రాష్ట్ర  రాబడికి  కరోనా కాటు.. 

తెలంగాణ ప్రభుత్వం లెక్క తప్పింది. రాష్ట్రం ఆశించిన ఆదాయానికి కరోనా భారీగా గండి కొట్టింది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) రాష్ట్ర ప్రభుత్వం భారీ  ఆశలు, అంచనాలతో రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. అయితే, ఆతర్వాత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వం  బడ్జెట్ అంచనాలను రూ. 1.76 లక్షల కోట్లకు సవరించింది. చివరాఖరుకు, తాజాగా కాగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వార్షిక ఆదాయం రూ.1.45 లక్షల కోట్ల వద్దే ఆగిపోయింది. అందులోనూ,రూ. 45,638 కోట్లు ఆదాయం పద్దులో చూపిన అప్పులే ఉన్నాయి.అంటే, రాష్ట్ర వాస్తవ ఆదాయం లక్ష కోట్ల ((రూ.99,903కోట్లు)లోపే ఉంది. అయితే, కరోనా మహమ్మారి, సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో, అంచనాలు తప్పు కావడం, తల్ల కిందులు కావడం తప్పు కాదు. ప్రభుత్వం చేతకాని తనమో, వైఫల్యమో కానే, కాదు. ఒక విధంగా కరోనా మహామ్మారి పుణ్యాన,ఇంచుమించుగా  ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నాయి. అందుకు మన దేశం, మన రాష్ట్రం మినహాయింపు కాదు. అయితే, వాస్తవాలను ప్రజల నుంచి  దాచే ప్రయత్నం చేయడం మాత్రం సరి కాదు.

సరే, అదలా, ఉంటే  కాగ్’ చూపిన వివరాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో రెండే రెండు పద్దుల కింద మాత్రమే ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. అందులో మొదటిది, రాష్ట్రానికి కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపంలో వచ్చిన ఆదాయం అయితే, రెండవది అప్పులు రూపంలో వచ్చిన ఆదాయం.కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రూ.10,525 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అయితే అంచనాను మించి కేంద్రం నుంచి  రూ.15,471 కోట్ల రాబడి వచ్చింది. అలాగే, అప్పుల ద్వారా రూ.33,191 కోట్లు రాబడి వస్తుందని అంచవేస్తే, అది రూ.45,638 కోట్లకు పెరిగింది. 

ఇక ఇతర పద్దుల విషయానికి వస్తే, జీఎస్టీ ద్వారా రూ. 32,671 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, వాస్తవానికి వచ్చిన ఆదాయం రూ.25, 905 కోట్లు మాత్రమే. అలాగే స్టాంపులు, రిజిస్ర్టేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ. 5,243 కోట్ల ఆదాయం వచ్చింది.అలాగే సేల్స్‌ ట్యాక్సు నుంచి రూ.20 ,903 కోట్లు, స్టేట్‌ ఎక్సైజ్‌ డ్యూటీస్‌ నుంచి రూ.14,369 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ద్వారా రూ.8,976 కోట్ల ఆదాయం సమకూరింది. ఇతర పన్నుల ద్వారా రూ. 3,940 కోట్ల రాబడి వచ్చింది. 

కాగా, గత ఏడాది కరోనా కారణంగా ఆదాయంతో పాటుగా వ్యయం కూడా రూ.1.34 లక్షల కోట్లకు దిగివచ్చింది. కాగా, గత సంవత్సరంలానే ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ,ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం కొనసాగుతున్న నేపధ్యంలో అంచనా వేసిన మేర ఆదాయం వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే, కరోనా విరామ సమయంలో పరిస్థితి కొంత ఆశాజనకంగా కనిపించిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను మరింతగా పెంచి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  రాష్ట్ర బడ్జెట్‌ను ఏకంగా రూ.2.30 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ అంచనాలను చేరుకోవాలంటే ప్రతి నెలలో సుమారు రూ.20 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉంటుంది. అయితే, ఆదాయం సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రెండు విడతల్లో రూ.3000 కోట్లు అప్పును పెంచుకుంది. మరో రూ.2,000 కోట్ల అప్పు కోసం బాండ్ల వేలానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యంగా, కరోనా మహమ్మారి ఇంకెంతకాలం ఉంటుందో, ఇంకెన్ని విడతల్లో కాటేస్తుందో అంతు చిక్కని పరిస్థితిలో పభుత్వాలు, అయినా ప్రజలు అయినా పరిమితులు దాటి, పెద్ద ఎత్తులకి పోవడం మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.