టీ కాంగీయుల వెటకారం!

 

 

 

సీమాంధ్రుల మీద వెటకారాలు పోయే విషయంలో, వాళ్ళని తిట్టిపోసే విషయంలో టీఆర్ఎస్ నాయకులు, టీ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా వున్నారు. టీఆర్ఎస్సోళ్ళు సీమాంధ్రులని ఒక తిట్టు తిడితే, మేం మాత్రం తక్కువా అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకటిన్నర తిట్లు తిడతారు. ఇప్పుడు కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక సమర్పించే విషయంలో కూడా టీఆర్ఎస్, టీ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా వెటకారాలు పోయారు. రెండ్రోజుల క్రితం జీఓఎంకి నివేదిక ఇచ్చిన టీఆర్ఎస్ అందులో తమ గొంతెమ్మ కోర్కెలన్నీ వివరంగా పొందుపరిచింది. సీమాంధ్రులు అసలు మనుషులే కాదు.. వాళ్ళకేమీ హక్కులు అవసరం లేదన్నట్టుగా వెటకారాలు పోయింది.

 

 

ఇప్పుడు తాజాగా టీ కాంగ్రెస్ నేతలు ఆ బాధ్యతని తీసుకున్నారు. వాళ్ళు కూడా జీఓఎంకి ఓ నివేదిక సమర్పించారు. వాళ్ళు కూడా ఆ నివేదికలో టీఆర్ఎస్‌ని మించిన వెటకారాలు పోయారు. ఆ నివేదికలో తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్ళ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులకి జాతీయ హోదా కల్పించాలన్నారు. తెలంగాణలో వైద్య, ఉద్యాన, మహిళా, పశు సంవర్ధక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. శంకర్‌పల్లి, నేదునూరు విద్యుత్ కేంద్రాలని వెంటనే ప్రారంభించాలన్నారు. వీటితోపాటు ఇంకా బోలెడన్ని కోరికల లిస్టు ఆ నివేదికలో పొందుపరిచారు. ప్రత్యేక రాష్ట్రం కావాలి.. ఇంకా బోలెడన్ని కోర్కెలు తీర్చాలి. బాగుందయ్యా.. చాలా బాగుంది!  సరే ఈ కోరికల సంగతి పక్కన పెడదాం.

 



ఆ నివేదికలో సీమాంధ్రులని అవమానించే కోరికలు చాలా వున్నాయి.  సీమాంధ్రులకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు చాలా ఎక్కువైపోతుందట. సాధ్యమైనంత తక్కువకాలం వాళ్ళని హైదరాబాద్‌లో ఉంచాలట. అది కూడా హైదరాబాద్ మొత్తం ఉమ్మడి రాజధానిగా కాకుండా ఏదో ఒక మూల ప్రాంతాన్ని వాళ్ళకి కేటాయించి, ఆ ప్రాంతానికే వాళ్ళని పరిమితం చేయాలట. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణని ఇచ్చేసి, సీమాంధ్రులని తరిమేయడమే కాకుండా, తెలంగాణకే ప్రత్యేకంగా భారీ ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలట. మొగుణ్ణి కొట్టి మొగసాలకొచ్చి ఏడ్చినట్టు సీమాంధ్రులని హైదరాబాద్ నుంచి తరిమేసి అన్యాయం చేయాలనుకుంటున్నదీ వాళ్ళే... మాకు ఇంకా న్యాయం చేయాలని మొత్తుకుంటున్నదీ వాళ్ళే!