Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో వంట గ్యాస్ కొరత లేదు : పౌర సరఫరాల శాఖ
posted on: Mar 24, 2026 9:53PM
.webp)
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఉందన్న వదంతులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ ఎక్కడా కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం వ్యక్తం చేసింది. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిస్థాయిలో, సజావుగా కొనసాగుతోందని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజల రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇటీవలి రెండు రోజులుగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు కనిపించడం, కొన్ని చోట్ల “నో స్టాక్” బోర్డులు ఉంచడం ప్రజల్లో మరింత భయాన్ని పెంచింది. అయితే ఇవన్నీ తాత్కాలిక పరిస్థితులేనని, సరఫరాలో లోపం వల్ల కాకుండా డిమాండ్ ఒక్కసారిగా పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందిన తప్పుడు సమాచా రమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు. “ఇంధనం కొరత రాబోతోందన్న భయంతో ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నింపించుకోవడానికి బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో కొద్ది గంటలపాటు కొంతమంది డీలర్ల వద్ద స్టాక్ ఖాళీ అయినట్లు కనిపిస్తోంది.
కానీ డిపోలలో సరిపడా నిల్వలు ఉన్నాయి” అని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అమలు చేస్తున్న అడ్వాన్స్ పేమెంట్ విధానంలో మార్పుల కారణంగా కొందరు డీలర్లకు తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఇది సరఫరాపై ప్రభావం చూపే అంశం కాదని స్పష్టం చేశారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఇంధన సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా కొనసాగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. పెట్రోలియం సంస్థలు, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖతో కలిసి పెట్రోల్ బంకుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఎక్కడైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం వంటి చర్యలు గుర్తించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు భయాందోళనలకు లోనవకుండా ప్రశాంతంగా ఉండాలని, అవసరమైన మేరకే ఇంధనం కొనుగోలు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అధికారిక సమాచారం తప్ప ఇతర వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలని సూచించింది.






