అసెంబ్లీ అంటే అంత చులకనా?

బుధవారం నాడు కేసీఆర్ అసెంబ్లీకి వెళుతున్నారు? అవును ఇందులో విశేషం ఏముంది? మొన్నామధ్య ఏపీలో మాజీ సీఎం జగన్ కూడా వెళ్లొచ్చారు కదా! బుధవారం మంచి రోజు. చాలా పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. అందుకే ఇన్నాళ్లూ అసెంబ్లీ మెహం చూడని కేసీఆర్ ఇప్పుడు వెళ్లాలనుకున్నారేమో. అసెంబ్లీలో ఆయన స్థాయి వ్యక్తులు లేరని ఆయన కుమారుడు కేటీఆర్ చెబుతున్నారు కదా! అందుకే వెళ్ల లేదు అనుకుందాం!  మరి ఇప్పుడు ఎందుకు వెళుతున్నారు? అసెంబ్లీ బిజినెస్ రూల్ ప్రకారం నిర్ణీత గడువులోగా సమావేశాలకు హాజరు కాకపోతే శాసన సభ్యత్వం రద్దువుతుందట కదా! మరి ఈయన (కేసీఆర్) ఆయన (జగన్)కు చెప్పారో!  లేక ఆయన ఈయనకు గుర్తు చేశారో తెలియదు కానీ, మొత్తానికి సభ్ోయత్వం రద్దవుతుందని భయపడుతున్నారా!  సార్ కి భయం గియం జాన్తానై. సభలో రేవంత్ రెడ్డినీ, ఆయన గణాన్నీ కడిగిపారేయడానికే అసెంబ్లీకి పోతున్నారని ఆయన అభిమానులు అంటున్నారు.  అయితే ఆ విషయం రెండో రోజు సభకు వెళితేగానీ తేలదు. శాసనసభ్యత్వం రద్దయితే మళ్లీ ఎన్నికలొస్తాయి. ఇంకా నలుగేళ్ల గడువు ఉండగానే, జనంలో గాలి అటూ ఇటూగా ఉన్నప్పుడు ఎన్నికలొస్తే.. అబ్బో ఇప్పుడే ఎందుకు లే ఈ లొల్లి అనుకున్నారా!  అయినా సారుకి ఎన్నికలు కొత్తగాదు. రాజీనామాలూ కొత్తగాదు. గతంలో బాజాప్తు రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లిన అనుభవం జాస్తిగానే ఉంది.  ఇదంతా కాదు గానీ, ఈ సభకు గైరు హాజరయ్యే వారికి జూసి పై నుంచి శీనన్న (కీర్తిశేషులు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి) గుర్రుగుర్రు మంటున్నారు.  ఎందుకంటే ఆయన చిన్నప్పుడు బడికైనా మానేశారు ఏమో గానీ, అసెంబ్లీకి ఏనాడూ గైరు హాజరు కాలేదు. ఆయన బతికినన్నాళ్లూ శాసనసభా సమావేశాలకు ‘నాగా’ లేకుండా వెళ్లారు. అఖరుకి ఆయనకి సీట్లో కూర్చోడానికి వీలు లేని అనారోగ్య పరిస్థితిలో కూడా ప్రత్యేకమైన దిండు తెప్పించుకుని మరీ కూర్చున్నారు. జీవిత చరమాంకంలో ఆస్పత్రి బెడ్ పై ఉండి కూడా అసెంబ్లీకి వెళ్ల లేకపోయానని అల్లాడిపోయారు. ఆయన  రోగం బాధ కన్నా, అసెంబ్లీకి వెళ్లలేకపోయాననే ఎక్కువ బాధపడ్డారు. ఆయన చాదస్తం గూల అసెంబ్లీయే దేవాలయం అనుకున్నారు. మరి ఇప్పుడు ఈ నేతల ధోరణి ఏంది?  బడికి వెళ్లనని మారం చేసే పిల్లగాడిలా ఏవేవో సాకులు చెబుతున్నారని విజ్ణులైన జనం విస్తుపోతున్నారు.  ఏపీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, తెలంగాణలో నా సాటి ఎవరూ లేరని హాజరు కాకపోవడంపై జనం విస్మయం చెందుతున్నారు.  అధికారం ఉంటేనే సభకు వెళతాం అనే వీళ్ల ధోరణిని ఓట్లు వేసిన జనం ఎగతాళి చేస్తున్నారు.  గతంలో ఏ హోదా లేని శాసనసభ్యులు సైతం సభకు హాజరై ప్రజా సమస్యలపై గళమెత్తి మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలను సైతం ఎండగట్టారు.   పి.జనార్ధర్ రెడ్డి వంటి నేతలు, చంద్రబాబుని ఏలేరు స్కాం పై ఆడుకున్నారు. మరుగున పడిన ఎన్నో అంశాలు సభలో అధికారపక్షానికి చెమటలు పట్టించాయి. వారి ధాటిని తట్టుకోవడానికి అధికార పక్షం స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేసి జవాబు లేని  సమస్యల నుండి తప్పించుకునేందుకు. సభను దారి మళ్లించేందుకు ప్రయత్నించడం ప్రారంభించింది. చివరకు అదే అసెంబ్లీ ఎజెండాగా అయ్యింది.  ఇప్పుడు అధికార, ప్రతిపక్షాలు సభలో సమంగా ఉన్నా, ప్రజా సమస్యలపై చర్చించకుండా, ఒకరినొకరు నిందించుకుని సమస్యలను దాటవేయడం పరిపాటి అయ్యింది.  అందువల్లే శాసన సభ అంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.  ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆర్టీసీ బస్సులో సభకు రావడం, చంకలో ఫైల్స్, పేజీల మధ్య స్లిప్పులతో కళాశాలకు అధ్యాపకులలాగా హాజరవడం గుర్తుకొస్తున్నాయి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతల స్ఫూర్తి, రజబలీ, నర్రా రాఘవరెడ్డి, బోడేపూడి వెంకటేశ్వరరావు, ఓంకార్ వంటి ఎందరో పెద్దలు పాటించిన సభా మర్యాదలు, నియమాలు ఇప్పటి తరానికి ఎవరు చెప్పాలి అంటున్నారు పెద్దలు. సభలో ఒక్కో అంశంపై వారు నిలదీసిన తీరు ఏ సినిమాలో చూడగలం. మహిళలు ప్యాషన్ వస్త్రాల పట్ల మోజు చూపినట్లు, నేటి నేతల హంగూ ఆర్భాటాలు వారు అసెంబ్లీకి వేసుకొచ్చే వాహనాలు చూస్తే తెలుస్తుంది. పోటీలు పడి పెద్దపెద్ద కార్లలో ర్యాలీ చేయడమే నేటి తరం నేతలకు తెలిసిన విద్య. కూటికి జరక్కకొందరు,  పంటనష్టపోయి అప్పులపాలై  అత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నల పరిస్థితులు వీరికి పట్టవా అని ప్రశ్నిస్తున్నారు.  ఆనాడు శాసన సభ్యులకు ఇచ్చిన వేతనం వేలల్లోనే ఉండేది. ఆ జీతం కూడా కొందరు తమ పార్టీకి విరాళంగా ఇచ్చే వారు. నేడు సభ్యులకు లక్షల్లో జీతభత్యాలతో పాటు ఆఫీసుని, సహాయకుల్ని కూడా ఇస్తోంది. ఏటా లక్షలాది రూపాయల ప్రజాధనం వేతనంగా పొందుతున్నందుకైనా నేతలు సభకు వెళ్లనక్కర్లేదా!  పదివేల జీతం తీసుకునే ఉద్యోగి పరిధికి మించి సెలవు పెడితే యాజమాన్యం జీతంలో కోత పెడుతుంది. మరి అధికారం దక్కలేదనో, అవమానం తట్టుకోలేమనో సభకు హాజరు కాని వారి జీతాలు ఎవరు కోయాలి. జీతం కన్నా బాధ్యతగా భావించే శాసననసభ్యులు ఎవరో జనం గుర్తించి కోత పెట్లాలంటే మళ్లీ అయిదేళ్లు నిరీక్షించాల్సిందేనా!  అని విజ్ణులైన పెద్దలు ప్రశ్నిస్తున్నారు. 
అసెంబ్లీ అంటే అంత చులకనా? Publish Date: Mar 11, 2025 6:33PM

వల్లభనేని వంశీ.. మరో రెండు వారాలు కటకటాల వెనుకే!

వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరైస్టు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ రింమాండ్ గడువు పూర్తి కావడంతో  పోలీసులు వంశీని వర్చువల్ గా కోర్టులో హాజరు పరిచారు. జూమ్ కాల్ ద్వారా వంశీని విచారించిన మేజిస్ట్రేట్ వంశీ రిమాండ్ ను ఈ నెల 25 వరకూ పొడిగించారు.  వాస్తవానికి వల్లభనేని వంశీ అరెస్టు వంశీ స్వయంకృతాపరాధమే అని చెప్పవచ్చు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉంది. తీర్పు వెలువడే వరకూ కోర్టు నుంచి ఆయన అరెస్టు కాకుండా రక్షణ కూడా ఉంది. ఆ పరిస్థితుల్లో కుట్రపూరితంగా కేసే లేకుండా చేసుకోవాలని వంశీ చేసిన ప్రయత్నమే ఆయన అరెస్టుకు దారి తీసింది. విషయంలోకి వెడితే..  తెలుగుదేశం టికెట్ పై 2019 ఎన్నికలలో గన్నవరం నుంచి విజయం సాధించి..  ఆ తరువాత వైసీపీలోకి జంప్ చేసిన వల్లభనేని వంశీ.. పార్టీ ఫిరాయించి ఊరుకోలేదు.  తెలుగుదేశం నాయకులు, క్యాడర్ లక్ష్యంగా దాడులు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే గన్నవరం నియోజకవర్గంలో నామరూపాల్లేకుండా చేయాలన్న కుట్రలు చేశారు. తెలుగుదేశం అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించేశారని చెప్పవచ్చు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించి సానుభూతితో గెలిచేద్దామన్న ప్రయత్నాలూ చేశారు. అవేమీ ఫలితాన్నివ్వలేదు. జనం ఆయనను ఛీ కొట్టారు.  సరే ఆ ఎన్నికలలో వంశీ పరాజయం పాలయ్యారు. వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయి..కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిల పడింది.  పార్టీ ఓటమి పాలైన క్షణం నుంచీ వంశీ దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నారు. బయటకు వస్తే పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో నక్కినక్కి గడుపుతున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన అనుచరులపైనా కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అనుచరులు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ కూడా అరెస్టు భయంతో యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించి, అరెస్టు భయం నుంచి తాత్కాలిక ఊరట పొందారు. ఆయనకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయలేదు కానీ, ఆయన పిటిషన్ విచారణ పూర్తై తీర్పు వెలువడే వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. సరిగ్గా ఈ తరుణంలోనే వల్లభనేని వంశీ తన కుట్రలకు తెరతీశారు.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిను కిడ్నాప్ చేసి, బెదరించి కేసు ఉపసంహరణకు అఫడివిట్ దాఖలు చేసేలా చేశారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడే రివర్స్ అయ్యే సరికి అంతా వంశీపై కేసు వీగిపోయిందనే భావించారు. అయితే అధికారంలో ఉండగా ఇష్టారీతిగా వ్యవహరించినా సాగినట్లు.. అధికారం లేని సమయంలో కూడా సాగుతుందని వంశీ ఎలా భావించారో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన కిడ్నాప్, బెదరింపు కేసులో అరెస్టయ్యారు. ఆ కేసులోనే ఇప్పుుడు ఆయన రిమాండ్ ను కోర్టు రెండు వారాలు పొడిగించింది.  
వల్లభనేని వంశీ.. మరో రెండు వారాలు కటకటాల వెనుకే! Publish Date: Mar 11, 2025 4:32PM

అధికారి ఆయనే.. అధికారం మాత్రం ఆమెది!

రోజులు మారి పోతున్నాయి. మనుషులు మారి పోతున్నారు. విలువలు జారిపోతున్నాయి. ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు ఇంకా వేగంగా మారిపోతున్నాయి. మరి, ఆకాశం లో సగంగా ఉన్న మహిళలూ కాలంతో పాటే అన్నట్లు  ఇంకో అడుగు ముందుకు వేస్తున్నారు. ఇంకా ఎంత కాలమని  వంటింటికే పరిమితం అనుకుంటున్నారో ఏమో, పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఏపీలో ప్రభుత్వ అధికారుల శ్రీమతులు కొందరు, అధికారం లో కి వచ్చిన నేతల ధర్మపత్నులు ఇంకొందరు అక్రమ వసూళ్ల కు నడుం బిగించారు. మాకు గోడలు లేవు అంటూ స్వయం ఉపాధి లాగ రంగంలో దూసుకు పోతున్నారు. భర్త హోదా, అధికారమే పెట్టుబడిగా  కుటుంబ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తున్నారు.  డబ్బు సంపాదించడం ముఖ్యం కానీ, ఎలా అన్నది కాదు కదా? అయినా, అవినీతి ఇప్పుడే పుట్టిందా ..ఏంటి? అన్నట్టు ఉంది వారి తీరు. అవును. అవినీతి ఎప్పుడు, ఎక్కడ. ఎలా  పుట్టిందో ఏమో కానీ, ఇప్పడు అవినీతికి ఎల్లలు లేవు. హద్దులు,సరిహద్దులు అసలే లేవు. అవినీతి సర్వాంతరయామి. ఇక్కడ వుంది, అక్కడ లేదు అన్న సదేహం లేకుండా విశ్వం అంతటా వ్యాపించింది. భగవంతుడు ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు,(ఇందుగలడందు లేడని/సందేహము వలదు చక్రి సర్వోపగతుండు) అంటాడు ప్రహ్లాదుడు. అందుకే వారు డబ్బు లోనే పరమాత్మ ను వెతుక్కుంటున్నారు.అవినీతి విషయంలో మాత్రం అలాంటి సందేహం అస్సలు అవసరం లేదు. అంతటా వుంది. అన్నిటా వుంది.  సందేహం లేదు. నిజానికి,  ఇప్పడు కాదు, ఎప్పుడోనే, స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ , Corruption is an international phenomenon, ‘విశ్వ  లక్షణం’, విశ్వం అంతటా వుంది, మన దేశంలోనూ వుంది, ఉంటుంది, అంటూ’ అవినీతి విశ్వ రూపాన్ని వివరించారు. అంతేకాదు, అవినీతి గురించి, చొక్కాలు చింపుకోవద్దని, విపక్షాలకు జ్ఞాన బోధ కూడా చేశారు.  ఇందిరమ్మ ఇచ్చిన భరోసాతోనో  ఏమో, ఆనాటి నుంచి మన దేశంలో అవినీతి, ఇంతింతై వటుడింతై  అన్నట్లు   పెరిగిపోతూనే వుంది. ఎసీబీలు, సిబిఐ,ఈడీ ఇంకా.. ఇతర అవినీతి నిరోధక శాఖలు, అవినీతి వ్యతిరేక చట్టాలు, ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేసే   న్యాయ వ్యవస్థ, ఎన్నున్నా, ఏమి చేసినా, ఆకులు వేసే వారు వేస్తుంటే, తీసేవారు తీస్తున్నారు అన్నట్లు ఎవరి  ‘పని’ వారు చేసుకు పోతున్నారు. అంతే కాదు, ఆరు నెలలు  స్నేహం చేస్తే వారు వీరవుతారు అన్నట్లు  న్యాయవ్యవస్థ సహా అవినీతి నిరోధక వ్యవస్థలు అన్నిటికీ కూడా అవినీతి సోకిందని,పాకిందని కథలు వింటున్నాం. అయ్య గారు చెయ్యక పోతే అమ్మ గారు చేస్తారు గా అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. కావలసినదంతా ఒక్కటే, చేతిలో శాలువాలు, దేవుడి ప్రసాదం, ఆశీర్వచనాలు చెప్పే పంతులుగారు పక్కన ఉంటే , డబ్బు సంచి తేలిగ్గా చేతులు మారి పోతుంది. గత ప్రభుత్వం లో ఈ పద్ధతి బాగా