కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై సోనియా క్లారిటీ.. రేవంత్‌రెడ్డిపై ఆస‌క్తి!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు ఎవ‌రు? అంటే, వెంట‌నే ఆన్స‌ర్ చెప్ప‌లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతానికి శ్రీమ‌తి సోనియాగాంధీ తాత్కాలిక అధ్య‌క్షురాలిగా ఉన్నారు. ఉద్ద‌రిస్తార‌నుకున్న రాహుల్‌గాంధీ త‌న‌కింకా టైమ్ కావాలంటున్నారు. రాహుల్ రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉన్నా.. నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌కు వెన‌క‌డుగు వేస్తున్నారు. భ‌య‌మో, బ‌రువనుకున్నారో కార‌ణం ఏదైనా.. రాహుల్‌గాంధీ మాత్రం ఇప్ప‌ట్లో కాంగ్రెస్ ప‌గ్గాలు స్వీక‌రించే ప‌రిస్థితి లేద‌ని తేలిపోయింది. ఆ మేర‌కు సోనియాగాంధీ స్ప‌ష్ట‌మైన మెసేజ్ ఇచ్చేశారు.  

కాంగ్రెస్‌పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. తదితర అంశాలే అజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీబ్ల్యూసీ) సమావేశమైంది. ప్రారంభ ఉపన్యాసంలో సోనియాగాంధీ నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్‌ను ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాలంటూ కొంత‌కాలంగా ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్లు బ‌హిరంగంగానే నిన‌దిస్తున్నారు. ఆ అసమ్మతి కూట‌మికి జీ-23 లీడ‌ర్స్ అని పేరు పెట్టారు. వారంతా పార్టీకి బ‌ల‌మైన నాయ‌కుడిని అధ్య‌క్షునిగా నియ‌మించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వేరే సీనియ‌ర్‌ని కాక‌పోయినా.. క‌నీసం రాహుల్‌గాంధీనైనా కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా చేయాల‌ని సూచిస్తున్నారు. కానీ, టార్చ్‌బేర‌ర్‌గా నిలిచేందుకు రాహుల్ స‌సేమిరా అంటున్నారు. నాయ‌కులంతా క‌లిసి పార్టీని పైకి తీసుకురావాలి కానీ, భార‌మంతా త‌న ఒక్క‌డిపైనే మోప‌డం స‌రికాద‌నేది గాంధీ వాద‌న‌. కానీ, రాహుల్ పిలుపున‌కు ఏ ఒక్క నాయ‌కుడూ ముందుకు రావ‌డం లేదు. రాహులే పార్టీని ముందుకు తీసుకురావాల‌ని కోరుతున్నారు. ఆయ‌న మాత్రం స‌మిష్టి బాధ్య‌త‌ను గుర్తు చేస్తున్నారు. ఇలా కొంత‌కాలంగా గ‌ళం విప్పుతున్న జీ-23 నాయ‌కుల విమర్శలకు తాజాగా సోనియాగాంధీ త‌న ప్ర‌క‌ట‌న‌తో చెక్ పెట్టారు. తానే కాంగ్రెస్‌కు తాత్కాలిక అధ్య‌క్షురాలిని కాద‌ని.. పూర్తిస్థాయి ప్రెసిడెంట్‌నంటూ.. పార్టీకి సుప్రీం లీడ‌ర్ అని తేల్చి చెప్పేశారు సోనియ‌మ్మ‌. 

ఓవైపు సీనియ‌ర్లు పార్టీ నాయ‌క‌త్వంపై అసంతృత్తి వ్య‌క్తం చేస్తుంటే.. ఇటీవ‌లే టీపీసీసీ చీఫ్ అయిన రేవంత్‌రెడ్డి మాత్రం తొలిరోజు నుంచే సోనియ‌మ్మ‌కి జై కొడుతున్నారు. మాట మాట‌కు సోనియ‌మ్మ నాయ‌క‌త్వం.. అంటూ సోనియా జ‌పం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ అధ్య‌క్షురాలిపై త‌న‌కున్న న‌మ్మ‌కం, నిబద్ద‌త‌ను త‌న మాట‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు రేవంత్‌రెడ్డి. క‌నీసం రేవంత్‌రెడ్డికి ఉన్నంత క‌మిట్‌మెంట్ కూడా సో కాల్డ్ సీనియ‌ర్స్ జీ-23 లీడ‌ర్స్‌కు లేక‌పోవ‌డం వ‌ల్లే కాంగ్రెస్‌కి ఈ దుస్థితి దాపురించిందనేది విశ్లేష‌కుల మాట‌.