జగన్ రెడ్డికి కులపిచ్చి ముదిరిపోయింది! 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఒక వర్గం వారికే పదవులు దక్కుతున్నాయనే ప్రచారం మొదటి నుంచి సాగుతోంది. కీలక పదవులన్ని ఒక వర్గం వారికే కట్టబెట్టారని విపక్షాలు లెక్కలు కట్టీ మరీ చెబుతున్నాయి. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్జి తీరు మాత్రం మారడం లేదంటున్నారు. తాజాగా ఎన్నికలు జరిగిన జడ్పీ చైర్ పర్సన్ ఎన్నికల్లోనూ అదే జరిగిందని అంటున్నారు. పదవులే కాదు ప్రభుత్వ పనుల విషయంలోనూ ఒక వర్గం వారిదే హవా అన్న చర్చ సాగుతోంది. సీఎం దగ్గరుండే గుమస్తా మొదలు ప్రభుత్వ సలహాదారుల వరకు అంతా అదే కథ అన్న విమర్శలు వస్తున్నాయి. 

టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కులపిచ్చి బాగా ముదిరిపోయిందని అన్నారు.  రాష్ట్రంలో కేవలం 4 శాతమున్న తన వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. గతంలో స్పీకర్ తమ్మినేని సీతరాం రెడ్డివారే.. తమకు దొడ్డవారన్న మాటలను.. జగన్‌రెడ్డి తూచా తప్పకుండా పాటిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ఓట్లతోనే సీఎం అయ్యారనే వాస్తవాన్ని జగన్ విస్మరిస్తున్నారన్నారు. రెడ్లను తప్ప.. మరో వర్గాన్ని నమ్మనట్లుగా ముఖ్యమంత్రి ప్రవర్తన ఉందన్నారు బుద్దా. వర్గాలకు దూరంగా ఉండే చంద్రబాబుకు కుల పిచ్చి ఉందని దుష్ప్రచారం చేసి.. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు.