రొంపిచర్ల చారిత్రక ఆనవాళ్లను కాపాడాలి

నిర్లక్ష్యపు నీడలో కాకతీయ శాసనాలు భద్రపరచాలంటున్నప్లీచ్ ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామ శివారులోని వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద, వెళ్లే దారిలో గల నిర్లక్ష్యానికి గురైన క్రీ.శ. 10-13 శతాబ్దాల నాటి శిల్పాలు, శాసనాలను భద్రపరిచి, కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సిఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వారసత్వ సంపదను గుర్తించి, పరిరక్షించడానికి చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం (డిసెంబర్ 27) రొంపిచర్లలో పర్యటించి అనేక చారిత్రక ఆనవాళ్లను గుర్తించారు. ఊరు బయట, వినాయక ఆలయం ముందు రోడ్డుపైన, మదన గోపాల దేవాలయానికి వెళ్లే దారిలో, క్రీ.శ 10వ శతాబ్దికి చెందిన మహిషాసురమర్దిని, బ్రహ్మ, కుమారస్వామి, భైరవ, నంది విగ్రహాలు, ఇంకా కాకతీయ గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు విడుదల చేసిన రాతి శాసనాలు ఆలనా పాలనా లేక గడ్డి, గాదం మధ్య పడి ఉన్నాయన్నారు. తేది లేని గణపతి దేవుని శాసనం లో స్థానిక కేశవ దేవునికి, క్రీ.శ. 1320 నాటి ప్రతాపరుద్రుని శాసనంలో స్థానిక అనంత గోపీనాథ దేవుని అమావాస్య కొలుపులకు రెడ్ల చెరువు వెనక కొంత భూమిని దానం చేసిన వివరాలు, అలాగే క్రీ.శ. 1245 నాటి కోట భీమరాజు మంత్రి వల్లభుడు, రొంపిచర్లలో కట్టించిన గోపీనాథ ఆలయానికి కొంత భూమిని దానం చేసిన వివరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. రొంపిచర్ల గ్రామ చరిత్రకు సాక్ష్యాలైన ఈ శిల్పాలు, శాసనాలను కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు, ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గట్టుప్పల్ శ్రీనివాస్ పద్మ వంశీ, స్థపతి బి. వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Publish Date: Dec 27, 2024 5:27PM

వ్యూహాలు బెడిసికొట్టాయి.. కింకర్తవ్యం?

సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటన తదననంతర పర్యవశానాలను గమనిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు తెలుగు సినీ పరిశ్రమను తన గుప్పిటిలోకి తెచ్చుకోవడమే కాకుండా అటు బీఆర్ఎస్, బీజేపీలను కంగు తినిపించారు. చాలా దృఢంగా నిలబడి.. తెలుగు సీనీ పరిశ్రమ మెడలు వంచడమే కాకుండా.. సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటనను ఆసరాగా చేసుకుని రేవంత్ సర్కార్ ను బదనాం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీలు వేరు వేరుగా వ్యూహాత్మకంగా వేసిన అడుగులు తడబడేలా చేయగలిగారు. ఈ విషయం గురువారం (డిసెంబర్ 26) సినీ ప్రముఖులతో రేవంత్ జరిపిన భేటీ అనంతరం నిర్ద్వంద్వంగా స్పష్టమైపోయింది.    పుష్ప 2సినిమా ప్రీమియర్ షో సందర్భంగా  సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ గత 20 రోజులుగా కోమాలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  సంధ్యా థియోటర్ వద్ద తొక్కిసలాట  ఘటనకు పుష్ప2 సినిమా హీరో అల్లు అర్జున్ కారకుడన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై పై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ తరువాత హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో ఒక్క రాత్రి చంచల్ గూడా జైల్లో ఉన్న అల్లు అర్జున్ విడుదలయ్యారు. అది వేరు సంగతి. కానీ ఎప్పుడైతే పోలీసులు అల్లుఅర్జున్ పై కేసునమోదు చేశారో అప్పటినుండి బీఆర్ఎస్, బీజేపీలు పోటీలు పడి మరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్  చేస్తూ విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఈ విషయంలో ఆ రెండు పార్టీల నేతలూ  అల్లు అర్జున్ కు ఏకపక్ష మద్దతు ప్రకటిస్తూ రేవంత్ సర్కార్ తెలుగు సినీమా పరిశ్రమను తెలంగాణ నుంచి తరిమేయాలనుకుంటోందా అన్న లెవల్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. నేషనల్ అవార్డ్ గ్రహీత అల్లుఅర్జున్ పై పోలీసులు కేసు పెడతారా ? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, అటు బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ లాంటి సెలిబ్రిటీకే  తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలియదంటే ఇక సామాన్యులకు రేవంత్ రెడ్డి ఎవరో ఎలా తెలుస్తుందంటూ తనదైన స్టైల్ లో సెటైర్లు వేసి సంబరపడిపోయారు.   