Top Stories

బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో.. ఉచితాలకే పెద్దపీట

చెప్పేటందుకే నీతులు అన్న విషయాన్ని బీజేపీ మరోమారు రుజువు చేసింది. పలు సందర్భాలలో ఎన్నికలలో ఓట్ల కోసం ఉచిత హామీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ప్రధాని మోడీ ఢిల్లీ ఎన్నికల వేళ విజయం కోసం ఉచితాలపైనే ఆధారపడ్డారు. ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి ఇచ్చే ఉచిత హామీలు దేశ భవిష్యత్ కు, ప్రగతికీ అత్యంత ప్రమాదకరమని పలు సందర్భాలలో మోడీ అన్నారు. తన ప్రభుత్వం ఉచిత హామీలకు దూరంగా ఉంటుందనీ, దేశ భవిష్యత్ , మౌలిక సదుపాయాల కల్పనపైనే దృష్టి కేంద్రీకరిస్తుందనీ గతంలో పలు సందర్భాలలో చెప్పిన మోడీ ఎన్నికలలో బీజేపీ విజయానికి మాత్రం ఆ ఉచిత హామీలపైనే ఆధారపడుతున్నారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తన ఎన్నికల మేనిఫొస్టోను ఉచిత హామీలతో నింపేసింది. సంకల్ప పత్రం పేరిట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా శుక్రవారం (జనవరి 17)న బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.  తాము అధికారంలోకి వస్తే ఇప్పటికే అమలులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అవికాకుండా  పేద కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్లు హోళీ, దీపావళి పండుగలకు ఒక్కో సిలిండర్ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 60-70 ఏళ్ల మధ్య వృద్ధులకు నెలకు రూ. 2,500, 70 సంవత్సరాల పైబడి వారికి రూ.3 వేలు అందజేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.  అలాగే మహిళలకు 2500 రూపాయలు పింఛను, ఢిల్లీలోని అనధికార మురికివాడలలో అటల్ క్యాంటిన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తామని బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది.  
Publish Date: Jan 17, 2025 4:35PM

నీలోనే అల్లా ఉన్నాడు...మద్యంలో సైతాను ఉన్నాడు

ఫిరోజ్ వ్యసనాలను అలవాటు పడ్డాడు. తాను మనసులో ఏది తల్చుకుంటే  అది నిమిషాల్లో కావాలంటాడు. తల్లి దండ్రులకు ఇది నచ్చలేదు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం శూన్యం. ఒక  రోజు ఫిరోజ్ ను తీసుకుని తల్లిదండ్రులు మౌలానా దగ్గరకు వచ్చారు.   ఫిరోజ్ తల్లిదండ్రులు: సలాం వాలేకూం మౌలానా మౌలానా: వాలేకుం సలాం, కైరియత్  ఫిరోజ్ తల్లిదండ్రులు: అల్  హమ్ దు లిల్లా మౌలానా సాబ్ ఫిరోజ్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు . ఉద్యోగం సద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు.  మౌలానా: ఇస్లాంలో మద్యం సేవించడం మహా పాపం. మద్యం వ్యసనం వల్ల మనిషి అనేక పాపాలు చేస్తాడు. తాను చేసే పాపాలు కూడా పశ్చాత్తాపం చెందే అవకాశం  కూడా లేదు. నమాజును క్రమ బద్దంగా నిర్వహించాలి.  శుక్రవారం మసీదులకు వచ్చిన యువకులు  చాలామంది తిరిగివెళ్లేటప్పుడు టోపీలను పెట్టుకోవడం లేదు. ఫ్యాషన్ కు అలవాటు పడ్డ యువత అల్లాకు దూరమౌతున్నారు.  మసీదుకు దగ్గరగా ఉన్నవారు సమయానికి మసీదుకు రావడం లేదు. వచ్చినా సమయానికి రావడం లేదు. మొదటి రఖాత్(నమాజు ప్రక్రియలో భాగం) అయి పోయిన తర్వాత వస్తున్నారు. ఆలస్యంగా నమాజు వేళలు పెట్టినప్పటికీ మొదటి రఖాత్ కు రావడం లేదు. రఖాత్ వదిలేయడం మహా పాపం. టైంపాస్ కోసం నమాజుకు వస్తే ఫలితం శూన్యం. అల్లాకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాలి. అప్పుడే చెడు వ్యసనాలు వాటంతట అవే దూరమౌతాయి. నీలోనే అన్నీ ఉన్నాయి. వాటిని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మంచి ఏమిటో చెడు ఏమిటో నీకు తెలుసు. ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో నీకు తెలుసు. నీకు ఎవరో చెప్పాలి అనే నియమం లేదు. నీకు అన్నీ తెలిసినప్పుడు నిర్ణయం తీసుకోవల్సింది నువ్వే. అల్లా   ఎక్కడో లేడు. నీలోనే ఉన్నాడు.  నీలోనే అల్లా ఉన్నప్పుడు పాప పుణ్యాలు కూడా నీవే తెలుసుకుంటావు. నువ్వు అల్లాతో మాట్లాడాలి  అని మనస్పూర్తిగా అనుకుంటే చాలు. నీ సమస్యలను నివేదించాలి అన్నీ మాయమవుతాయి. అల్లా వచ్చి నీతో మాట్లాడతాడు అని మౌలానా తన తక్రీర్ ముగించాడు.  ఫిరోజ్ తల్లిదండ్రులు: ఖుదాఫీస్ మౌలానా సాబ్ 
Publish Date: Jan 17, 2025 3:42PM

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీ!

