లడ్డూ కల్తీతో మనస్తాపం... పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష!

పవిత్రమైన తిరుమల క్షేత్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం కల్తీ ద్వారా అపవిత్రం అయిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురయ్యారు. ఆ ఘోర తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా ఆయన 11 రోజులపాటు ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేయాలని సంకల్పించుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.  ఆ ప్రకటన పూర్తి పాఠం ఇలా వుంది.... ఏడుకొండలవాడా..! క్షమించు... 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష. అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష కొనసాగిస్తాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. 'దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ'ని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః -పవన్ కళ్యాణ్  
Publish Date: Sep 22, 2024 1:27AM

 బతుకమ్మ పండగతో  కవిత రీ ఎంట్రీ

  ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుక్కున్న బిఆర్ఎస్ ఎంఎల్సి  కవిత దాదాపు ఐదున్నరనెలలు తీహార్ జైల్లో  ఉన్నారు.  కవితకు బెయిల్ లభించిన తర్వాతే ఆమె  రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు గడించిన కవిత వచ్చే అక్టోబర్ మొదటి వారంలోనే రాజకీయాల్లో రీ ఎంట్రీ అని ప్రచారం జరుగుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో హల్ చల్ చేశారు. కవిత ఏం చెబితే అది జరిగేది. అవినీతి, అహంకారం  తదితర కారణాలతో ఓటమి చెందిన బిఆర్ఎస్ దేశ రాజకీయాల్లో అధోపాతాళానికి పడిపోయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఉద్దేశ్యంతో టిఆర్ఎస్ కాస్తా బిఆర్ఎస్ గా మారిపోయింది. ఇక్కడే  బిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ తప్పులో కాలేశారు. పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడేట్లు చేశారు. కూతురు, కొడుకు మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం జరిగిన కొట్లాట వల్లే పార్టీ పేరు మార్చాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ను నిలువరించడానికి అన్నా చెల్లెళ్లు తాత్కాలికంగా విభేధాలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.  కవిత జైల్లో ఉన్నప్పుడు పలుమార్లు కెటీఆర్ జైలులో ములాఖత్ కార్యక్రమంలో కలిశారు. బెయిల్ పై వెలుపలికి వచ్చే సమయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమెకు స్వాగతం పలికేటట్లు కెటీఆర్ జాగ్రత్త పడ్డారు. ఒక రోజు ముందే  ఆయన ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.  బతుకమ్మ పండగను దేశ విదేశాల్లో చాటి చెప్పిన కవిత మళ్లీ తన పూర్వ వైభవం కోసం తండ్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిఆర్ ఎస్ రాజకీయ మైలేజి కోసం కవిత ప్రయత్నిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే తనను లిక్కర్ స్కాంలో ఇరికించారని కవిత ప్రచారం చేయనుంది.  నిజామాబాద్ కు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కవిత సమావేశమై రీ ఎంట్రీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
Publish Date: Sep 21, 2024 7:47PM

పేట్ బషీర్ బాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్ 

మాదకద్రవ్యాలకు తెలంగాణ రాజధాని అడ్డాగా మారింది. గోవా నుంచి  మత్తు పదార్థాలను  తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఎండిఎంఏ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.  కారులో హైదరాబాద్  పేట్ బషీర్బాద్ కు కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఇటీవల డ్రగ్స్  కు అలవాటు పడ్డ వారు ఎక్కువయ్యారు. యువత టార్గెట్ గా డ్రగ్స్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉన్న పాన్ షాప్ లలో మత్తు పదార్థాలు లభ్యమవుతున్నాయి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. డ్రగ్స్ నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. 
Publish Date: Sep 21, 2024 6:12PM

పవన్ కళ్యాణ్ అనాథాశ్రమం!