అల్లు అర్జున్ పై కేసు అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి చేయగ లిగినంతా చేశాయి బీఆర్ఎస్, బీజేపీలు. ఈ విషయంలో అల్లు అర్జున్ కు పోటీలు పడి మద్దతు తెలపడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం ఆ రెండు పార్టీలూ నేల విడిచి సాము చేయడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. దీంతో పరిస్థితి ప్రభుత్వం ఒక వైపు అల్లు అర్జున్, టాలీవుడ్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక వైపు అన్నట్లుగా మారిపోయింది.   అయితే గురువారం (డిసెంబర్ 27) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తరువాత బీఆర్ఎస్, బీజేపీలు అల్లు వెనుక ర్యాలీ అవ్వడం ఎంత హేతు రహితం అన్న విషయం ప్రస్ఫుటంగా తెలిపోయింది. సంధ్యా ధియోటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్ అత్యుత్సాహంతో నిర్వహించిన ర్యాలీయే కారణమని సినీ ప్రముఖులంతా ఆ భేటీలో అంగీకరించేసినట్లుగానే కనిపించింది. అంతే కాదు.. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని రేవంత్ వారికి కరాఖండీగా చెప్పడమే కాకుండా, రాష్ట్రంలో టాలీవుడ్ కు అన్ని విధాలా సహకారం అందిస్తానని చెబుతూనే పరిశ్రమ ప్రభుత్వానికి సహకరించి తీరాలని స్పష్టం చేశారు.  ఇక ఆ భేటీ తరువాత మరో విషయం ప్రస్ఫుటమైంది. సినీ ప్రముఖులంతా దాదాపుగా సీఎంకు సాగిలపడ్డారు.   తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు బెనిపిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండవన్న తన మాటకు కట్టుబడి ఉన్నట్లు రేవంత్ కుండబద్దలు కొట్టినా... ఆయనను పొగిడేందుకే సినీ ప్రము ఖులు పాటుపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేందుకు సహకరిస్తానని ముఖ్యమంత్రి చెప్పారనీ, అందుకు తమకు భారీ టాస్క్ ఇచ్చారనీ, దాని ముందు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు అంశాలు చాలా చిన్నవంటూ నిర్మాత దిల్ రాజు సినీ ప్రముఖుల తరఫున ప్రకటించేశారు. ఈ మెత్తం వ్యవహారంలో సినీ ప్రముఖులంతా సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ దే తప్పు అని అంగీకరించేసినట్లుగా కనిపిస్తోంది. ఈ సమావేశం వల్ల సినీ పరిశ్రమకు ఒరిగిందేమీ లేకపోయినా రేవంత్ ను పొగడడానికీ, ఆయనకు శాలువాలు కప్పడానికీ సినీ ప్రముఖులు పోటీలు పడటం చూస్తుంటే  సంధ్యా థియోటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పిదాన్ని అంగీకరించి.. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పరామర్శలకు క్యూకట్టినందుకు రేవంత్ కు సారీ చెప్పినట్లు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒక సారి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తరువాత రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని సీరియస్ గా తీసుకుందని అర్ధమైన తరువాత పరిశ్రమ పెద్దలలో ఒక స్పష్టమైన మార్పు కనిపించింది. తొలుత కమేడియన్ రాహుల్ రామకృష్ణతో మొదలై... నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వరకూ ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి సంధ్యా థియోటర్ తొక్కిసలాట ఘటనకు బాధ్యుడు అల్లు అర్జున్ అని చెప్పడానికి వెనుకాడటం లేదు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ ఒకింత స్పష్టంగానే అల్లు అర్జున్ నాలుగు కార్లతో ర్యాలీగా సంధ్యాథియోటర్ కు వెళ్లి రోడ్ షో చేయడం తప్పేనని కుండ బద్దలు కొట్టేశారు. గతంలో బాలకృష్ణ వంటి హీరోలు తమ సినీమాలను తొలి రోజు ప్రేక్షకులతో కలిసి చూశారనీ, అయితే వారెవరూ ఇలా రోడ్ షో చేయలేదని గుర్తు చేశారు కూడా.    హీరోలు కూడా సాధారణ మనుషులేనని భావిస్తే ఇలాంటి హడావుడి ఉండదని తమ్మారెడ్డి అల్లు అర్జున్ కు చురకలంటించారు.  దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ సంఘటనను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో రాజ కీయ లబ్ధి కోసం వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీఆర్ఎస్, బీజేపీల వ్యూహాలు వికటించాయి. దీంతో ఆ పార్టీ నేతలు కింకర్తవ్యం అన్న డైలమాలో పడ్డారు. 