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కేనని కేంద్రం విస్పష్టంగా చాటింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గింది. విశాఖ ఉక్కును నష్టాల నుంచి బయటపడేయడానికి 11 వేల 440 కోట్ల రూపాయల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది. విశాఖ ఉక్కుప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతిొ తెలిసిందే. జగన్ హయాంలో కేంద్రం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకోకపోవడమే కాకుండా, ఆ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి అయ్యేలా తన పూర్తి సహకారం అందిస్తామన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. అయితే ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం అత్యంత కీలక భాగస్వామిగా ఉండటంతో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ యోచనను కేంద్రం విరమించుకుంది.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశక్తే లేదని విస్ఫంష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిజం చేస్తూ కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11 వేల 440 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. ఇహనో ఇప్పుడో ఈ విషయంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  
Publish Date: Jan 17, 2025 3:28PM

తులసిబాబు బెయిల్ పిటిషన్.. RRR ఇంప్లీడ్

తనపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులకు శిక్ష పడే  విషయంలో  మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు స్వయంగా న్యాయపోరాటం చేస్తున్నారు. తనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వారిని అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టే విషయంలో పోలీసులు గట్టిగా ప్రయత్నించడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రఘురామ కృష్ణం రాజు.. ఈ కేసులో స్వయంగా తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయ్ పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత అరెస్టైన తులసిబాబు హైకోర్టులో అత్యవసర బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే తులసిబాబు విషయంలో పోలీసులు   గట్టిగా నిలబడతారన్న నమ్మకం లేకపోవడమో, లేదా తనకు జరిగిన అన్యాయాన్ని తనకంటే గట్టిగా ఎలుగెత్తే వారెవరుంటారన్న భావనో కానీ ఆయన స్వయంగా రంగంలోకి దిగారు.  ఈ కేసులో అరెస్టైన తులసీబాబు హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్  విచారణ సందర్భంగా తన వాదనా వినాలంటూ రఘురామకృష్ణం రాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తులసి బాబు తాను కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేశారనీ, అందుకే ఆయన బెయిల్ పిటిషన్ విచారణ సందర్బంగా తన వాదనలూ వినాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.   కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో రఘురామకృష్ణం రాజు అలుపెరుగని న్యాయపోరాట ఫలితంగానే ఈ కేసులో విజయ్ పాల్, తులసిబాబు అరెస్టయ్యారని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు తులసి బాబు బెయిల్ పిటిషన్ లో ఇంప్లీడ్ అయిన రఘురామకృష్ణం రాజు పీస్ సునీల్ జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా అరెైస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభావతి ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.    
Publish Date: Jan 17, 2025 2:53PM

సింగపూర్ ఐటీఈతో తెలంగాణ స్కిల్ వర్సిటీ ఓప్పందం

రైజింగ్ తెలంగాణ అజెండాగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలుత ఆయన సింగపూర్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల సింగపూర్ పర్యటన తరువాత ఆయన దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరౌతారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆక్ష్న సింగపూర్ ఐటీఈతో  యువతను ఉద్యోగాలకు సమాయత్తం చేసే లక్ష్యంలో  చేపట్టిన స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించే ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు  ఐటీఈ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్‌తో  అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న విభాగాలు, నెట్ వర్క్ ల పనితీరును రేవంత్ బృందం  పరిశీలించింది.  ఆయా రంగాలలో , విభాగాలలో పనిచేస్తున్న నిపుణులతో మాట్టాడారు.  తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ ఐటీఈతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది.  ఈ ఒప్పందం మేరకు సింగపూర్ ఐటీఈ   టెన్త్ విద్యార్థుల  నుంచి ఆసక్తి ఉన్న ఏ వయసు వారికయినా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణ అందిస్తుంది.  ఈ ఒప్పందం స్కిల్ యూనివర్సిటీ లక్ష్యాలను అందుకోవడంలో ఎంతో  దోహదపడుతుందని రేవంత్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించనుంది. 
Publish Date: Jan 17, 2025 2:25PM

దావోస్ పర్యటనలో లోకేష్ కీలక భేటీలు.. మూడు సెషన్లలో ప్రధాన వక్తగా ప్రసంగాలు!

రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మంత్రులు లోకేష్,   టీజీ భరత్ , ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సిఎం  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనాథ్ బండారు, ఆర్థిక, పరిశ్రమల శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవో సాయికాంత్ వర్మ సిఆర్‌డిఏ  ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మాట్  దావోస్ లో పర్యటించనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఐదు సెషన్ లలో ప్రధాన వక్తగా పాల్గొనే అవకాశం ఆంధ్రప్రదేశ్ కు దక్కగా వీటిలో మూడు సెషన్ లలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మిగిలిన రెండింటిలో మంత్రి నారాలోకేష్ ప్రధాన వక్తగా ప్రసంగిస్తారు. అలాగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50 మంది దౌత్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలతో లోకేష్ భేటీ కానున్నారు. ఈ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ విషయంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా కీలక భూమిక పోషిస్తున్నారు.  ప్రధానంగా ఏపీ పెవిలియన్ లో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి భేటీలు, చర్చలలో లోకేష్ లీడ్ తీసుకోనున్నారు.  రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాల గురించి వారికి వివరించనున్నారు. అలాగే సీఎన్‌బీసీ, టీవీ 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ లో నారా లోకేష్ పాల్గొననున్నారు.  అదే విధంగా  ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులపై  విద్యారంగ గవర్నర్ల సమావేశంలో కూడా లోకేష్ పాల్గొంటారు.   మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం,  ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం వంటి అంశాలపై   ప్రముఖులతో నిర్వహించే సమావేశాలలో పాలుపంచుకుంటారు.  నెక్ట్స్ జెన్ ఏఐ, డాటా ఫ్యాక్టరీ, ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్ విడియా ప్రతినిధులు, ఏఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.   
Publish Date: Jan 17, 2025 1:46PM