బీజేపీ–శివ సేన.. అవిభక్త కవలలు.. ఆగర్భ శత్రువులు..

బీజేపీ, శివసేన ఈ రెండు పార్టీలు సిద్దాంతపరంగా చూస్తే, ఒకే మాతృ గర్భం నుంచి పుట్టిన  అవిభక్త కవలు. రాజకీయంగా విడిపోయినా, సిద్ధాంత పరంగా ఆ రెండు పార్టీలను వేరు చేయడం, వేరు చేసి చూడడం అయ్యే పని కాదు. ఇప్పుడ కాదు,ఎప్పుడో దశాబ్దాల క్రితం శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరే సమక్షంలో బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీ చేసిన వ్యాఖ్య ఇది. 

నిజానికి మహా రాష్ట్ర ఓటర్లు కూడా, రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసిన సందర్భంలోనూ, ఎన్నికల తర్వాత మళ్ళీ ఇద్దరూ ఒకటవుతారనే నమ్మకంతోనే, ఒకటిగానే ఓటేశారు. అందుకు ప్రధాన కారణం, రెండు పార్టీలకు హిందుత్వమే మూల సిద్దాంతం. వివాదాస్పద రామజన్మ భూమి, ఉమ్మడి పౌరస్మృతి,ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, సాంస్కృతిక జాతీయ వాదం, చివరకు విదేశీ విధానం విషయంలోనూ రెండు పార్టీలదీ ఒకటే మాట, ఒకటే విధానం. ఇక్కడ చిత్రమైన విషయం, ఒఅక్తి గుర్తు చేసుకోవాలి, రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఒకే కూటమిగా పోటీ చేసినా, ఏ పార్టీ అభ్యర్ధి పార్టీ గుర్తు మీదనే పోటీ చేస్తారు. కానీ,చిత్రంగా 1984 లోక్ సభ ఎన్నికల్లో శివసేన అభ్యర్ధులు, బీజేపీ సింబల్ మీద పోటీ చేశారు. అలాగే కొన్ని సందర్భాలలో ఎన్నికలలో వివిడిగా పోటీచేసి ఎనికల తర్వాత కలిసి పోయారు.   

అయితే అది అప్పటి విషయం. ఇప్పటి పరిస్థితి అది కాదు, క్రింది స్థాయిలో కార్యకర్తలు, కొద్ది మంది నాయకుల్లో ఇంకా ఇప్పటికీ, హిందూ హిందూ భాయి ... భాయి బంధం,  అనుబంధం  ఉన్నా, రెండు పార్టీల మధ్య దూరం బాగా పెరిగింది. 2019 ఎన్నికల తర్వాత అధికార పంపిణీలో విబేధాలు తలెత్తిన నేపధ్యంలో శివసేన 35 సంవత్సరాలకు స్నేహ బంధాన్ని వదులుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి, మహా వికాస్ అఘాడీ కూటమిలో చేరింది. శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రిగా అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ అనూహ్య పరిణామంతో హిందుత్వ పార్టీల మధ్య ఏకంగా మహా అఘాధమే ఏర్పడింది. చివరకు  ఒకరిని ఒకరు సవాలు చేసుకునే స్థితికి పరిస్థితి చేరుకుంది. ఒకే తల్లి కడుపున పుట్టిన అవిభక్త కవలలు ఇప్పుడు ఆగర్భ శతృవులుగా మారిపోయారా అనుకునే  విధంగా ఒకరిపై ఒకరు విరుచుకు పడుతున్నారు.   

ఈ నేపధ్యంలో శివసేన అధినేత.మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, కమల దళంతో స్నేహం చేసి చెడి పోయామని, శివసేన పార్టీ పాతికేళ్లు సమయం వృథా చేసుకుందని చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాలలోనే కాదు, జాతీయ రాజకీయల్లో దుమారం రేపుతున్నాయి. బీజేపీ పై ఒంటరిగా పోటీ చేసి గెలవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాలును స్వీకరిస్తున్నామని ప్రకటించిన ఉద్ధవ్‌ థాకరే బీజేపీ పై అదే స్థాయిలో ఎదురు దాడి చేశారు. విమర్శలు గుప్పించారు. బాల్‌ థాకరే  96వ జయంతి ఉత్సవాల సందర్భంగా వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో ఉద్ధవ్ థాకరే బీజేపీతో పొత్తు పెట్టుకుని శివసేన పార్టీ పాతికేళ్లు సమయం వృథా చేసుకుందన్నారు. ఆ పార్టీ మాదిరిగా తాము ఎన్నడూ అధికారం కోసం హిందుత్వను వాడుకోలేదన్నారు. అదే సమయంలో ఆయన అధికారంలోకి వచ్చి హిందుత్వ అజెండాను అమలు చేయాలన్న ఉద్దేశంతోనే తాము  గతంలో బీజేపీతో  చేతులు కలిపామని చెప్పు కొచ్చారు. బీజేపీ లాగా అధికారం కోసం హిందుత్వను వాడుకోలేదనీ అన్నారు. అంతే కాదు బీజేపీ అధికారం కోసం పాకులాడుతూ హిందుత్వ అవకాశావాదిగా మారిందని ,  అందుకే ఆ పార్టీ నుంచి విడిఛి, అఘాడీతో జట్టు కట్టమని చెప్పు కొచ్చారు. 

అదలా ఉంటే, ఉద్దవ్ థాకరే  హిందుత్వ వ్యాఖ్యలను ఎన్సీపీ స్వాగతించింది. జాతీయ స్థాయిలో శివసేన  లౌకికవాద కూటమిలో చేరాలని, ఎన్సీపీ ప్రధాన ప్రవక్త నవాబ్ మాలిక్ శివసేనకు స్వాగతం పలికారు. అంతే కాదు, ఎవరికి  వారు తమ మత విశ్వాసాలను గౌరవిస్తూనే, ఇతర మతాలను ఆదరించాలని, చెప్పు కొచ్చారు. మరి మాలిక్ సూక్తులను శివసేన ఎలా స్వీకరిస్తుందో, ఎలా స్పందిస్తుందో చూడాలి ..మొత్తానికి ఐదు  రాష్ట్రాల ఎన్నికల ముందు,  మళ్ళీ లౌకిక వాదం చర్చకు వచ్చింది. ఈ ప్రభావం ఎన్నికల మీద ఎలా ఉంటుందో చూడవలసిందే.