దోచుకోవడం.. దాచుకోవడంలో వైసీపీ ఫస్ట్ ఆదుకోవడం.. అందుకు ఖర్చు చేయడంలో ‘దేశం’ బెస్ట్

దోచుకోవడం, దాచుకోవడం వైసీపీ నైజం. ఈ విషయం గణాంకాలతో  సహా మరోసారి రుజువు అయింది. వైసీపీకి  2020-2021 ఆర్థిక సంవత్సరంలో   107.99 కోట్ల రూపాయలు విరాళంగా, అందగా వాటిలో కేవలం ఎనిమిది కోట్ల ఏడు లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. అంటే విరాళంగా వచ్చిన మొత్తం నుంచి 99.25 శాతం నిధులు ఖర్చు చేయకుండా మిగుల్చు కుంది.    అదే ఆర్థిక సంవత్సరంలో  తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాలు 3 కోట్ల 25 లక్షల రూపాయలు మాత్రమే. కానీ.. తెలుగుదేశం ఖర్చు చేసింది మాత్రం  54 కోట్ల 76 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అంటే.. వచ్చిన విరాళాల ద్వారా అందిన ఆదాయం కన్నా తెలుగుదేశం 1,584 కోట్ల రూపాయలు అదనంగా వ్యయం చేసింది.    విరాళాల సొమ్మును మిగుల్చుకోవడంలో వైసీపీ ఏపీలోనే కాకుండా దేశంల మొత్తంలోనే ప్రథమ స్థానంలో నిలిస్తే, వచ్చిన సొమ్ము కన్నా అధికంగా ఖర్చుపెట్టడంలో తెలుగుదేశం పార్టీ దేశంలోనే  మొదటి ప్లేస్ లో ఉంది. ఈ గణాంకాలు  ఏడీఆర్  నివేదిక అధికారికంగా వెల్లడించిన వాస్తవాలు.  2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోని 31 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ వ్యయ లెక్కల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది.

ఈ గణాంకాలు చూస్తుంటే.. పార్టీ నిర్వహణ కోసం, కార్యకర్తల శ్రేయస్సు కోసం తెలుగుదేశం ఎంతగా పరితపిస్తుందో  అవగతమౌతుందని పరిశీలకులు అంటున్నారు. పార్టీ శ్రేణులకు బీమా కల్పించడంలో, ఆరోగ్య పరంగా వారు ఇబ్బందులు పడుతుంటే  ఆదుకోవడంలో దేశంలోని పార్టీలన్నిటి కంటే తెలుగుదేశం పార్టీ ముందుంటుందనడంలో సందేహం లేదనడానికి ఈ గణాంకాలే తిరుగులేని రుజువు.   దేశం మొత్తంలో పార్టీ కార్యకర్తలకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం. పార్టీ కార్యకర్తలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం, రక్తదానం చేయడంలో  తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి ఆ పార్టీ కార్యకలాపాలను గమనిస్తే ఇట్టే అవగతమౌతుంది.  ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ఉదారంగా ముందుకు వస్తుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తెలుగుదేశం సేవా కార్యక్రమాలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి అని పరిశీలకులు గణాంకాలతో, ఉదాహరణలతో వివరిస్తున్నారు.

అయితే.. అందుకు భిన్నంగా అధికారంలో ఉన్న  వైసీపీ పార్టీ నిర్మాణం, కార్యకర్తల శ్రేయస్సు విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న విమర్శలకు ఏడీఆర్ నివేదిక వెల్లడించిన వాస్తవాలు బలం చేకూరుస్తున్నాయి.  రాష్ట్రంలో విపత్తులు  సంభవించిన సందర్బాలలో, భారీ ఎత్తున అందిన విరాళాల సొమ్ము అందినప్పటికీ బాధితులను మానవతా దృక్పథంతో  ఆదుకోవడానికైనా వాటిని ఉపయోగించకపోవడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. అదే సమయంలో విపక్ష తెలుగుదేశం పార్టీకి పార్టీ పరంగా అందిన విరాళాలు స్వల్పమే అయినా, ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే విరాళాల ద్వారా వచ్చిన సొమ్ము కంటే అధిక మొత్తం వ్యయం చేసి వారిని ఆదుకోవడానికి ముందుకు సాగడం ఇరు పార్టీల మధ్యా ఉన్న స్పష్టమైన తేడా ఏమిటన్నది తేటతెల్లం చేస్తొందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతసేపూ ముఖ్యనేతలు, ముఖ్యులు, పార్టీలో పైనున్న వారే నిధులను, పదవులను అనుభవిస్తారు కానీ.. దిగువ స్థాని శ్రేణుల సంక్షేమం, శ్రేయస్సును వైసీపీ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వైసీపీ క్యాడర్ నుంచే వెల్లువెత్తుతున్నాయి. 

