Latest News
తెలంగాణాలో తెదేపాకు విషమ పరిస్థితులు
posted on: May 26, 2014 3:42PM
.png)
మళ్ళీ చాలా సుదీర్గ కాలం తరువాత కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ ముందు ఎన్ని సవాళ్లు ఉన్నాయో, అంతకంటే ఎక్కువ సమస్యలను ఆ పార్టీ తెలంగాణా శాఖ ఎదుర్కోవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్ళీ బాధ్యతలు చేప్పట్టనున్నారు.అందువల్ల ఇప్పుడు ఆయన దృష్టి అంతా సీమాంద్రాకు కొత్త రాజధాని నిర్మాణం, ఎన్నికల హామీలను నెరవేర్చడం, గాడితప్పిన ప్రభుత్వాన్ని, ఆర్ధిక వ్యవస్థని మళ్ళీ గాడిన పెట్టడం పైనే ప్రధానంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కానీ ఇప్పటికే పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలంగాణా తెదేపా నేతలను ఒకవేళ చంద్రబాబు గనుక పట్టించుకోకపోయినట్లయితే, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న తెదేపా నేతలను తెరాస అధినేత కేసీఆర్ తమవైపు తిప్పుకొనే ప్రయత్నం తప్పక చేయవచ్చును. బలమయిన క్యాడర్, మంచి అనుభవముగల తెదేపా నేతలను తెరసలోకి ఆకర్షించగలిగితే, తెలంగాణాలో ఇక తెరాసకు ఎదురు ఉండదు. తద్వారా తెరాసను మరింత బలోపేతం చేసుకోవడమే కాక, ఇక వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బలమయిన ప్రతిపక్షమే లేకుండా చేసుకోవచ్చును. అందుకే తెరాస నేత హరీష్ రావు 2019 ఎన్నికలకి తెలంగాణాలో తెదేపాను కనబడకుండా చేస్తానని అన్నారు. దానిని బట్టి తెలంగాణాలో తెదేపా ఎంత సంకట స్థితి ఎదుర్కోబోతోందో అర్ధమవుతోంది.
సీమాంద్రాలో సమస్యల పరిష్కారానికి కేంద్రం నుండి తగినన్ని నిధులు రాబట్టుకొంటే సరిపోతుంది. కానీ తెలంగాణాలో పార్టీని మరో ఐదేళ్ళ పాటు బ్రతికించుకోవడానికి, చాలా నేర్పు, ఓర్పు, మంచి వ్యూహం అవసరం ఉంటాయి. మరి చంద్రబాబు ఈ సమస్యను ఏవిధంగా ఎదుర్కొంటారో, పార్టీని ఏవిధంగా కాపాడుకొంటారో కాలమే చెపుతుంది.


.jpg)
.jpg)


