బుద్ధవనం శిల్పాలు ఆకట్టుకున్నాయి

విదేశీ బౌద్ధ పరిశోధకులు బుద్ధవనంలోని బౌద్ధ శిల్పాలు తమనేంతో ఆకట్టుకున్నాయి అని విదేశీ బౌద్ధ పరిశోధకులు ప్రొఫెసర్  సారా కెన్డర్ లైన్, ప్రొఫెసర్ జాఫ్రిషా అన్నారు. బౌద్ధ  ప్రదర్శనశాలల నిపుణులైన న్యూజిలాండ్ కు చెందిన ప్రొఫెసర్  సారా ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషా  ఇంకా హాంకాంగ్ నుంచి వచ్చిన మరో ఇద్దరు బౌద్ధ పరిశోధకులు నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించినట్టు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ శివనాగిరెడ్డి చెప్పారు.  ఆయన, బుద్ధ వనంలోని వివిధ విభాగాలు, మహాస్తూపం  చుట్టూ ఉన్న శిలా శిల్పాలను వారికి చూపించి, వాటి విశిష్ఠతను వివరించారు.  ఈ కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు దమ్మచారి శాసన, డా. రవి చంద్ర, డి. ఆర్. శ్యాంసుందర్ రావు, సిబ్బంది విష్ణు పాల్గొన్నారు.
Publish Date: Jan 3, 2025 6:26PM

అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు 

సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ  నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.   పుష్ప 2 బెనిఫిట్  షో చూడటానికి వచ్చిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. దీంతో చిక్కడపల్లి పోలీసులు అతనిపై బిఎన్ఎస్ 105 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు  14 రోజులు రిమాండ్ విధించింది.  ఒక రోజు జైలులో ఉన్న అతను మరుసటి రోజు ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అడ్వకేట్లు వాదనలు వినిపించడంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే  అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ బెయిల్ మంజూరైంది. రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కౌంటర్ దాఖలు చేసారు.  ఈ కేసులో వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ  శుక్రవారం తీర్పు ఇచ్చింది. 
Publish Date: Jan 3, 2025 4:45PM

గడగడలాడిస్తున్న హ్యుమన్ మెటానియా వైరస్.. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ

కరోనాకు పుట్టిల్లైన చైనాలో ఇప్పుడు అంత కంటే ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనాలాగే ఇది మనుషుల నుంచి మనుషులకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దీని వ్యాప్తి కరోనా వ్యాప్తి వేగంకంటే రెండింతలు ఎక్కువ. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉసురు తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కల్లోలం నుంచి కోలుకుని ప్రపంచం గాడిన పడుతోంది. అంతలోనే అంతకంటే భయంకరమైన వైరస్ చైనాలో వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచం గడగడలాడిపోతోంది.  ఈ కొత్త వైరస్ పేరు హ్యుమన్ మెటానియా వైరస్(హెచ్ఎమ్ వీవీ). దీని లక్షణాలు కూడా అచ్చం కరోనా లక్షణాల్లాగానే ఉంటాయి. అయితే కరోనా కంటే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, జలుబు, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో  ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. కరోనా కంటే ఎక్కువ ప్రాణాంతకమని వైద్యులు చెబుతున్నారు.   ఈ వైరస్ కు ప్రస్తుతం ఎలాంటి చికిత్సా లేదు. లక్షణాలను బట్టే చికిత్స అందిస్తున్నారు. చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఆస్పత్రి పాలయ్యారు.  దీంతో చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కరోనా నాటి పరిస్థితుల్లో విధించినట్లే లాక్ డౌన్ విధించే యోచన కూడా చైనా ప్రభుత్వం చేస్తున్నది.  
Publish Date: Jan 3, 2025 3:09PM

ఇంటర్ విద్యార్థులకు డోక్కా సీతమ్మ మధ్యాహ్న బోజన పథకం.. అమలుకు సర్వం సిద్ధం

జగన్ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ విద్య పూర్తిగా గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే  మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలి తాల మెరుగునకు పలు చర్యలు చేపట్టారు.  రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం నుంచి అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 398 సమీపంలోని పాఠశాలలు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాలను తయారు చేస్తారు.  మిగిలిన 77 కళాశాలలను   వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27.39 కోట్లు. వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85.84 కోట్లు ఖర్చు చేయనున్నారు.  ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ కంకణం కట్టుకున్నారు.   ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎపి మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, హైస్కూలు ప్లస్ స్కూళ్లలో విద్యనభసిస్తున్న 2లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులను  ఉచితంగా పంపిణీ చేసింది. బోధనా విధానాన్ని మెరుగుపర్చేందుకు జిల్లా, రీజనల్ స్థాయిలో అకడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్  లను ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లాలోని 25, గుంటూరు జిల్లాలోని 4 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటి మద్రాసు సహకారంతో విద్యాశక్తి పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నది. దీనిద్వారా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు సబ్జెక్టులలో విద్యార్థుల సామర్థ్యం పెంచాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఐఐటి మద్రాసులో శిక్షణ పొందిన నిపుణులైన అధ్యాపకులు ప్రతిరోజూ సాయంత్రం 4నుంచి 5గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మెళుకువలు నేర్పుతున్నారు. క్రమం తప్పకుండా పేరెంట్ – టీచర్స్ సమావేశాలను నిర్వహిస్తూ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు.  మొత్తం మీద మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంటర్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.  
Publish Date: Jan 3, 2025 2:45PM

మాధవిలతపై  కేసు 

సినీ నటి , బిజెపి నేత  మాధవిలత పై  తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెన్నానది ఒడ్డున జెసిపార్క్ లో ప్రతీ యేడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ యేడు కూడా సెలబ్రేషన్స్ జరిగాయి. తాడిపత్రిలోని   జెసి పార్క్ లో జరుగనున్న    న్యూ ఇయర్ వేడుకలకు మహిళలు హాజరుకావొద్దని  మాధవిలత పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు తర్వాతే జెసి ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులు దగ్దమయ్యాయి.  ఇది బిజెపి పని అని జెసీ  ప్రభాకర్ రెడ్డి  ఆరోపించారు. అయితే తాను ఎలాంటి ఫిర్యాదు చేయనని  పోలీసులే సుమోటోగా  తీసుకోవాలన్నారు. తాడిపత్రి ప్రజల మనో భావాలు దెబ్బతినే విధంగా మాధవిలత వ్యాఖ్యలు చేసినందుకు పోలీస్  కంప్లయింట్ ఇచ్చారు కొందరు మహిళా కౌన్సిలర్లు . ఈ ఫిర్యాదు ఆధారంగా  మాదవిలతపై కేసు నమోదైంది. 
Publish Date: Jan 3, 2025 2:28PM