క్యాసినోపై జ‌గ‌నే టార్గెట్‌.. వైసీపీపై 8 అంచెల పోరాటం..

గుడివాడ క్యాసినోతో మంత్రి కొడాలి నాని అడ్డంగా బుక్క‌య్యారు. వీడియో, ఫోటో ఆధారాల‌తో స‌హా దొరికిపోయారు. అయినా, త‌న‌కేం సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు. టీడీపీ సాక్షాలు బ‌య‌ట‌పెట్టినా.. పోలీసులు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. కొడాలిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు లేవు. అందుకే, గుడివాడ క్యాసినోపై సీఎం జగన్‌రెడ్డినే నోరు విప్పాలని టిడిపి స్ట్రాటజీ కమిటీ డిమాండ్ చేసింది. క్యాసినో ఎపిసోడ్‌పై టిడిపి నేతలు చేసిన పోరాటాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. స్వాతంత్య్ర‌ సమరయోధులు, మేధావులు, ప్రముఖులు జన్మించిన గుడివాడను.. కాసుల కోసం క్యాసినో క్యాపిటల్‌గా కొడాలి నాని మారుస్తున్నారని మండిప‌డ్డారు. నిజ నిర్థారణకు వెళ్లిన టిడిపి నేతలపై దౌర్జన్యం చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. 

ప్ర‌ధానంగా 8 అంశాల‌పై వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాటం చేయాల‌ని టీడీపీ స్ట్రాటజీ మీటింగ్‌లో డిసైడ్ చేశారు. 
1. క్యాసినో వంటి విష సంస్కృతిపై  పోరాటం కంటిన్యూ చెయ్యాలని సమావేశంలో నిర్ణయించారు. వందల కోట్లు చేతులు మారిన ఈ వ్యవహారంలో వివిధ జాతీయ ఏజెన్సీలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించారు. వైసిపి నేతల కనుసన్నల్లో, స్వయంగా మంత్రికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో గ్యాంబ్లింగ్ ఆడిన వీడియోలపై సిఎం స్పందించాలని డిమాండ్ చేశారు. కేవలం మంత్రి కొడాలి తన బూతులతో, ఎదురు దాడితో జరిగిన తప్పులను కప్పిపుచ్చలేరని నేతలు అన్నారు. 

2. చిత్తూరు జిల్లాలో దళిత మహిళను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడాన్ని సమావేశంలో నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటనలో కేవలం సదరు పోలీసును సస్పెండ్ చేస్తే సరిపోదని.....బాధ్యులపై అట్రాసిటీ కేసుల పెట్టి విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చిత్తూరులో ఇలాంటివి నాలుగు ఘటనలు జరిగాయని నేతలు వెల్లడించారు. 

3. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచకపోగా...వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న విధానాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఉద్యోగులపై సోషల్ మీడియాలో, మీడియాలో ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేయించడం ప్రభుత్వ నైజాన్ని తెలుపుతుందన్నారు. ఉద్యోగుల డిమాండ్లకు సమావేశం మద్దతు తెలిపింది.

4. రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా నమోదు అవుతున్న కారణంగా...స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రమాదంలో పడేసేలా....ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. 

5. ఇక పోతే వివేకానంద హత్య కేసులో తెర వెనుక సూత్రధారుల లెక్కలు తేల్చకుండా...కేసును నలుగురికే పరిమితం చేసే పని జరుగుతోందని నేతలు అన్నారు. 

6. రాష్ట్రంలో ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తూ.. అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారన్నారు. ఎరువుల అధిక ధరలు, కొరతతో రైతాంగ ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని..దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. 

7. దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా లేకపోవడం రాష్ట్రంలో విధ్వంస పాలనకు నిదర్శనం. దేశంలో బెస్ట్ సిఎంల లిస్ట్ లో కనీసం టాప్ 20 లోకూడా ఎపి సిఎం జగన్ లేకపోవడం ఆయన పాలన తీరుకు నిదర్శనం అన్నారు. పైగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు ఎక్కవ సీట్లు అంటూ సిగ్గు లేకుండా వైసిపి అసత్య ప్రచారానికి దిగుతోందని అన్నారు. 

8. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుల ద్వారా, టెలిమెడిసిన్ విధానంలో కోవిడ్ బాధితులకు అవసరమైన వైద్యసాయం అందించడం జరుగుతోంది. ఈ సేవలను ప్రజలకు చేరువ చెయ్యాలని అన్నారు.