మృత్యువునే ఓడించాడు... కాలజ్ఞాని స్టీఫెన్‌ హాకింగ్‌ గురించి ఆసక్తిర విషయాలు..

 

విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుడు, కాలజ్ఞాని స్టీఫెన్‌ హాకింగ్‌ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఎన్నో ఏళ్లుదా నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ దశాబ్ధాలుగా చక్రాల కుర్చీకే పరిమితమైన ఆయన ఈ ఉదయం కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు స్టీఫెన్‌ కుటుంబ అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘మా నాన్న ఈ రోజు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఇది అత్యంత బాధాకరం’ అని స్టీఫెన్‌ పిల్లలు లూసీ, రాబర్ట్‌, టిమ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

 

స్టీఫెన్ హాకింగ్ గురించిన ఆసక్తికర విషయాలు..

 

స్టీఫెన్‌ పూర్తి పేరు స్టీఫెన్‌ విలియమ్‌ హాకింగ్‌. 1942 జనవరి 8న ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ నుంచి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన స్టీఫెన్‌.. భౌతికశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఏకతత్వ సిద్ధాంతాలపై అధ్యయనాలు చేశారు. కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌కు ఉత్పత్తి చేస్తాయని ధ్రువీకరించారు. దీన్నే హాకింగ్‌ రేడియేషన్ అని కూడా పిలుస్తారు. 1963లో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకునే రోజుల్లో ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం.. ఓరోజు మెట్ల మీద నుంచి పడిపోవడంతో కుటుంబసభ్యులు వైద్యులను సంప్రదించారు. అప్పుడే  స్టీఫెన్‌ మోటార్ న్యూరాన్ వ్యాధికి గురైనట్టు డాక్టర్లు గుర్తించారు. దీని వల్ల శరీరం నెమ్మదిగా పక్షవాతానికి గురవుతుందని....రెండేళ్ల కంటే ఎక్కువ బ్రతకడని డాక్టర్లు చెప్పారు. ఆ వ్యాధి వల్ల ఆయన కేవలం కుర్చీకే పరిమితమవ్వాల్సి వచ్చింది. కానీ స్టీఫెన్ ఆత్మస్థైర్యం ముందు మృత్యువు కూడా ఓడిపోయింది. విధిని ఎదిరించి చక్రాల కుర్చీ నుంచే కదలలేని స్థితిలో ఉన్నా కూడా తన పరిశోధనలు, అధ్యయనాలను కొనసాగించారు. అయితే ఒకానొక స్థితిలో మాట్లాడటం కూడా కష్టమైపోయంది స్టీఫెన్‌ కు. దానికోసం ఓ కమ్యూనికేషన్ డివైజ్ ను కూడా రూపొందించారు. దీంతో ఆయన చేయితో సంజ్ఞలు చేస్తే.. డివైజ్‌ ద్వారా ఆయన సంజ్ఞలు అక్షర రూపంలోకి మారేవి. ఇంకా దురదృష్టం ఏంటంటే.. కొన్ని రోజులకు ఆ చేయి కూడా పక్షవాతానికి గురైంది. అయినా స్టీఫెన్‌ మాత్రం పట్టు వదలకుండా.. 2005 నుంచి తన చెంప కండరాలతోనే కమ్యూనికేషన్‌ డివైజ్‌ను కంట్రోల్‌ చేశారు. ఇక స్టీఫెన్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య జానే విల్డే.  కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న రోజుల్లో జానే విల్డే అనే అమ్మాయితో స్టీఫెన్‌కు పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆతరువాత కొన్ని కారణాల వల్ల 1995లో విడిపోయారు. అదే సంవత్సరం స్టీఫెన్ తనకు నర్స్‌గా పనిచేసిన మాసన్‌ ను పెళ్లి చేసుకున్నారు. అయితే 2006లో మాసన్‌తో కూడా విడిపోయారు.

 

ఐన్‌స్టీన్‌ తర్వాత అంతటి శాస్త్రవేత్త..


భౌతికశాస్త్రంలో ఐన్‌స్టీన్‌ తర్వాత అంత గొప్ప శాస్త్రవేత్తగా హాకింగ్‌ పేరుగాంచారు. కృష్ణబిలాలు, బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతంపై ఆయన చేసిన అద్భుత పరిశోధనలు నేటి తరం శాస్త్రవేత్తలకు మార్గదర్శనం చేస్తాయి. గ్రహాంతర వాసుల ఉనికిపై చేపట్టే పరిశోధనలు మానవాళికి ముప్పుగా పరిణమిస్తాయని పలుసార్లు హెచ్చరించారు కూడా. ఖగోళ శాస్త్రంలో ఆయన చేపట్టిన పరిశోధనలు పెను విప్లవం సృష్టించాయి. ఆయన రచించిన ‘బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌’ బ్రిటిష్‌ సండే టైమ్స్‌లో 237 వారాలపాటు బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. ఆయన రచించిన ఓ పుస్తకం కాలం కథ పేరుతో తెలుగులో కూడా వెలువడింది.