Top Stories

ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బిజీబిజీ

హస్తిన పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం (ఫిబ్రవరి 20) ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ లో భేటీ అయిన వీరు పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలపై చర్చించారు. పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యం పెంపునకు అవసరమైన ఆర్ధిక సహాయం అందించాల్సిందిగా కోరారు.  ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు హస్తిన వెళ్లిన వీరిరువురూ పనిలో పనిగా అన్నట్లుగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన నిధులు, కేంద్రం సహకారంపై చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వకారం కార్యక్రమంలో వీరు ఇరువురూ ప్రధాని నరేంద్రమోడీతో కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంంత్రి శివరాజ్ సింగ్ ఛౌహాన్ తో కూడా భేటీ కానున్నారు.  ఈ తరువాత సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతారు.   
Publish Date: Feb 20, 2025 1:42PM

కుంభమేళాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పుణ్యస్నానం

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో కకేంద్ర మంత్రి, తెలుగుదేశం ఎంపీ కే.రామ్మెహన్ నాయకుడు పుణ్యస్నానం ఆచరించారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించి గంగాదేవికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చిన రామ్మోహన్ నాయుడు తెలుగు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు చెప్పారు.  ఇలా ఉండగా మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో భక్తులు పుణ్యస్నానాల కోసం పోటెత్తుతున్నారు. మంగళవారం నాటికే మహాకుంభమేళాకు వచ్చిన వారి సంఖ్య 55 కోట్లకు చేరుకుంది. మహాకుంభ్ ముగిసే నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
Publish Date: Feb 20, 2025 1:16PM

కెసిఆర్ కు వైద్య పరీక్షలు 

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు గురువారం గచ్చిబౌలిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి. అమెరికాలో ఉంటున్న తన మనవడిని చూసేందుకు కెసీఆర్ వెళుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటన నిమిత్తం బుధవారం సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయానికి    వెళ్లి తన పాస్ పోర్టును  స్వయంగా రెన్యువల్ చేయించుకున్నారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నిరుడు తుంటి ఎముక విరిగినప్పుడు  సోమాజీగుడా యశోదా హాస్పిటల్ లో కెసీఆర్ హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. అమెరికా పర్యటన ఖరారు కావడంతో కెసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తమే ఆస్పత్రికి వచ్చారు. కెసిఆర్ వెంట భార్య శోభ తప్పితే మరెవరూ  రాలేదు.  
Publish Date: Feb 20, 2025 1:11PM

ఢిల్లీ సిఎంగా రేఖా గుప్తా ప్రమాణం

27 ఏళ్ల తర్వాత  ఢిల్లీలో బిజెపి అధికారంలో వచ్చింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తో బాటు ఆరుగురు మంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా  వారి చేత ప్ర‌మాణం చేయించారు.  మంత్రులుగా ప‌ర్వేశ్ శ‌ర్మ‌, సాహిబ్ సింగ్‌, అశీశ్ సూద్‌, మంజీంద‌ర్ సింగ్‌, ర‌వీంద‌ర్ ఇంద్ర‌జ్ సింగ్, క‌పిల్ మిశ్రా, పంక‌జ్ కుమార్ సింగ్ ప్ర‌మాణం చేశారు.  ఈ వేడుకకు  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా,  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. 
Publish Date: Feb 20, 2025 12:06PM

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. జగన్ పై కేసు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆంక్షలను ఉల్లంఘించి, నియమావళిని పట్టించుకోకుండా జగన్ బుధవారం (ఫిబ్రవరి 19) గుంటూరు మిర్చియార్డ్ లో పర్యటించిన సంగతి విదితమే. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కనుక మిర్చియార్డ్ పర్యటనకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినా, పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించినా జగన్ లేక్క చేయకుండా మిర్చియార్డు ను సందర్శించి అక్కడ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ పై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.  ఈసీ, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై కూడా కేసు నమోదైంది.  
Publish Date: Feb 20, 2025 11:55AM

విపత్తు నిధులలో ఏపీకి సింహ భాగం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మాటకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నది. ఆయన విజ్ణప్తుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నది. బడ్జెట్ కేటాయింపులలోనూ, అమరావతి, పోలవరం లకు సహకారం విషయంలోనూ ఈ విషయం ఇప్పటికే ధృవపడింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన విపత్తు, వరదల సహాయం నిధుల విషయంలోనూ ఏపీకి సింహభాగం దక్కింది. కేంద్రం తాజాగా ఐదు రాష్ట్రాలకు కలిపి విపత్తు, వరదల సహాయం కింద1,554.99 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధులలో అత్యధికంగా ఏపీకి 608.08 కోట్ల రూపాయలు కేటాయించింది.  ఇక మిగిలిన రాష్ట్రాలలో తెలంగాణకు  231 కోట్ల రూపాయలు, త్రిపురకు  288.93 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అలాగే ఒడిశాకు 255.24, నాగాల్యాండ్ కు 170.99 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసింది. 
Publish Date: Feb 20, 2025 11:42AM