హిమ శిఖరం బోస్ !!

హిమాలయాలకు ఉన్న ఖ్యాతి ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఎంతో విస్తృతంగా వ్యాప్తి చెందిన శిఖరాలు ఇవి. భారతదేశానికి పెట్టు గోడల్లా రక్షిస్తున్నాయి హిమాలయాలు. భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్ళు తమ ఉక్కు గుప్పిళ్లలో బంధించి, బానిసత్వాన్ని శాసించినపుడు, ఏళ్లకేళ్లుగా పోరాటాలు జరుగుతున్నా గొంతెత్తి గర్జించిన నాయకులు కొందరే ఉన్నారు.

అలాంటి సాహసవంతమైన నాయకులలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఒకరు. నేతాజీ అని బోస్ అనీ ముద్దుగా అందరూ పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ భారతీయ యువతకు బహుప్రియమైన నాయకుడు. ఉన్నత విద్యావంతుడూ, గొప్ప ఆలోచన, నేర్పయిన  వ్యూహాలు అందించగల సుభాష్ చంద్రబోస్ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం కోసం ఎన్నో గొప్ప ప్రణాళికలతో, వ్యూహాలతో ముందుకెళ్లారు. 

బాల్యం!!

బోస్ సంపన్నమైన కుటుంబంలో జన్మించారు. అందువల్ల బాల్యంలో ఇబ్బందులేవీ ఆయన్ను వెంటాడలేదు. తండ్రి లాయర్ కావడంతో మంచి జీవితం, ఉన్నత విద్య బోస్ కు లభించాయి. ఈయన తండ్రి కూడా జాతీయవాది కావడంతో ఆ ప్రభావం బోస్ పై ఆ నాటి నుండి పడిందని చెప్పవచ్చు. పాఠశాల, కాలేజీ విద్యలో ఎంతో మంచి విద్యార్థిగా నిలిచాడు బోస్. ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఎంతో ఉన్నతమైన భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి నాలుగవ స్థానంలో నిలిచారు. అంత సాధించినా భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే ఆలోచనతో ఆ సివిల్ సర్వీస్ నుండి బయటకొచ్చేసాడు. భారతజాతీయ యువజన విభాగంలో ఎంతో చురుకైన పాత్ర పోషించారు బోస్.

అణిచివేత!!

బోస్ లో ఉన్న ఉద్యమ స్ఫూర్తి ఎంతో గొప్పది. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలనే ఆలోచనతో ఎంతో తెలివిగా ప్రణాళికలు రచించేవారు. అందులో భాగంగానే సాయుధ పోరాటంతో బ్రిటీష్ వాళ్ళను ఎదిరిస్తే స్వాతంత్య్రం తప్పక వస్తుందని భావించి అటువైపు ఎన్నో ప్రయత్నాలు చేసారు. అయితే ప్రతిచోటా ప్రతిభ కలిగిన వారిని అణిచివేసి పలితాన్ని తమ పేరుతో చూసుకోవాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళ ద్వారా అణిచివేత మొదలయ్యింది.

అతివాదంలో అంతరార్థం!!

నిజానికి స్వాతంత్ర్య ఉద్యమంలో అతివాదులు, మితవాదులు అంటూ రెండు వర్గాలుగా చేసి ఎందరో నిజమైన నాయకులను అణిచివేసిన ఘనత, స్వాతంత్ర్య ప్రాముఖ్యతను తమ ఖాతాలో వేసుకున్న భారత నాయకులు ఉన్నారు. వాళ్ళందరి ఆలోచనల వెనుక స్వార్థమో, స్వలాభాపేక్షో బోలెడు ఉందని ఈ భారతంలో ఇంకా తెలుసుకోలేని మూర్ఖులు అంటూ ఎవరూ లేరనే అనుకోవచ్చు. నిజానికి వారసత్వ రాజకీయం భారతదేశంలో మొదలయ్యిందే ఆ స్వాతంత్ర్య ఫలితంలో అని కూడా అందరికీ తెలుసు.

నిందలు, విమర్శలు!!

భారగదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ కు శతృదేశాలను కలుపుకుని సాయుధ పోరాటానికి సిద్ధం కావాలని ఎన్నో ప్రణాళికలు వేసాడు బోస్. అయితే ఇది ఆయన మీద నిందలకు, విమర్శలకు దారి తీసింది. కొందరు మూర్ఖులు అవలంభిస్తున్న మార్గానికి ఇది వ్యతిరేకమని, గట్టిగా మాట్లాడేవారిని అతివాదులని అణిచివేస్తూ బోస్ ను కూడా వెనక్కు నెట్టిన చేతులు ఎన్నో ఉన్నాయి. 

జైహింద్ నినాదమొక సింహగర్జన!!

భారత్ యావత్తును ఉపేసిన నినాదం "జైహింద్". భారత యువతను చైతన్యపరిచి స్వాతంత్ర్య సంగ్రామనికి పిలుపునిచ్చిన శక్తి తేజం ఈ మాట. అది బోస్ గొంతు నుండి వింటే ఒకానొక సింహగర్జన దేశమంతా ధ్వనించినట్టే ఉండేదట. దేశాన్ని దేదీప్యమానంగా వెలిగింపజేయాలని ఆరాటపడిన బోస్ కు మాత్రం  దేశ బహిష్కరణ, దేశం నుండి వ్యతిరేకతలే లభించిన బహుమానాలు అనిపిస్తాయి.

అడుగడుగునా అన్యాయం!!

భారతజాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు ఎన్నికైనా ఆయన ఆ పదవిని వదిలేసుకున్నారు. దీనికి కారణం గాంధీ అనే విషయం అందరికీ తెలిసిందే. నేతాజీ చేసే ప్రతి పనీ మీద వ్యతిరేకత చూపించి ఆయన్ను పూర్తిగా భారతదేశ ఉనికి నుండి తప్పించాలని చూసింది కూడా వీళ్లే. చివరకు బోస్ చనిపోతే "సుభాష్ చంద్రబోస్ చాలా బాగా చనిపోయారు" అంటూ స్టేట్మెంట్ లు ఇచ్చింది కూడా ఆ అహింసా వాది, దేశ స్వతంత్ర్యాన్ని బ్రిటీష్ వారి నుండి తన గుప్పెట్లో పెట్టుకున్న వారే. 

కానీ చరిత్రలో ఎక్కడో నాలుగు పేజీలలో నిలిచిపోయిన ఈ సత్యాలు నేటి భారత పౌరులకు అక్కర్లేదంటూ ప్రభుత్వమే తమ వంశాలకు అనుగుణంగా పాఠాలను కూడా తయారు చేయించి దశాబ్దాల పాటు పౌరుల బాల్యం నుండే స్వతంత్ర్యానికి చిరునామాగా నిలుస్తూ ప్రతి బడిలోనూ పూజించబడుతూ ఉన్నాయి.

నిజమైన నాయకుల జీవితాలు తెలుసుకోవలసిన బాధ్యత అందరిమీదా ఉంది. చివరకు మరణం కూడా ఒకానొక మిస్టరీగా మిగిలిపోయిన బోస్ లాంటి వీరులను భారతం స్మరించుకోవాలి. ఆ హిమశిఖరాలకు, ఈ భూమికి, నదీనదాలకు తెలిసిన నిజం మనకూ తెలియాలి.

◆ వెంకటేష్ పువ్వాడ