మోదీకి వ్యతిరేకంగా స్టాలిన్, పినరై ఘాటు లేఖలు

ఐఏఎస్ ల బదిలీలు, కేటాయింపులు, వారికి సంబంధించిన సర్వీస్ రూల్స్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీయేతర రాష్ట్రాలు మోదీ సర్కారు తీరును నిరసిస్తుండగా తాజాగా మరో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం తీరును తప్పు పడుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఇదే విషయంపై ప్రధానికి లేఖ రాశారు. కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు పినరాయి విజయన్ కూడా అదే తరహాలో లేఖాస్త్రం సంధించారు. కేంద్రం విధానాలతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నతాధికారుల్లో భయం పుడుతుందని, వారు ఆయా రాష్ట్రాల పాలసీలను చిత్తశుద్ధితో అమలు చేసే అవకాశం పోతుందన్నారు. 

కేంద్ర కేడర్ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి విభాగాలకు చెందిన బ్యూరోక్రాట్లు తమ విధుల నిర్వహణలో భాగంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నారు. దాదాపు రెండేళ్లుగా పలు బీజేపీయేతర రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని సీఎస్ లు, డీజీపీలు వంటి ఉన్నతాధికారులను కేవలం తమ రాజకీయ అవసరాల కోసమే వినియోగించుకుంటున్నాయన్న  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఈ విషయం బహిర్గతమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశానికి బెంగాల సీఎస్ హాజరు కాకపోతే ఆయన్ని కేంద్రం వెనక్కు పిలిచింది. దీంతో మమతా దీదీ ఆయనకు అండగా ఉంటూ ఆయన చేత రాజీనామా చేయించి మరీ ముఖ్య సలహాదారుడిగా నియమించుకున్నారు. 

ఇటీవల పంజాబ్ లో ప్రధాని పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రమైన విమర్శల పాలవ్వడమే కాక ప్రధాని భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కూడా జీవో 317కు వ్యతిరేకంగా ఎంపీ బండి సంజయ్ దీక్షకు దిగినప్పుడు ఆ దీక్షను విచ్ఛిన్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు విభాగాన్ని వాడుకున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫలితంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు వ్యక్తిగతంగా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు పంపారు. 

ఈ క్రమంలో కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులు, రూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా కేరళ, తమిళనాడు కూడా వాటితో జత కలిశాయి.