వెనుకంజలో తేజస్వీ యాదవ్... లాలూ కంచుకోట బద్దలు

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో  మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన సొంత నియోజకవర్గం రాఘోపూర్‌లో వెనుకంజలో ఉన్నారు. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 3,230 ఓట్ల తేడాతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ స్థానంలో ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధి సతీష్ కుమార్ అధిక్యంలో ఉన్నారు.

ఆర్జేడీకి, లాలూ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన రాఘోపూర్ నియోజకవర్గంలో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి తర్వాత 2015 నుంచి తేజస్వి యాదవ్ ఇక్కడి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2020లో తేజస్వి ఇదే నియోజకవర్గం నుంచి 38,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తన బలాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఈ స్థానం విషయంలో వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచుతోంది.

ఈసారి బీజేపీ వ్యూహాత్మకంగా సతీశ్ కుమార్ యాదవ్‌ను రంగంలోకి దించింది. సతీశ్ కుమార్ కూడా రాఘోపూర్‌లో గణనీయమైన ఆధారాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా, 2010లో జేడీయూ తరఫున పోటీ చేసి రబ్రీ దేవిని ఓడించడం ఆయనకు పెద్ద గుర్తింపు తీసుకువచ్చింది.

ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ‘జన్ సురాజ్’ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టగా, తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ స్థాపించిన ‘జనశక్తి జనతా దళ్’ తరఫున ప్రేమ్ కుమార్ పోటీలో ఉండటం గమనార్హం. ఈ బహుముఖ పోటీ వల్ల ఓట్లు విపరీతంగా చీలుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu