అప్రూవర్ గా మారతా.. జగన్ కు విజయసాయి పరోక్ష హెచ్చరికేనా?

విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు. ఆ తరువాత ఆయన వ్యవసాయం చేస్తున్నానంటూ కొన్ని ఫొటోలూ, వీడియోలూ విడుదల చేసినా వైసీపీలో కంగారు, భయం తగ్గలేదు. అందుకు నిదర్శనమే విజయ సాయి పార్టీకి దూరమైన తరవాత చాలా రోజులకు జగన్ ఓ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావించకుండానే విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే జగన్ వ్యాఖ్యలను విజయసాయి ఖండించారు.  ఆ తరువాత మళ్లీ విజయసాయి వైసీపీకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా జగన్ కోటరీ అంటూ కొందరు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరుకి కోటరీ అంటూ పేర్లు ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలపైనే అని ఎవరికైనా ఇట్టే అవగతమౌతాయి.  కాకినాడ షేర్ల బలవంతపు బదలాయింపు కేసులో సీఐడీ విచారణకు విజయసాయి బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటలలో ఆయన వెల్లడించిన విషయాలు, ఆయన వినిపించిన ధిక్కార స్వరం ఇప్పుడు వైసీపీలో కలవరానికి కారణమయ్యాయి.  కాకతాళీయమే అయినా వైసీపీ ఆవిర్భావ దినం అయిన మార్చి 12నే విజయసాయి జగన్ కోటరీ గురించి4 చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని బాగా దెబ్బతీశాయి. వైసీపీ యువత పోరు కార్యక్రమం నుంచి అందరి దృష్టినీ మళ్లించాయి.    కాకినాడ పోర్టు విషయంలో సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే ‘కర్త కర్మ క్రియ' అని కుండబద్దలు కొట్టడం, అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రధాని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పడం ద్వారా వెనుక ఉన్న సూత్రధాని జగనేనా అన్న అనుమానాలకు తెరతీసేలా చేశారు విజయసాయిరెడ్డి. ఎందుకంటే వైవీ సుబ్బారెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఇద్దరూ జగన్ బంధువులే.  వీటికి సబంధించి అవసరమైతే ముందు ముందు మరిన్ని విషయాలు, వివరాలు వెల్లడిస్తానని విజయసాయి చెప్పడం ఒక రకంగా తాను అప్రూవర్ గా మారడానికి కూడా వెనుకాడనని విజయసాయి పరోక్షంగా జగన్ కు హెచ్చరిక జారీ చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో  జగన్ ప్రమేయం లేదని ఓ వైపు చెబుతూనే.. వైవీ సుబ్బారెడ్డి పుత్రరత్నమే కర్తాకర్మాక్రియా అనడం ద్వారా జగన్ ప్రమేయం, అంగీకారం లేకుండానే విక్రాంత్ రెడ్డి ఇంత పెద్ద వ్యవహారం చక్కబెట్టగలడా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యేలా చేశారు విజయసాయిరెడ్డి. ఇక్కడే తన వ్యాఖ్యలతో వైసీపీయులు తనపై విమర్శల దాడికి పాల్పడకుండా విజయసాయి చెక్ పెట్టారంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు విజయసాయిరెడ్డిపై వైసీపీయులు తమకు మాత్రమే చేతనైన రీతిలో విమర్శల దాడికి దిగితే.. జగన్ ఇబ్బందుల్లో పడేలా విజయసాయి గళం మరింత పెంచుతారన్న భయం వారిలో పాదుకునేలా చేయడంలో విజయసాయి విజయం సాధించారని చెబుతున్ేనారు. ఇప్పుడు విజయసాయిని రెచ్చగొడితే  జగన్ పై పది సీబీఐ, 11 ఈడీ కేసులలో ఏ2 అయిన విజయసాయి అప్రూవర్ గా మారితో కొంప కొల్లేరౌతుందని వారికి తెలుసు. అందుకే దొంగకు తేలు కుట్టిన చందంగా విజయసాయి వ్యాఖ్యలపై అరకొర ఖండనలకే వైసీపీయులు పరిమితమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అప్రూవర్ గా మారతా.. జగన్ కు విజయసాయి పరోక్ష హెచ్చరికేనా? Publish Date: Mar 13, 2025 4:55PM

అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.   అంతకు ముందు స్పీకర్ ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు ఆయన తీరు బాధాకరమన్నారు. స్పీకర్ ను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడటం సరికాదని చెప్పారు. నిబంధనల ప్రకారం సభ్యులోవరూ స్పీర్ పై వ్యాఖ్యలు చేయరాదనీ, ఆయన అధికారాలను ప్రశ్నించరాదనీ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జగదీశ్ రెడ్డిని ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనితో స్పీకర్ జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.  
అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ Publish Date: Mar 13, 2025 4:30PM

యూట్యూబర్ సన్నీయాదవ్ పై కేసు 

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయ్యా  సన్నీ యాదవ్  పై సూర్యపేట  పిఎస్ లో కేసు నమోదైంది.  ఇటీవలె బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.  బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నవారిపై తెలంగాణ పోలీసులు ఉక్కు పాదం మోపారు.   ఇందులో భాగంగా  సూర్యపేటకు చెందిన యూట్యూబర్ సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రూల్స్ కు వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చని  తన యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నసన్నీయాదవ్ పై కేసు నమోదైంది. ఒక ఎలక్ట్రానిక్ షాప్ లోకి వెళ్లి బైక్ రైడింగ్ కు సంబంధించి కెమెరాలను  సన్నీయాదవ్ కొనుగోలు  చేశాడు. బెట్టింగ్ యాప్ ల  ద్వారా సంపాదించిన సొమ్ముతోనే కెమెరెలాను కొనుగోలు చేసినట్టు సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన ఐపిఎస్ అధికారి సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో సూర్యపేట పోలీసులు కేసు నమోదు చేసి బన్నీ సన్నీయాదవ్ ను అరెస్ట్ చేయడానికి సిద్దమయ్యారు. 
యూట్యూబర్ సన్నీయాదవ్ పై కేసు  Publish Date: Mar 13, 2025 3:49PM

2027 నాటికి పోలవరం పూర్తి!

జగన్ హయాంలో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం సందర్శనతోనే ప్రారంభించారు. తద్వారా పోలవరం ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను చాటారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. చంద్రబాబు కృషి కారణంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు వెల్లువెత్తుతున్నాయని చెప్పిన ఆయన ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టుకు 5052 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా వచ్చాయన్నారు.   జగన్ హయాంలో కేంద్రం విడుదల చేసిన పోలవరం రీయింబర్స్‌మెంట్ నిధులను దారి మళ్లించిందనీ, ప్రాజెక్టు పనులను పక్కనపెట్టేసి పోలవరంను నిర్వీర్యం చేసిందనీ రామానాయుడు విమర్శించారు.  ప్రస్తుతం  పోలవరం పనులను కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో పరుగులు పెట్టిస్తోందని వివరించారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసేలా, డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామని   తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం రెండు కట్టర్లను ఉపయోగిస్తూ.. 136 మీటర్ల పొడవున, 6700 చదరపు మీటర్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఏప్రిల్ మొదటివారం నుంచి డి వాల్ నిర్మాణానికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు.  పోలవరం ప్రాజెక్టు  నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం 990 కోట్ల రూపాయలను ఒకే విడతగా వారి వారి ఖాతాల్లో జమచేసిందన్నారు. 
2027 నాటికి పోలవరం పూర్తి! Publish Date: Mar 13, 2025 3:38PM

అది తప్పుడు కేసు!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లురు రాజశేఖర్ రెడ్డిపై వివేకా పిఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసని పోలీసులు నిర్ధారించారు. వైసీపీ హయాంలో కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు డాక్టర్ సునీత, రాజశేఖరరెడ్డిలతో పాటు అప్పటి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అది తప్పుడు కేసు అని పోలీసులు ఇప్పుడు తేల్చారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం నత్తనడకన సాగిన వివేకా హత్య కేసు దర్యాప్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేగం పుంజుకుంది.  ఈ దర్యాప్తులో భాగంగా సునీత, రాజశేఖ్ రెడ్డి, రామ్‌ సింగ్‌పై వివేకా పీఏ తప్పుడు కేసు పెట్టారని విచారణలో తేలిందని  పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు జమ్మలమడుగు కోర్టులో చివరి ఛార్జ్‌షీట్‌ను పులివెందుల డీఎస్పీ దాఖలు చేశారు. పులివెందుల మెజిస్ట్రేట్‌ సెలవులో ఉన్నందున జమ్మలమడుగు కోర్టులో సమర్పించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన సాక్షులు వరుసగా మరణించడంపై ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో సాక్షుల మరణంపై లోతుగా మళ్లీ దర్యాప్తు చేయాలని డీజీపీని ఆదేశించింది.
అది తప్పుడు కేసు! Publish Date: Mar 13, 2025 3:19PM