హరిలో రంగ హరి!!

ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఆ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటాడని, ఆ దేవతలు అందరూ కూడా అన్నిరోజులూ ఆయన దర్శనం కోసం ఎదురుచూసి ఎదురుచూసి, వైకుంఠ ద్వారాలు తెరవగానే వాళ్ళు కూడా మహావిష్ణువు దర్శనం చేసుకుంటారని. ఒకరు ఇద్దరూ కాదు ముక్కోటి దేవతలు ఒకేచోట ఆ మహావిష్ణువును కీర్తిస్తూ, స్తుతిస్తూ  ఉంటారని చెబుతారు. 


ఇదంతా ఒకటైతే ధనుర్మాసం మొదలవ్వగానే హరినామస్మరణ చేసుకుంటూ గ్రామాలు, వీధులు తిరిగే హరిదాసుల సందడి మాత్రం ఎంతో ప్రత్యేకం. 

ఒకప్పుడు ధనుర్మాసం ప్రారంభం అవ్వగానే పట్టు పంచె, పట్టు కండువా నడుముకు కట్టుకుని, మెడలో పూల హారం, నొసటన ఆ నారాయణుడి నిలువు నామాలు, నెత్తిమీద అక్షయపాత్ర, ఒకచేతిలో చిడతలు, మరొక చేతిలో నారదుని తుంబుర లాంటి వీణ, కాళ్ళకు గజ్జెలు. ఇలా అన్నిటి కలయికలో గ్రామాలలో వీధి వీధి తిరిగి ఆ శ్రీమన్నాయణుడి గురించి గీతాలు ఆలపిస్తూ, పరిస్థి ఇల్లు ఇచ్చే బియ్యం, కూరగాయలు, డబ్బులు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి పుచ్చుకుని వెళ్ళేవాళ్ళు. ఇలా ధనుర్మాసం మొత్తం ముగిసేదాక చేసేవారు. ఆ మాసం మొత్తం వారికి బోలెడు బియ్యం, పప్పులు, డబ్బులు సమకూరేవి. అయితే కాలంతో పాటు సంప్రదాయాలు సన్నగిల్లినట్టే హరిదాసు కుటుంబాలు తగ్గాయో లేదా వారు చక్కగా చదువుకుని ఇతర వృత్తులను చేపట్టి ఉద్యోగాలు చేసుకుంటూ అలా ఇల్లిల్లు తిరగడం దండగని మాసం మొత్తం ఉన్న ఆచారాన్ని పండుగకు పరిమితం చేశారు కాబోలు హరిదాసుల ఉనికి అప్పటికీ ఇప్పటికీ తగ్గిపోయిందని చెప్పచ్చు.

ఇక ఈ హరిదాసు రూపం వెనుక ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపం ఉందని ప్రజల విశ్వాసం. అందుకే ఈ హరిదాసు గ్రామాలలో వీధులన్నీ తిరిగేటప్పుడు  బీదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు అనే తేడా లేకుండా అందరి ఇళ్లకు వెళతాడు. అలాగే ప్రతి ఇంటివారు ఇచ్చినది తీసుకుంటాడు తప్ప ఖచ్చితంగా ఇంత ఇవ్వాలనే నియమం ఏది పెట్టడు.

సంక్రాంతి వండుగ రోజు పట్టు పరికిణీలు, పట్టు చీరల్లో మెరిసిపోయే అమ్మాయిలు, ఇంటి ముందు రంగురంగుల ముగ్గు మధ్యలో పెట్టిన గొబ్బెమ్మ చుట్టూ చేరి గొబ్బెమ్మను గురించి పాటలు పాడుతుంటే, హరిదాసు తలమీద అక్షయపాత్రను పెట్టుకుని ఆ ఇంటి ముందుకు వస్తే, ఆడపిల్లలు అందరూ హరిదాసు అక్షయపాత్రలో బియ్యం పోయడానికి పోటీలు పడుతుంటే ఆ సన్నివేశం నిజంగా ఎంతో అబ్బురంగా ఉంటుంది. 

కళారూపం జీవం గుర్తొచ్చే సమయం!!

జానపద కళారూపాలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో వీధులు తిరుగుతూ కథలు కథలుగా జరిగిన వాటిని కావ్యాలుగా మార్చి ఆలపించి ప్రాచారం చేయడం కూడా ఒకటి. వీటిని జానపద పాటలు అంటారు. తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో ఇలాంటి జానపద పాటలు ఎన్నో వినబడుతాయి. అలాంటివే గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ అమ్మాయిలు పాడే పాటలు మరియు వీధులు వీధులు తిరుగుతూ హరిదాసులు ఆలపించే భక్తిపరమైన అలాపనలు. విచిత్రం ఏమిటంటే ఉదయాన్నే హరిదాసులు నెత్తి మీద అక్షయపాత్ర పెట్టుకుని భిక్ష కోసం బయలుదేరినప్పుడు మొదలుపెట్టే ఆ భగవంతుని స్మరణ తిరిగి చీకటి పడే వేళకు ఇంటికి చేరినప్పుడు మాత్రమే ఆగుతుంది. మధ్యలో ఎక్కడా వారు ఎవరితో మాట్లాడరు కూడా. 

రూపం రసరమ్యం!!

హరిదాసు రూపం ఆ మహావిష్ణు రూపమని, ఆయన తలమీద ఉండే అక్షయపాత్ర సాక్షాత్తు భూదేవి అని ఆయన భూదేవిని మోసుకుంటూ ఇలా ప్రజల మధ్య తిరుగుతూ వస్తాడని చెబుతారు. ఇంతటి లోతైన తత్వం ఈ రూపంలో ఉంది మరి.

రంగురంగుల ముగ్గులు కొత్త జీవితాన్ని ఆ రంగుల్లా కళగా ఉండమని చెబుతుంటే హరిలో రంగ హరి!! అనే హరిదాసుకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందాం!!

◆ వెంకటేష్ పువ్వాడ