చంద్రబాబు ఆగ్రహానికి కారణమేంటి? నిజంగానే దోస్తీ చెడిందా?

 

2014 ఎన్నికల్లో పాలూ నీళ్లలా కలిసిపోయారు. సైకిల్‌పై కమలాన్నెక్కించుకుని గత ఎన్నికల్లో రాష్ట్రమంతా చుట్టేసింది టీడీపీ. అయితే మూడేళ్లు తిరక్కుండానే ఆ బంధం సడలిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి? మిత్రలాభం కాస్తా మిత్రభేదంగా మారుతోన్న మాటలు వినిపిస్తున్నాయి? సైకిల్‌తో కటీఫ్ చెప్పేసి ఫ్యాను కింద సేదతీరేందుకు కమలం సిద్ధమవుతుందనే ఊహాగానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా మారుతోన్న రాజకీయాలను చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇలాంటి అనుమానం కలుగక మానదు. అంతేకాదు టీడీపీ-బీజేపీ నేతలు ఎడమొఖం... పెడమొఖంగా ఉంటున్నారంటున్నారు.

 

2019 నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ... ఒంటరి పోరుకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ కె.లక్ష్మణ్‌ ప్రకటించగా.... ఏపీలోనూ అదే దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఏదైనా పార్టీతో కలిసి పోటీ చేయాలనుకుంటే... బీజేపీకి ఎక్కువ స్కోప్‌ ఉండేలా జాగ్రత్త పడుతోంది. అయితే టీడీపీతో కలిసి ముందుకెళ్తే కమలం ఎదుగుదలకు పెద్దగా స్కోప్‌ లేదని భావిస్తుందో ఏమో తెలియదు కానీ... తెలుగుదేశం నుంచి కొంచెం దూరం జరుగుతున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో దోస్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు పంపుతోంది. వైసీపీ అధినేత జగన్‌కు మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, మోడీతో జగన్‌ భేటీని బీజేపీ లీడర్లు వెనకేసుకురావడం చూస్తుంటే ఇలాంటి అనుమానం కలుగక మానదు.

 

జగన్‌... మోడీని కలవడంతో తెలుగు తమ్ముళ్ల ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అది కూడా చంద్రబాబు విదేశాల్లో ఉన్న టైమ్ చూసి జగన్ అపాయింట్ మెంట్ కోరడం... వెంటనే మోడీ అంగీకరించడం, భేటీ జరగడం జరిగిపోయాయి. పైగా గంటపాటు ఏకాంత చర్చలు జరిపి బయటకొచ్చాక జగన్ చాలా ఉత్సాహంగా కనిపించారు. అంతేకాదు రాష్ట్రపతి అభ్యర్ధి ఎన్నికలో ఎన్డీఏకు మద్దతునిస్తామని ప్రకటించారు. ఈ పరిణామాలు టీడీపీకి కోపం తెప్పించాయి. అందుకే గతంలో రెండుమూడుసార్లు మోడీని జగన్‌ కలిసినా పెద్దగా స్పందించని టీడీపీ నేతలు... ఈసారి మాత్రం ఘాటుగానే రియాక్టవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మోడీతో జగన్‌ భేటీ కావడంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో మోడీ-జగన్‌ భేటీపై బీజేపీ నేతలు సానుకూలంగా స్పందిస్తుండటం.... టీడీపీకి కోపం తెప్పిస్తోంది. అంతేకాదు విదేశాల నుంచి రాగానే చంద్రబాబు.... ప్రధాని అపాయింట్ మెంట్ కోరినా దొరకలేదనే టాక్‌ వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తున్న టీడీపీ నేతలు లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరి ఈ పరిణామాలు బీజేపీ-టీడీపీ దోస్తీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.