగుతాయి..
ప్రతి వాదనలో “వాళ్లు అలా చెప్పారు” అనే పదం వస్తే, దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. అది క్రమంగా బంధం చేదిపోవడానికి సారి తీస్తుంది.
బ్రేకప్ అయ్యే ప్రమాదం..
మూడవ వ్యక్తి ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల ఒక దశలో నమ్మకం పూర్తిగా పోతుంది. ఇది విడాకులకు కూడా దారి తీస్తుంది.
*రూపశ్రీ.