ఎర్రటి ఎండలో గంటల తరబడి.. తండ్రిని కాపాడుకున్న తనయుడు

విలువిద్య నేర్పిన గురువు పరుశురాముడి అలసట తీర్చేందుకు ఆనాడు కర్ణుడు తన తొడ మీదనే  గురువుగారిని  పడుకోబెట్టుకున్నాడు. అదే సమయంలో పగబట్టిన కీటకం కర్ణుడి తొడను తొలిచి రక్తం కారుతున్నా గురువుగాారి నిద్రకు భంగం కలగకూడదన్న ఉద్దేశంతో కర్ణుడు పంటి బిగువున బాధను భరించాడు. అచ్చంగా అలాంటి దృశ్యమే మహబూబ్  నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో కనిపించింది. మద్యం సేవించిన తండ్రి తప్పటడుగులు వేస్తూ నడవలేని స్థితిలో కూలబడిపోతే... తన ఒడినే పాన్పుగా చేసి పడుకోబెట్టి కాపాడుకున్నాడు ఓ పిల్లవాడు. ఈ దృశ్యం చూసిన బాటసారులందరూ ఆ అబ్బాయి మనోస్థైర్యాన్ని చూసి ఆశ్చర్యపోవడం ఒక్కటే కాదు. తండ్రి తాగుబోతు అయినా కొడుకు సాహసాన్ని చూసి వేనోళ్ల ప్రశంసించారు. 

నెత్తి మీద నిప్పులు చెరుగుతున్న సూర్యుడు మాత్రమే కాదు.. నేల మీద ఒళ్లు బలిసిన ఎర్రచీమలు ఆ బాబు లేలేత కాళ్లను కుట్టి కుట్టి విసిగించాయి. అయినా ఆ అబ్బాయి మాత్రం తండ్రిని పక్కకు జరపలేదు. తండ్రి మీద ఎంతో ప్రేమను, బాధ్యతను, సానుభూతిని ప్రదర్శించాడు. చూపరుల చేత ఔరా.. అనిపించుకున్నాడు. ఇలాంటి కొడుకును కన్న ఆ తండ్రిని గురించి అందరూ ఆరా తీశారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొత్త తండాకు చెందిన మాన్యా నాయక్... తన మోపెడ్ ను బాగు చేయించుకునేందుకు జడ్చర్లకు వెళ్లాడు. వెళ్తూవెళ్తూ కొడుకు హరీష్ ను కూడా వెంట బెట్టుకొని వెళ్లాడు. మోపెడ్ ను షెడ్ లో ఇచ్చిన మాన్యానాయక్... అక్కడికి దగ్గరలోనే ఉన్న వైన్ షాప్ కు వెళ్లి మద్యం పుచ్చుకున్నాడు. మద్యం మోతాదుకు మించడంతో మాన్యానాయక్ అడుగులు తడబడ్డాయి. మోపెడ్ ఎక్కినా అది మాట వినడం లేదు. కళ్లు తేలిపోతున్నాయి. కాళ్లు మెలికలు తిరిగి దారి తప్పుతున్నాయి. నడుం నేలమీద వాలిపొమ్మంటోంది. దీంతో తండ్రి వాలకాన్ని గ్రహించిన హరీశ్... ఏది ఏమైనా ప్రయాణాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. కూలబడిపోయిన  తండ్రిని రోడ్డుపక్కకు లాక్కొని తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. తండ్రి నెత్తికి ఎండ తగలకుండా రుమాలు తొడిగి మొహానికి తన చిట్టి చేతులను అడ్డం పెట్టి విశ్రాంతికి వెసులుబాటు కల్పించాడు. నిండా 14 ఏళ్లు కూడా లేని హరీశ్ లో ఇంతటి మానసిక స్థైర్యం ఎలా వచ్చిందో తెలియదు కానీ... ఈ దృశ్యాన్ని చూసినవాళ్లంతా హరీశ్ సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అంతేకాదు... అక్కడ నేలమీద లావాటి ఎర్రచీమలు హరీశ్ కాళ్లమీద పాకుతూ విపరీతంగా కుట్టాయి. మామూలుగా ఒక్క ఎర్రచీమ కుడితేనే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పన్లేదు. కానీ లెక్కకు మించిన లావాటి ఎర్రచీమలు హరీశ్ లేలేత పాదాల మీద కాటేస్తున్నా అతను మాత్రం చలించలేదు. తండ్రిని పక్కకు జరపలేదు. మత్తు దిగేదాకా అలాగే ఉండిపోయాడు. 

చిన్నోడి పరిస్థితి చూసిన దారిన పోయేవాళ్లు కొందరు.. తండ్రి మొహం మీద నీళ్లు చల్లి అతి బలవంతం మీద కూర్చోబెట్టారు. తలకెక్కిన మత్తు దిగాక కొడుకు తన కోసం చూపిన సాహసాన్ని చూసిన మాన్యానాయక్ ఎంతో మురిసిపోయాడు. తప్పతాగిన తండ్రిని బజారులో వదిలేయకుండా కాపాడుకున్న హరీశ్ తెగువను చూసినవాళ్లంతా ప్రశంసించారు.