Publish Date: Dec 27, 2024 3:11PM

అల్లు అర్జున్ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో న‌టుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ వాయిదా ప‌డింది. త‌న‌కు రెగ్యుల‌ర్ బెయిల్ ఇవ్వాల‌ని బ‌న్నీ నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ వేశారు. కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు పోలీసులు స‌మ‌యం కోర‌డంతో  కోర్టు విచార‌ణ‌ను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.   ఇక తొక్కిస‌లాట ఘ‌ట‌న నేప‌థ్యంలో బ‌న్నీని ఇటీవ‌ల పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే.   హైకోర్టు నాలుగు వారాల మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌డంతో విడుద‌ల‌య్యారు. మ‌రోవైపు నాంపల్లి కోర్టు ఈ నెల 13న విధించిన‌ 14 రోజుల రిమాండ్ నేటితో ముగియడంతో బ‌న్నీ ఈరోజు వ‌ర్చువ‌ల్‌గా న్యాయ‌స్థానం ముందు విచార‌ణ‌కు  హాజ‌ర‌య్యారు.  కాగా, సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విచార‌ణ‌నూ నాంప‌ల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 10న చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అదే రోజు బ‌న్నీ రిమాండ్‌పైనా కూడా విచార‌ణ జరపనుంది.
Publish Date: Dec 27, 2024 2:14PM

అరెస్టా.. విచారణా.. పేర్ని జయసుధ ముందున్న దారేది?

మాజీ మంత్రి ,  వైసీపీ కీలక నేత పేర్ని నాని  ఆయన కుటుంబం ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గోడౌన్ లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయం సంఘటనలో ఆ కుటుంబంపై కేసు నమోదైన సంగతి తెలసందే. ఇందుకు సంబంధించి వాస్తవాల వెల్లడి విషయంలో పేర్ని నాని, ఆయన సతీమణి, కుమారుడు పూర్తిగా విఫలమయ్యారు.  పోలీసుల నోటీసులు అందగానే గంపగుత్తగా కుటుంబం మొత్తంఅజ్ణాతంలోకి వెళ్లిపోయింది. దీంతో ఈ కేసు విషయంలో పేర్ని నాని కుటుంబానిదే తప్పు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.   జగన్ హయాంలోనూ, ఆ తరువాతా కూడా ఏ విషయంపైనైనా స్పందించడంలో, మీడియా ముందుకు వచ్చి వాగ్ధాటి ప్రదర్శించడంలో చురుకుగా ఉండే పేర్ని నాని.. తన కుటుంబంపై నమోదైన కేసు విషయంలో మాత్రం మౌనాన్ని ఆశ్రయిచడమే కాకుండా పోలీసుల నోటీసులకు సైతం స్పందించకుండా అజ్ణాతాన్ని ఆశ్రయించడమే ఆయన వైపే తప్పు ఉందన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు.   ఇదిలా ఉంటే పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన రేషన్‌ బియ్యం కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. మాయమైన రేషన బియ్యం బస్తాల సంఖ్య తొలుత వెలుగులోకి వచ్చిన దాని కంటే చాలా చాలా ఎక్కువ అన్న చర్చ జరుగుతోంది.  పేర్ని నాని సతీమణి పేరు మీద ఉన్న గోడౌన్‌ నుంచి  3,708 రేషన్‌ బియ్యం బస్తాలు మాయమయ్యాయని తొలుత అధికారులు తెలిపారు. ఆ తరువాత ఆ సంఖ్య తప్పు అంటూ సవరించి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య   4,840 అని చెప్పారు.  అయితే  తాజాగా ఇప్పుడు జయసుధ గోడౌన్ నుంచి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య   ఏకంగా 7,577 అని లెక్క తేల్చారు. గోడౌన్ నుంచి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య ఎంతో తేల్చడానికి నెల రోజుల సమయం ఎందుకు పట్టిందంటూ వైసీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోడౌన్ నుంచి భారీగా బియ్యం అక్రమంగా తరలించారని చెప్పడం కోసమే అంత సమయం తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే అధికార వర్గాలు మాత్రం ఇంత స్థాయిలో బియ్యం తరలించడం మామూలు విషయం కాదనీ,  పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చడానికి ఆ మాత్రం సమయం పడుతుందనీ చెబుతున్నారు. బియ్యం బస్తాల మాయం విషయంలో అవాస్తవముంటే..  