హుజురాబాద్ పోలింగ్ కు ముందు కేసీఆర్ కు బిగ్ షాక్.. కారులో కలవరం..

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన, అన్ని పార్టీలకు సవాల్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొన్ని గంటలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ తగిలింది. హుజురాబాద్ లో ప్రభుత్వ పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం అమలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  హుజూరాబాద్ లో దళితబంధు నిలిపివేత అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోమని హైకోర్టు తేల్చి చెప్పింది. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఇటీవల ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టీఆర్ఎస్ తోపాటు పలువురు కోర్టుకు ఎక్కడంతో విచారణ జరిపిన కోర్టు తాజాగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికల వేళ.. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేయకుండా కొందరు కోర్టుకు ఎక్కగా.. దానిపై విచారించిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకంపై టీఆర్ఎస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు పథకాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికలో దీని ప్రభావం ఉంటుందనే చర్చ సాగుతోంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రతాపం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ వరద బాధితులకు ఇంటికి రూ.10వేలు పథకం ప్రకటించి కోర్టు ఆదేశాలతో నిలిపివేసిన టీఆర్ఎస్ సర్కార్ కు గట్టి దెబ్బ తగిలింది. జనాలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడే అదే జరుగబోతోందని.. దళితులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందంటున్నారు. 

మరోవైపు దళిత బంధుకు సంబంధించి హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. రాష్ట్రవ్యాప్తంగా 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని.. అక్కడ దళితబంధు అమలు చేయకుండా జనరల్ నియోజకవర్గం హుజూరాబాద్ లో అమలు చేయడం చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్త అక్కడ సురేష్ కుమార్ మరో పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తోపాటు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షలు బదిలీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ రెండు పిల్ లు వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.