మందు లేదు సామాజిక దూరం, పరిశుభ్రతే పరమౌషదం!

లాక్ డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆలోచన మేరకు అంగన్ వాడీ కేంద్రాలలో నమోదైన బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు పాలు, గుడ్లు, బాలామృతం, నిత్యావసరాలు ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా సరుకులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని ఈ రోజు హైదరాబాద్, మాసబ్ ట్యాంక్ వద్ద ఎంజీ నగర్ అంగన్ వాడి కేంద్రాన్ని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నమోదైన బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సరుకులు, శానిటైజర్లు, మాస్క్ లు కూడా పంపిణీ చేశారు.

ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తోందని, ఈ సమయంలోనే మన అవసరం ప్రజలకు ఎక్కువగా ఉందని, వారికి ప్రభుత్వ సేవలన్నీ సకాలంలో అందించి ఆదుకోవాలన్నారు. అంగన్ వాడీలు బాగా పనిచేస్తున్నారని, వీరి సేవలు బ్రహ్మండంగా ఉన్నాయని, నీతి ఆయోగ్ కూడా మన అంగన్ వాడీలను ప్రశంసించిందని గుర్తు చేశారు. కరోనా వ్యాధికి మందులేదని, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతే దీనికి పరమౌషదమని దీనిని అంగన్ వాడీలు పాటిస్తూ మిగిలిన వారంతా కూడా పాటించేలా చూడాలన్నారు.