బీఆర్ఎస్ రాజ‌కీయ క్రీడ‌లో పావు నాగార్జున?

తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని కుటుంబం గురించి తెలియ‌నివారు ఉండ‌రు. టాలీవుడ్‌లో సీనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గురించి కూడా ప్ర‌స్తావిస్తుంటారు. టాలీవుడ్‌కు, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు వీరు ఎన్నో సేవ‌లు అందించారు.   అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అంటే అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయం ఉంది. ఆయ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ అక్కినేని నాగార్జున‌ సైతం అంతే స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో ప‌లు విధాలుగా ఎంతో మందికి ఉపాధి క‌ల్పించిన.. క‌ల్పిస్తున్న వ్య‌క్తిగా నాగార్జున‌కు మంచి పేరుంది. రాజ‌కీయాల జోలికి వెళ్ల‌కుండా అన్ని పార్టీల నేత‌ల‌తో నాగార్జున స‌త్సంబంధాల‌ను క‌లిగి ఉంటారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఆయ‌న్ను నాగార్జున ప్ర‌త్యేకంగా క‌లిసి అభినంద‌న‌లు  తెలిపారు. అయితే, ఇటీవ‌ల కాలంలో రేవంత్ స‌ర్కార్ తీసుకొచ్చిన హైడ్రాలో భాగంగా నాగార్జున‌కు చెందిన‌ ఎన్ క‌న్వెన్ష‌న్ కొంత‌భాగం చెరువు భూమిని ఆక్ర‌మించి నిర్మించార‌ని గుర్తించి అధికారులు కూల్చివేశారు. ఈ విష‌యంపై ఆయ‌న కోర్టుకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో బీఆర్ఎస్ నాగార్జున‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు ముందుకు రాలేదు. కేటీఆర్, నాగార్జున‌కు మంచి సంబంధాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఒక‌వేళ నాగ్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడితే.. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని బీఆర్ఎస్ అధిష్టానం ఎన్ ఎన్వెన్ష‌న్ కూల్చివేత విష‌యంలో నోరు మెద‌ప‌లేదు.  ఇటీవ‌ల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఓ ప్ర‌భుత్వ కార్యక్ర‌మంలో మంత్రి కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు పాల్గొన్నారు. అయితే, హ‌రీశ్ రావు, కేటీఆర్‌ డీపీతో ఉన్న బీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు  సోష‌ల్ మీడియాలో సురేఖ‌, ర‌ఘునంద‌న్ రావుపై అస‌భ్య‌క‌ర పోస్టులు చేశారు. దీనిపై  హ‌రీశ్‌రావు స్పందించి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మాత్రం స్పందించ‌లేదు. కొండా సురేఖ ఈ అంశంపై తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ ఎందుకు స్పందించ‌లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోవ‌టానికి కార‌ణం కేటీఆర్ అని, కేటీఆర్ కార‌ణంగా చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని కెరీర్ కు అర్ధంతరంగా ఫుల్ స్గాప్ పెట్టేశారనీ అన్నారు. డ్ర‌గ్స్ విష‌యంలోసైతం కేటీఆర్‌పై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మంత, నాగ‌చైత‌న్య విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డంతో హీరో నాగార్జున నాగచైత‌న్య‌, అమ‌ల‌తో పాటు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌, నాని, వెంక‌టేశ్‌, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ వంటి టాలీవుడ్ ప్ర‌ముఖులు కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. స‌మంత సైతం మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సిగ్గుచేట‌ని అన్నారు. త‌మను మీ అవ‌స‌రాల‌కోసం రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సినీ ఇండ‌స్ట్రీతో పాటు బీఆర్ఎస్ నేత‌లు  కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. దీంతో కాంగ్రెస్ పెద్ద‌లు అల‌ర్ట్ కావ‌టంతో ఆమె దిగొచ్చి.. త‌న వ్యాఖ్య‌లను వెన‌క్కు తీసుకున్నారు. స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కానీ, కేటీఆర్ ను మాత్రం వ‌దిలేది లేద‌ని హెచ్చ‌రించారు. అయితే,  స‌మంత‌, నాగ‌చైత‌న్య విష‌యంలో వివాదం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు.  హీరో నాగార్జున మాత్రం కొండా సురేఖ‌ను వ‌దిలేది లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయమూర్తి సెల‌వులో ఉండ‌టంతో నాంప‌ల్లి కోర్టు విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేసింది. దీనికి తోడు సురేఖ‌పై 100కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని నాగార్జున చెప్పారు. పరువు నష్టం దావాలు కోర్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగుతాయన్న విషయం తెలుసని.. అయినా, ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తనకు ఒకదాని వెనుక ఒకటిగా సమస్యలు వస్తున్నాయన్న నాగార్జున.. అయినా ఇబ్బంది లేదని, తానొక బలమైన వ్యక్తినని, కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో సింహంలా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం మద్దతుగా వచ్చిందని.. తన తండ్రికున్న గౌరవం, ఆయన ఆశీస్సులే కారణమని అభిప్రాయపడ్డారు. అయితే, కొండా సురేఖ విష‌యంలో నాగార్జున అతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ వాద‌న కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ రాజ‌కీయ క్రీడ‌లో నాగార్జున పావుగా మారుతున్నారని, ఈ అంశంపై మంత్రి వెన‌క్కు త‌గ్గినా నాగార్జున అదే విష‌యాన్ని ప‌ట్టుకొని రాద్దాంతం చేయాల‌ని చూస్తున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నాగార్జున తీరుపై టాలీవుడ్ లోని కొంద‌రు ప్ర‌ముఖుల‌ు సైతం విస్మయం వ్య‌క్తం చేస్తున్నారు.  నాగార్జున‌కు కేటీఆర్‌, కేసీఆర్ ల‌తో మంచి సంబంధాలు ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. వారి ప్రోద్భ‌లంతోనే నాగార్జున అతిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్న చర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్  రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం టాలీవుడ్ హీరోల‌ను వాడుకోవ‌టం కొత్తేమీ కాద‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. ఇదే స‌మ‌యంలో నాగార్జునపై కేసు న‌మోదైంది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేశారని జనం కోసం అనే స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి లాభాలు ఆర్జించారని వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయసలహా తీసుకున్న పోలీసులు నాగార్జున‌పై కేసు నమోదు చేశారు. కొండా సురేఖ త‌న వ్యాఖ్య‌ల‌ను ఉపసంహరించుకుని క్ష‌మాప‌ణ‌లు చెపపినా, నాగార్జున మాత్రం కేటీఆర్ సూచ‌న‌ల‌తో ముందుకెళ్తూ అన‌వ‌స‌రంగా చిక్కుల్లోపడుతున్నారని కాంగ్రెస్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బీఆర్ఎస్  ఆడుతున్న రాజ‌కీయ క్రీడ‌లో నాగార్జున పావుగా మారొద్ద‌ని వారు సూచిస్తున్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకున్నందున నాగార్జున ఇప్పటికైనా  ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలేయడం మంచిదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 
Publish Date: Oct 6, 2024 12:41PM