మాయమైన బియ్యానికి  పేర్ని నాని తాలూకు న్యాయవాది డీడీలు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నిస్తారు.  ఇదంతా అలా ఉంచితే.. మరో వైపు పోలీసులు ఇచ్చిన నోటీసులపైన హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను పేర్ని నాని ఉపసంహరించుకున్నారు. కేసు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసు విచారణలో ఉండగా కేసుకు సంబంధించిన పలు అంశాలు తెరపైకి వస్తుండటం ఆసక్తి కరంగా మారింది.  గోడౌన్‌లో రేషన్‌ బియ్యం మాయమయ్యాయని పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై డిసెంబరు 10న పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. అంతే కాకుండా పేర్ని నాని జయసుధకు చెందిన గోడౌన్ నుంచి మాయమైన బియ్యం ఇప్పటికే   కాకినాడ పోర్టు నుంచి దేశం దాటేసిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు చేస్తున్నారు.   వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన పేర్నినాని తన భార్య పేర్ని జయసుధ పేరిట రేషన్ డీలర్ షిప్ తీసుకున్నారు.   ప్రభుత్వం నుంచి తమకు పంపిణీ కోసం అందిన బియ్యాన్ని తమ కుటుంబానికే చెందిన గోడౌన్ లో భద్రపరిచేవారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో  అధికారం మారిన తరువాత  అదే గోడౌన్ లో ఉండాల్సిన  బియ్యం నిల్వలు మాయం అయినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు అయ్యింది.  ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచినా వారు రాలేదు. అయినా పోలీసులు ఇప్పటి వరకూ వారినెవరినీ అరెస్టు చేయలేదు. ఈ లోగా పేర్ని జయసుధ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువరించిన తరువాత పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.  ఇంత జరిగినా పేర్ని నాని కనీసం స్పందించక పోవడంతో బియ్యం బస్తాల మాయం విషయంలో ఆయన కుటుంబం ప్రమేయం ఉందన్న వాదనకు బలం చేకూరుతోంది.  అయిన దానికీ కాని దానికీ తెలుగుదేశం, జనసేనలపై నోరెట్టుకు పడిపోయే పేర్ని నాని.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో తన కుటుంబంపై కేసు నమోదైనా కిమ్మనకపోవడంతో ఆయన కుటుంబం తప్పిదం ఉందన్న సంగతిని పరోక్షంగా అంగీకరించేసినట్లేనని అంటున్నారు. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టి మరీ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించినందున జయసుధకు కోర్టులో ఊరట దక్కే అవకాశాలు అంతంత మాత్రమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసిన ఆమె విచారణకు హాజరై ఉంటే కోర్టు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసి ఉండేదనీ, ఇప్పుడామె అజ్ణాతంలో ఉన్నందున కోర్టులో ఊరట లభించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనీ వివరిస్తున్నారు. కోర్టు అరెస్టు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చినా కూడా విచారణకు హాజరై తీరాల్సిందేనని జయసుధకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. 
Publish Date: Dec 27, 2024 1:31PM