తెదేపా సందిగ్ధం నుండి బయటపడేదెపుడు?

 

తెలుగుదేశం పార్టీ తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ, దానివల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ కలుగలేదు. పార్టీలో తెలంగాణా నేతలు కనీసం దాని గురించి గట్టిగా చెప్పుకోవడానికి కూడా వీలులేకపోవడంతో వారు తెలంగాణాలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేకుండాపోయింది. ఈవిషయం పార్టీ అధిష్టానానికి తెలియకపోలేదు. అయినప్పటికీ పార్టీని రెండు చోట్ల బ్రతికుంచుకోవాలనే తాపత్రయంతో నిర్దిష్టమయిన వైఖరిని చెప్పలేక రెండు ప్రాంతాలలో బలపడలేకపోతోంది.

 

గమ్మతయిన విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన అనివార్యమని పార్టీలో అందరికీ స్పష్టంగా తెలిసి ఉన్నపటికీ, సీమాంధ్ర నేతలు తమ ఉనికిని కాపాడుకొనేందుకు, ఇంకా సమైక్యవాదం చేస్తూ పార్టీని సంక్షోభంలోకి నెట్టి వేయడం విచిత్రం. తెదేపా సీమాంధ్ర నేతలు పార్టీ కార్యాలయంలో కూర్చొని విభజనను వ్యతిరేఖిస్తూ చేస్తున్న వాదనలు, ప్రకటనల వల్ల వారికి కానీ, పార్టీకి గానీ, ప్రజలకి గానీ ఒరిగేదేమీ ఉండదు. వారి వాదనల వల్ల కనీసం సీమాంధ్రలోనయినా  పార్టీ బలపడే పరిస్థితి లేదు.

 

మరి అటువంటప్పుడు వారు ఇంకా సమైక్య రాగం ఆలపిస్తూ తెలంగాణాలో కూడా పార్టీని బలపడకుండా అడ్డుతగలడం వలన ప్రయోజనం ఏమిటో వారే వివరించాలి. రేపు పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత కూడా సీమాంధ్ర నేతలు ఇలాగే వితండ వాదం చేస్తూ కూర్చొంటే ముందుగా నష్టపోయేది వారు, వారి పార్టీయే.

 

ఇప్పటికే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒకరొకరిగా విభజనకు సంసిద్దమయి కేంద్ర మంత్రుల బృందానికి తమ కోర్కెల చిట్టాలు సమర్పిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఏ నిమిషంలో ఏ వైఖరికి మారిపోతాడో ఎవరూ ఊహించలేరు. మరటువంటప్పుడు తెదేపా ఇప్పటికీ భ్రమలోనే ఉండాలని ఎందుకు కోరుకొంటోందో వారికే తెలియాలి. సీమాంధ్ర ప్రజలు మానసికంగా విభజనకు సిద్దమయినట్లే భావించవచ్చును. ఎందుకంటే కేంద్రం రాష్ట్ర విభజన ప్రక్రియను చకచకా చేస్తున్నపటికీ వారు అంతగా స్పందించడం లేదు.

 

అటువంటప్పుడు నేటికీ తెదేపా రాష్ట్ర విభజనపై స్పష్టమయిన వైఖరి ప్రకటించడానికి జంకుతూ తనను తానే నష్టపరచుకొంటోంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలు.