కోహ్లీ డ‌కౌట్‌.. రిష‌భ్‌, రాహుల్ హిట్‌.. చిత‌క్కొట్టిన బౌల‌ర్లు.. స‌ఫారీల‌కు బిగ్ టార్గెట్‌..

ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకొనేందుకు బ‌రిలో దిగింది టీమిండియా. మొద‌ట బ్యాటింగ్ చేసి.. సౌత్ ఆఫ్రికాకి 287 ప‌రుగుల‌ భారీ టార్గెట్ ఇచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. రిష‌భ్ పంత్ చెల‌రేగి పోయాడు. చివ‌రాఖ‌రిలో బౌల‌ర్లు శార్దూల్‌ ఠాకూర్‌, అశ్విన్ స్టో అండ్ స్ట‌డీగా ప‌రుగులు సాధించి భారీ స్కోరుకు కార‌ణ‌మ‌య్యారు. విరాట్ కోహ్లీ డ‌కౌట్ కావ‌డం ఒక్క‌టే కాస్త నిరాశ ప‌రిచే అంశం.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో అతిథ్య జట్టుకు టీమ్‌ఇండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ ఆటగాడు రిషభ్ పంత్‌ (85; 71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (55; 79 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. తొలి వన్డేలో హాఫ్ సెంచ‌రీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. ఈ సారి డకౌట్‌ అయ్యి నిరాశపరిచాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కి ఓపెనర్లు శిఖర్ ధావన్‌, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమ్ఇండియా స్కోరు 57/0. అయితే, 12 ఓవర్‌లో శిఖర్‌ ధావన్‌ (29)ని మార్‌క్రమ్ పెవిలియన్‌కి పంపాడు. ఆ నెక్ట్స్‌ ఓవర్‌లో కేశవ్ మహారాజ్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లీ (0) బవుమాకి దొరికిపోయాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన రిషబ్‌ పంత్‌ దూకుడుగా ఆడాడు.   

బౌండరీలు బాదుతూ రిష‌భ్‌ స్కోరు వేగం పెంచాడు. షంసీ వేసిన 24 ఓవర్‌లో పంత్‌ మూడు ఫోర్లు కొట్టాడు. 43 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ కంప్లీట్ చేశాడు. 29 ఓవర్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ కొద్దిసేపటికే అవుట‌య్యాడు. ఆ వెంటనే రిషబ్‌ పంత్ కూడా పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. శ్రేయస్ అయ్యర్‌ (11), వెంకటేశ్ అయ్యర్‌ (22) మ‌మ అనిపించారు. చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌ (40*), అశ్విన్‌ (25*) నిలకడగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించేలా చేశారు. 

దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసి రెండు, మగళ, కేశవ్‌ మహారాజ్‌, మార్‌క్రమ్, పెహులుక్వాయో తలో వికెట్ తీశారు.