సునంద పుష్కర్ ది హత్యే.. బయటకొచ్చిన సీక్రెట్ రిపోర్ట్..
posted on Mar 13, 2018 4:45PM
కాంగ్రెస్ నేత - మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి పెద్ద సంచలనం రేపిన సంగతి తెలిసిందే కదా. ఆమెది ఆత్మహత్య కాదని.. హత్యే అని..శశి థరూరే ఆమె మృతికి కారణమని వార్తలు కూడా వచ్చాయి. ఆ తరువాత ఆ విషయం గురించి అందరూ మరిచిపోయారు. ఆమెది హత్యా...? లేక ఆత్మహత్యా..? అన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె మృతికి సంబంధించి డీఎన్ఏ పత్రిక ఓ సీక్రెట్ రిపోర్ట్ ను సంపాదించింది. ఆ రిపోర్ట్ ఆమెది హత్యే అని చెబుతోంది.
డీఎన్ ఏ కథనం ప్రకారం... పుష్కర్ కేసులో తొలి రిపోర్ట్ ఇచ్చిన అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బీఎస్ జైస్వాల్.. సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదని తేల్చి చెప్పారు. ఈ ఘటన జరిగిన లీలా హోటల్ లోని రూమ్ ను వసంత్ విహార్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ పరిశీలించి అతి ఆత్మహత్య కాదని చెప్పినట్లు ఆ రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లోనూ ఆమెకు విషమిచ్చిన కారణంగానే చనిపోయిందని చెప్పడంతో సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ దీనిని హత్య కేసుగానే విచారణ చేపట్టాలని సరోజిని నగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఒంటిపై మొత్తం 15 గాయాలు ఉన్నాయి. అందులో పదో నంబర్ గాయం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏర్పడినది. 12వ నంబర్ గాయం చూస్తే ఎవరో కొరికినట్లుగా ఉంది. ఆమె ఎవరితోనో గొడవ పడినట్లుగా ఒంటిపై గాయాలు ఉన్నాయి` అని ఆ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది. ఇక ఈ రిపోర్ట్ ను హోంమంత్రిత్వ శాఖకు కూడా అప్పగించినా....ఆమె మృతికి కారణం తెలిసిన తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ రహస్య నివేదికలో పోస్ట్ మార్టమ్ - కెమికల్ - బయోలాజికల్ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఇది హత్యేనని తేల్చినా.. పోలీసులు మాత్రం కేసు పెట్టలేదు. అంతేకాదు ఆమె శరీరంలోకి ఇంజెక్షన్ ద్వారా విషం ఎక్కించారా లేక నోటి ద్వారానా అన్నదానిపై విచారణ జరపాలని కూడా ఈ రిపోర్ట్ స్పష్టంచేసింది. మరి ఇది హత్యే అని తెలిసినా దీని వెనుక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి. మరి ఈ రిపోర్ట్ బయటకు వచ్చినా.. వారిపై చర్యలు తీసుకునేది ఏం ఉండదు.. ఏదో రెండు రోజులు మాట్లాడుకుంటారు.. ఆ తరువాత మళ్లీ మర్చిపోతారు..