పని చేసింది అంటున్నారు. కంచే చేను మేసిన కథలు అనేకం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. అంతే కాదు, ఒకప్పడు లంచం అంటే ఏదో చాటు మాటు వ్యవహారంగా సాగేది. కిందిస్థాయి ఉద్యోగులు, వేడి నీళ్ళకు చలి నీళ్ళు’ అన్నట్లు బల్ల కింద చేతులు పెట్టి పదీ పరక పుచ్చుకోవడం ఉండేది. అందులోనే, అంతో ఇంతో పై అధికారుల చేతులు తడపడం ఉంటే ఉండేదేమో. నిజంగానే, అప్పట్లో ఇందిరా గాంధీ అన్నట్లుగా, ఇప్పుడు అదో పెద్ద సమస్య కాదు. అందుకే, అప్పట్లో సినిమాల్లోనూ, లంచాలు ఇచ్చి పుచ్చుకోవడాలు కామెడీ ట్రాక్ కు మాత్రమే పరిమితంగా ఉండేది.అలా కామెడీ, ట్రాక్ కు మాత్రమే పరిమితం అయిన లంచావతారాలు తర్వాత తర్వాత టైటిల్’ రోల్  కి చేరుకున్నాయి. దాసరి  నారయణ రావు, ఏకంగా ‘లంచాచాతరం’ టైటిల్ తో ఫుల్ లెంగ్త్ సినిమానే తీశారు. అలాగే, అవినీతిని ఎండగడుతూ, సమాజాన్ని చైతన్య పరిచే ప్రయత్నంలో భాగంగా ఠాగూర్ , భారతీయుడు , అపరిచితుడు వంటి సినిమాలు వచ్చాయి. సినిమాల దారి సినిమాలది అవినీతి దారి అవినీతిది అన్నట్లు రియల్ స్టోరీ నడుస్తోందనుకోండి అది వేరే విషయం.  అదెలా ఉన్నా ఇప్పడు అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. మంత్రుల పేషీలు, ఐఎఎస్  చాంబర్లు దాటి, ఉన్నతాధికారుల వంటిటికీ చేరింది. అవును. ఆంధ్ర ప్రదేశ్ లో అందరూ కాదు కానీ,కొందరుసీనియర్ అధికారులు, నిండా మునిగినాక చలేమిటి,అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన  అవినీతి అరాచకత్వం,ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గతంలో చేసిన తప్పులకు కొందరు ఐఎఎస్ అధికారులు కేసులు ఎదుర్కున్నారు. అందులో కొందరు  జైలు ఊచలు లెక్క పెట్టారు. అయినా, ఆ ఐఎఎస్ ల తీరు మారలేదు. ఇప్పడు అధికారుల అవినీతికి సంబంధించి వస్తున్న చిత్ర విచిత్ర కథలు, కథనాలు  విస్మయానికి గురిచేస్తున్నాయి.  అన్నిటినీ  మించి కొందరు అధికారుల అవినీతిని  ఫ్యామిలీ బిజినెస్ గా మార్చేశారు. ఇంకొందరు అధికారుల భార్యలు, తమ భర్త   హోదా  పెట్టుబడిగా, హోటళ్ల లో మీటింగ్లు పెట్టి , స్వయం ఉపాధి లాగా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఏకంగా   ఏ పనికి ఎంత రేటన్నది ఫిక్స్ చేసి, రేట్ కార్డు ప్రకారం, పనిచేస్తున్నట్లు జనం కథలు కథలుగా  చెప్పుకుంటున్నారు. నియంత్రించాల్సిన పాలకులే ఎన్నికల్లో పోయిన సొమ్ము రాబట్టు కునే పనిలో ఉంటే , దీనికి అడ్డు చెప్పేవారు ఎవరు?  సీట్లు, ఓట్లు కోసం కోట్లు ఖర్చు పెట్టి చేతులు ముడుచుకుని కూర్చుంటే రేపటి పరిస్థితి ఏమిటి? అని ఓపెన్  గానే ప్రశ్నిస్తున్నారు. మంచి పోస్టులు కోసం అధికారుల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్న నేతలు మాత్రం ఏమి అదుపు చేస్తారు? ఎవరిని చేస్తారు? కంచే చేను మేస్తుంటే, మిగతా వారు దూడలు గా మారి పోరా?  అవినీతి కొత్త కాదు కానీ , మార్గాలే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రేపటి కోసం ఏం చేయగలం.