టట్టటాయ్.. బ్రేకింగ్ న్యూస్.. టట్టటాయ్... ఫ్లాష్ న్యూస్.. పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం... మన పవన్ కళ్యాణ్ ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అవును.. నిజంగానే అనాథాశ్రమాన్ని స్థాపించారు. ఆ అనాథాశ్రమం పూర్తి వివరాలు తెలుసుకోవాలని మీకు చాలా ఇంట్రెస్ట్.గా వుంది కదూ! అబ్బ... ఆశ, దోశ, అప్పడం, వడ... ఇంత హాట్ న్యూస్ మొత్తాన్నీ వెంటనే చెప్పేస్తామా ఏంటి? ముందు పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెబుతాం. ఆ తర్వాతే ఆ అనాథాశ్రమం గురించి చెబుతాం... ఏమంటారు? ఆ.. మీరేమంటారూ? ఎక్కువగా సాగదీయకుండా ప్రొసీడైపొమ్మంటారు... అంతేగా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పవర్‌స్టార్‌తో సినిమాలు తీయడానికి, కోట్లకు కోట్లు డబ్బు ఇవ్వడానికి రెడీగా వున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఆ డబ్బు వద్దంటే వద్దు...  ప్రజాసేవే నాకు ముద్దు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీని పెట్టారు. ఎన్నో అవమానాలు భరించారు. ఎన్నెన్నో త్యాగాలు చేశారు. త్యాగాల త్యాగరాజు ఆయన. ఎన్ని బాధలు పడితేనేం... మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన దానధర్మాల గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసిన మరో గొప్పపని అనాథాశ్రమాన్ని స్థాపించడం. మొన్నీమధ్యే వరద బాధితుల కోసం ఆరు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.  అప్పుడు ఆయన్ని చాలామంది ఆపద్బాంధవుడు అని మెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనాథ రక్షకుడు కూడా అయ్యారు. ఏ ఆధారం లేక.. పట్టించుకునేవారే లేక.. ఏం చేయాలో అర్థం కాక, దిక్కూమొక్కూ లేకుండా వున్నవారిని ఆ అనాథాశ్రమంలోకి తీసుకుంటున్నారు. నా అనేవాళ్ళు లేనివారికి నేనున్నానంటూ తన చేతిని అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమంలో చేరినవాళ్ళు ఆనందంతో మురిసిపోతున్నారు. కొంతమంది కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచిపోతున్నాయి. కొంతమంది ఆయన కాళ్ళమీద పడిపోతున్నారు. ఇంకొంతమంది ఆయన్ని గాఠ్ఠిగా కౌగిలించుకుంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేరినవాళ్ళు ఊరికే వుండటం లేదు. తమకు తెలిసిన మరికొంతమందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేర్చుతున్నారు.  అలాంటి అనాథలందరితో పవన్ కళ్యాణ్ అనాథాశ్రమం కళకళలాడుతోంది. ఇంతకీ అనాథాశ్రమం అంటే, నిజంగా దిక్కూమొక్కూ లేనివాళ్ళని అక్కున చేర్చుకునే అనాథాశ్రమం అనుకున్నారా? కాదండీ బాబూ... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దిక్కూమొక్కూ లేని రాష్ట్రంగా చేసినవాళ్ళని దగ్గరకి చేర్చుకునే అనాథాశ్రమం. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీనే అనాథాశ్రమంగా మార్చేశారు. జగన్ పార్టీలో అనాథల్లా దిక్కూమొక్కూ లేకుండా పడి వున్నవాళ్ళందర్నీ తన పార్టీలో చేర్చుకుంటున్నారు. జగన్ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నాయకులు చాలామంది అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు చేశారు. ఇప్పుడు ఆ ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో వాళ్ళందరూ అధికారంలేని అనాథలుగా మారిపోయారు. సంపాదించింది చాలక, ఇంకా సంపాదించే అవకాశం లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారి అధికార ఆకలిని పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమం పుణ్యమా అని జగన్ పార్టీలో వున్న అనాథలందరికీ మంచి ఆశ్రయం దొరుకుతోంది. పవన్ కళ్యాణ్ ఇలాగే అలాంటివాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తూ వుంటే, కొంతకాలానికి పవన్ కళ్యాణ్ పార్టీని ‘జనసేన’ అనరు... ‘జగన్ సేన’ అంటారు!
Publish Date: Sep 21, 2024 5:14PM

లడ్డూ వివాదం.. కేసీఆర్ మౌనం జగన్ కోసమేనా?