2020-21లో దేశంలోని 31 ప్రాంతీయ పార్టీలకు 529 కోట్ల 41 లక్షలు విరాళంగా  ఆదాయం సమకూరింది. ఈ మొత్తం ఆదాయం 2019-20  సంవత్సరంలో వచ్చిన 800 కోట్ల 26 లక్షలతో  పోల్చితే  34.96 శాతం తక్కువే. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి 37 కోట్ల 65 లక్షలు ఆదాయం విరాళంగా వస్తే.. 22 కోట్ల 34 లక్షల రూపాయలు ఖర్చు చేయడం గమనించాలి. అంటే.. 40.66 శాతం ఆదాయాన్ని టీఆర్ఎస్ కూడా ఖర్చు చేయకుండా మిగుల్చుకుందన్నమాట. మరో పార్టీ ఎంఐఎంకు అదే ఏడాది కోటీ 62 లక్షల రూపాయల ఆదాయం వస్తే.. కేవలం 19 లక్షల 4 వేల రూపాయలే వినియోగించింది. దేశం మొత్తంలో అందిన విరాళాల్లో అధిక మొత్తాన్ని మిగుల్చుకున్న పార్టీల్లో వైసీపీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. బీజేడీ అయితే.. 90.44 శాతంతో రెండో ప్లేస్ లో, ఎంఐఎం 88.02 శాతం విరాళాల ఆదాయాన్ని మిగుల్చుకుని మూడో స్థానంలో ఉంది.

దేశంలోని 31 ప్రాంతీయ పార్టీలకు 376 కోట్ల, 86 లక్షలు స్వచ్ఛంద విరాళాల రూపంలో అందాయి. వాటిలో 250 కోట్ల 60 లక్షలు పార్టీలు ఎలక్టొరల్ బాండ్ల రూపంలో కూడగట్టుకున్నవే కావడం గమనార్హం. ఈ బాండ్ల మొత్తం కేవలం ఐదు పార్టీలకే వెళ్లిందని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఎలక్టొరల్ బాండ్ల ఆదాయంలో కూడా వైసీపీయే ముందుంది. వైసీపీకి మొత్తం 96 కోట్ల 25 లక్షల రూపాయలు బాండ్ల రూపంలో అందింది. ఎలక్టొరల్ బాండ్ల ఆదాయం 80 కోట్లతో ఆ తర్వాతి స్థానంలో డీఎంకే నిలిచింది. బీజేడీ అయితే.. 67 కోట్ల రూపాయల బాండ్ల ఆదాయంతో మూడోస్థానంలో ఉంది.

అటు విరాళంగా.. ఇటు ఎలక్టొరల్ బాండ్ల రూపంలో భారీ ఎత్తున వచ్చిన ఆదాయం నుంచి అంతే భారీ మొత్తంలో మిగుల్చుకున్న వైసీపీ ఆ సొమ్మంతా ఏం చేసింది? ఎందుకోసం ఆ నిధుల్ని దాచుకుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. దాచుకున్న విరాళాల సొమ్మంతా వచ్చే ఎన్నికల్లో విస్తారంగా వెదజల్లి   ఓట్లు కొల్లగొట్టేందుకు పథకం వేసిందా? అన్న ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు ఔననే సమాధానం చెబుతున్నారు. తనకు వచ్చిన ఆదాయం కన్నా అధికంగా ఖర్చు పెట్టిన టీడీపీ ఎక్కడ? వచ్చిన నిధుల్ని వచ్చినట్లే దాచేసుకున్న వైసీపీ తీరు ఎక్కడ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.