అధికారి ఆయనే.. అధికారం మాత్రం ఆమెది! Publish Date: Mar 11, 2025 4:22PM

తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటలకే.. లైన్ క్లియర్ అయ్యిందా?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికన్న విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చేసిందా? గత కొంత కాలంగా అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో కమలనాథులు చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చేసిందా? అంటే పార్టీ వర్గాలే కాదు పరిశీలకులు కూడా ఔననే సమాధానం ఇస్తున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోరులో అధిష్ఠానం జోక్యంతో లైన్ క్లియర్ అయిపోయిందనే అంటున్నారు.  బీసీ వర్గానికి చెందిన ఈటలకే అధిష్ఠానం అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టనున్నదని చెబుతున్నారు. ఇటీవల ఈటల ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవ్వడంతో. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కసరత్తును పార్టీ అగ్రనాయకత్వం ముగించేయడమే కాకుండా, ఈటలనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసేసిందని అంటున్నాయి.  గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యం అంటూ బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న కొన్ని చర్యలు, నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. దీంతో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేక చతికిల పడింది. అధికారం సంగతి అటుంచి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు కూడా సంపాదించలేకపోయింది. ఎప్పటిలాగే సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో  సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అవి కొంత మేర ఫలించి కాంగ్రెస్ తో సమానంగా రాష్ట్రంలో లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోవడం వల్లనే బీజేపీ ఆ మాత్రం లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగిందని కమలనాథులకు అర్ధమైంది.  ఇప్పుడు ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం అన్వేషణ ప్రారంభించింది. గత ఎన్నికలకు ముందు వరకూ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు  చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రంలో పార్టీన బలోపేతం చేయడమే కాకుండా..  బీజేపీని అప్పటి అధికార బీఆర్ఎస్ తో దీటుగా తలపడే స్థాయికి ఎదిగేలా చేశారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆయనను పార్టీ హైకమాండ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. అయితే పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న ఈ చర్య సానుకూల ఫలితాల సంగతి అటుంచి పార్టీలోనే తీవ్ర నిరసనను ఎదుక్కొంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో అంచనాలను అందుకోలేకపోయింది.  సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓ మేరకు మెరుగైన ఫలితాలను సాధించగలిగినా, ఆ క్రెడిట్ మాత్రం కిషన్ రెడ్డి ఖాతాలో పడలేదు. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి బాధ్యతలు కూడా ఉండటంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎపింక చేసి నియమించాలని నిర్ణయించింది. అయితే తెలంగాణలో పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా  కొత్త అధ్యక్షుడి ఎంపిక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా పార్టీ రాష్ట్ర పగ్గాలు మల్కజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు కట్టబెట్టనున్నారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఈటలకు పార్టీ రాష్ట్రపగ్గాలు అప్పగించే విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు తీవ్ర వ్యతిరేకత కనబరిచారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే విషయంలో బీజేపీ వెనకడుగు వేసింది. కిషన్ రెడ్డినే కొనసాగించింది. అయితే ఇప్పుడిక హైకమాండ్ మల్లగుల్లాలకు చెక్ పెట్టేసిందని వినిపిస్తోంది.  ఒక వైపు ఎంత వ్యతిరేకత పొడసూపినా కర్నాటక బీజేపీ పగ్గాలు గాలి జనార్దన్ రెడ్డికి అప్పగించేందుకు రెడీ అయిపోయిన బీజేపీ అగ్రనాయకత్వం అదే సూత్రాన్ని తెలంగాణలోనూ అమలు చేసి ఈటలను కన్ ఫర్మ్ చేసేసిందని అంటున్నారు. అందుకు తార్కానంగా ఈటల సతీసమేతంగా హస్తిన వెళ్లి మోడీతో భీటీ కావడాన్ని చూపుతున్నారు.  
తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటలకే.. లైన్ క్లియర్ అయ్యిందా? Publish Date: Mar 11, 2025 3:11PM

ఎస్ఎల్ బిసి టన్నెల్ లోకి వెళ్లిన అన్విరోబో 

ఎస్ ఎల్ బిసి టన్నెల్ లోకి  రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. గత నెలలో ఘటన జరిగినప్పటికీ కనిపించకుండాపోయిన  8 మంది సిబ్బంది కోసం 17 రోజుల నుంచి వెతుకుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కేరళ నుంచి జాగిలాలను రప్పించి డీ కంపోజ్ అయిన మృతదేహాలను వెతుకుతున్నారు. పంజాబ్ కు చెందిన గురు ప్రీత్ సింగ్ డెడ్ బాడీని  గుర్తించిన డాగ్ స్క్వాడ్ మరో రెండు మృత దేహాలను గుర్తించింది.  కేరళ నుంచి వచ్చిన డాగ్ స్వాడ్ జిపిఏ ద్వారా స్కాన్ చేసిన ప్రాంతంలోనే  డెడ్ బాడీ ఉన్నట్టు గుర్తించింది. మద్రాస్ ఐఐటి విద్యార్థులు తయారు చేసిన అన్వి రోబో టన్నెల్ లోకి వెళ్లింది. టిబిఎం మెషీన్ నుంచి 20 మీటర్ల దూరంలో సహాయక చర్యలు చేపట్టారు. మనిషి ఆకారంలో ఉండే రోబో కాకుండా ప్రత్యేకంగా అన్వి రోబో తయారు చేశారు. అందరి  అంచనాలకు అందకుండా రోబో ఉంది. ఎస్ ఎల్ బిసి టన్నెల్ లో ఆదునాత సాంకేతికతో మృత దేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. 
ఎస్ఎల్ బిసి టన్నెల్ లోకి వెళ్లిన అన్విరోబో  Publish Date: Mar 11, 2025 2:33PM