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ వాదులంతా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించని రాజకీయ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. రాహుల్ గాంధీ కూడా లడ్డూ ప్రసాదం వివాదంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ సంఘటనకు బాధ్యులను విడిచేందుకు వీల్లేదన్నారు.  అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూ వివాదంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు. ఆయనే కాదు ఆ పార్టీకి చెందిన ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. సమయం అయినా కాకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నంత కాలం నా కంటే పెద్ద హిందువు ఎవరున్నారు అంటూ పదే పదే తనను తానే ఓ పెద్ద హిందూ వాదిగా ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లడ్డూ వివాదం విషయంలో మౌనంగా ఉండటం బీఆర్ఎస్ శ్రేణులను సైతం విస్మయ పరుస్తోంది.  కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడూ, అధికారం కోల్పోయిన తరువాత కూడా యాజ్ణాలు చేశారు. హిందూ ధర్మానికి తనకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకోవాలని తహతహలాడారు. అటువంటి కేసీఆర్ తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో అనూహ్యంగా మౌనాన్ని ఆశ్రయించారు.  అయితే నా కంటే పెద్ద హిందువు ఎవరున్నారంటూ ప్రకటనలు గుప్పించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈ విషయంలో మాత్రం స్పందించడం లేదు.  లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా, జాతీయ మీడియా కూడా ఈ అంశాన్నే హైలైట్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ అంశంపై స్పందించాయి. కానీ పరమ భక్తుడిని అని చెప్పుకునే కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు. బీఆర్ఎస్ నేతలెవరూ కూడా స్పందించలేదు.  బహుశా తన మౌనం వల్ల జగన్ కు ఏమైలా ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నారేమో అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే జగన్, కేసీఆర్ ల రాజకీయ స్నేహబంధం తెలిసిందే. 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి రావడానికి అప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన వంతు సహకారం అందించారు. అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు రాజకీయ లబ్ధి చేకూర్చడానికి సాగర్ డ్యాం వద్ద హంగామా సృష్టించి జగన్ తన వంతు సాయం చేశారు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైందనుకోండి అది వేరే సంగతి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్ విజయం సాధించబోతున్నారంటూ..కేసీఆర్ జోస్యం చెప్పి ఏదో మేరకు జగన్ కు సాయపడేందుకు కేసీఆర్ శతథా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదనుకోండి. ఇక ఇప్పుడు లడ్డూ వివాదం విషయానికి వస్తే.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంలో జగన్ ప్రతిష్ట జాతీయ స్థాయిలో పాతాళానికి పతనమైంది. ఈ తరుణంలో కేసీఆర్ తన మౌనం ద్వారా ఏదో మేరకు జగన్ కు ప్రయోజనం లభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనను తాను పరమ భక్తుడిగా ప్రకటించుకునే కేసీఆర్ దేవుడికి సంబంధించిన అంశంలో కూడా రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.  
Publish Date: Sep 21, 2024 4:15PM

 కల్తీ లడ్డూపై జనసేన అగ్రహం...జగన్ దిష్టిబొమ్మ దహనం

తిరుపతిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. తిరుపతిలో కల్తీ లడ్డూ తయారీకి పాల్పడ్డ  గత వైసీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.  తిరుపతి లడ్డూ కల్తీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో జరిగిన ఈ కల్తీ గూర్చి విని భక్తులు మనోవేదనకు గురయ్యారు.  పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.  కమిషన్లకు కక్కుర్తిపడ్డ వైసీపీ నాయకులు ఈ కల్తీకి పాల్పడ్డారని జనసేన నేతలు అంటున్నారు. వైసీపీ నేతల దిష్టి బొమ్మలను జనసేన నేతలు చెప్పులతో కొట్టి దహనం చేశారు. జగన్ దిష్టి బొమ్మను వారు రహనం చేశారు. ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు పలువురు జనసేనలో చేరిన నేపథ్యంలో జనసేననేతల చేపట్టిన ఈ ఆందోళన వల్ల కూటమి మరింత బలోపేతమైంది. 
Publish Date: Sep 21, 2024 3:56PM