బాక్సాఫీస్ రేసులో పెద్ది, స్వయంభూ..  అస‌లు ఏప్రిల్‌లో ఈ రెండూ రిలీజ్ అవుతాయా?

posted on: Mar 30, 2026 2:56PM

- 'స్వయంభూ', 'పెద్ది' సినిమాల రిలీజ్‌పై ఉత్కంఠ‌

- ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే సినిమా షెడ్యూల్స్‌లో మార్పు

- సస్పెన్స్‌లో క్రేజీ ప్రాజెక్టుల రిలీజ్ డేట్స్.

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వేసవి సందడి మొదలైంది. మార్చి ముగిసి ఏప్రిల్ నెలలోకి అడుగుపెడుతున్న తరుణంలో, సినీ ప్రేమికులందరూ కొత్త సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ నెలలో థియేటర్లలోకి రావాల్సిన రెండు భారీ చిత్రాల విడుదల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడం ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ హీరో నిఖిల్ నటిస్తున్న 'స్వయంభూ', అలాగే రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతున్న 'పెద్ది' చిత్రాల రిలీజ్ డేట్లపై ప్రస్తుతం ఒక రకమైన సస్పెన్స్ కొనసాగుతోంది.

చారిత్రక నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'స్వయంభూ'. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ పోస్టర్‌లో 'సమ్మర్ రిలీజ్' అని మాత్రమే పేర్కొన్నారు తప్ప, కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 10న వస్తుందని అందరూ భావించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడంతో ఆ తేదీన సినిమా వచ్చే అవకాశం లేదని అర్థమవుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 30కి షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరోవైపు 'పెద్ది' సినిమా విడుదలపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్‌లో ఏప్రిల్ 30న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ తాజా టాక్ ప్రకారం, ఈ సినిమా ప్యాచ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, రెండు పాటల షూటింగ్ కూడా పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఏప్రిల్ 30న 'స్వయంభూ' ఫిక్స్ అయితే, 'పెద్ది' రేసు నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, మిగిలిన వారాల్లో మరికొన్ని సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలో 'బైకర్', 'రాకాస' వంటి చిన్న చిత్రాలు విడుద‌ల కాబోతున్నాయి. ఇక రెండో వారంలో అడివి శేష్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా 'డెకాయిట్' ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడో వారంలో 'బ్యాడ్ బాయ్ కార్తీక్', 'తిమ్మరాజుపల్లి టీవీ' వంటి విభిన్న చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. నెల చివరి వారంలో మాత్రం ఏ సినిమా నిలుస్తుందనేది ప్రస్తుతానికి మిస్టరీగానే మారింది.

నిఖిల్ తన గత చిత్రం 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా, రామ్‌చ‌ర‌ణ్ పెద్ది సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరి సినిమాలపై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ రెండు చిత్రాల అప్‌డేట్స్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మ‌రి ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఏ సినిమా విజేత‌గా నిలుస్తుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...