టీడీపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు! డీజీపీకి ఫిర్యాదు.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా తమ తీరు మార్చుకోవడం లేదు వైసీపీ లీడర్లు. కృష్ణా జిల్లాలో టీడీపీ ముఖ్య నేతకు వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియా వేదికగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అంతుచూస్తామని బెదిరిస్తున్నారంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్  డీజీపీకి ఫిర్యాదు చేశారు. 

టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లిన పట్టాభిరామ్ తన ఫిర్యాదును అందచేశారు. తనపై దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు క్షమాపణ చెప్పకపోతే అంతుచూస్తామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు పట్టాభిరామ్. 

వైసీపీ ఎమ్మెల్యే ఉదయబాను రెండో కుమారుడు ప్రశాంత్ వ్యవహారశైలిపై మీడియా ముందు వాస్తవాలు తీసుకొచ్చినందుకే ఎమ్మెల్యే అనుచరులు తనను బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత డీజీపీని కోరారు.  పట్టాభిరామ్‌ కు శ్రద్ధాంజలి అంటూ పోస్టులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జగ్గయ్యపేట వైసీపీ సంగతి తెలుసుకదా అని హెచ్చరిస్తున్నారని తెలిపారు. యర్రమాను రామకృష్ణ, జోన్స్ పణితి తదితరులు తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పట్టాభి తన ఫిర్యాదులో వివరించారు.