రేవంత్ దెబ్బ‌కు కాంగ్రెస్‌లో క‌ట్ట‌ప్ప‌లు విల‌విల‌!

కాంగ్రెస్ పార్టీలో క‌ట్ట‌ప్ప‌ల జాబితా ఎక్కువే ఉంటుంది.. ఇప్పుడ‌నే కాదు.. గ‌తంలోనూ ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీలో సీనియ‌ర్ నేత‌ల‌మ‌నే ట్యాగ్ త‌గిలించుకొని ఇత‌ర పార్టీల‌కు స‌హాయ‌ స‌హ‌ కారాలు అందించ‌డం వారికి అల‌వాటుగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం త‌రువాత కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు కేసీఆర్ తో స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చారు. పైకి మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలో ద‌శాబ్దాలుగా ఉంటున్నాం, పార్టీకి ఎన‌లేని సేవ‌లు అందించామ‌ని చెప్పుకుంటూ పెత్త‌నం చెలాయించేవారు. అధికారంలోలేని ప‌దేళ్ల కాలంలో వీరి ఆట‌లు సాగాయి. కానీ, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తెర‌ వెనుక పార్టీకి ద్రోహం చేస్తున్న‌వారికి చెక్‌పెడుతూ వ‌స్తున్నారు. బీఆర్ఎస్ ప‌దేళ్ల‌ హయాంలో కొంద‌రు పార్టీ సీనియ‌ర్లు కేసీఆర్‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉండ‌టంతో పాటు.. త‌మ స‌న్నిహితుల‌కు ప్ర‌భుత్వం నుంచి కాంట్రాక్టులు ఇప్పించుకొని ల‌బ్ధిపొందారు. రేవంత్ రెడ్డి అలాంటి వారి గుట్టును ర‌ట్టు చేస్తుండ‌టంతో ల‌బోదిబోమంటున్నారు. రేవంత్ సీఎం అయిన త‌రువాత సీనియ‌ర్‌, జూనియ‌ర్ల‌ను క‌లుపుకొని పోతూ పార్టీ బ‌లోపేతంతోపాటు..ప్ర‌భుత్వంలోనూ వారి సేవ‌ల‌ను వినియోగించుకుం టున్నారు. కానీ, కొంద‌రి తీరులో మాత్రం మార్పురావ‌డం లేద‌ని పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని చెరువులు, నాళాలు ఆక్ర‌మించి అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన వారిపై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సినీ న‌టుడు నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత జరిగింది. పార్టీల‌ కు అతీతంగా, ప‌లుకుబ‌డి క‌లిగిన‌వారు అని చూడ‌కుండా చెరువు, నాళాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. దీనికితోడు చెరువుల‌ను ఆక్ర‌మించి నిర్మాణం చేసిన ఫామ్ హౌస్‌ల‌ను కూడా కూల్చేస్తామ‌ని రేవంత్ ప‌లుసార్లు ప్ర‌స్తావించారు. మ‌రోవైపు.. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీపరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ కూల్చివేస్తోంది. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రివర్ బెడ్ పరిధిలో సుమారు 55 కిలోమీట‌ర్ల‌ పరిధిలో 40 వేల ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. చాదర్‌ఘాట్‌ మూసీ పరీవాహక ప్రాంతాల్లోని మూసానగర్‌, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌ పరిసరాల్లో ఇళ్లకు రెవెన్యూ అధికారులు మార్కిం గ్ చేశారు. ఇందులో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్ల కూల్చివేత‌లు చేప‌ట్టారు. అయితే, కొంద‌రు స్థానికులు మూసి ప‌రివాహ‌క ప్రాంతంలోని త‌మ ఇళ్ల‌ను కూల్చివేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు సైతం మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని బాధితుల‌కు అండ‌గా నిల‌వ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్నది.  మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ఇళ్ల‌ను కూల్చేస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని, ఇళ్ల‌ను కూల్చాలంటే ముందుగా బుల్డోజ‌ర్లు త‌మ‌పై నుంచి పోనివ్వాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లోని నేత‌లు స‌వాళ్లు చేశారు. దీంతో మూసి ప్రాంతంలో కూల్చివేత‌ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా పెద్ద‌ ర‌చ్చ‌కు దారితీసింది. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుంద‌రీక‌ర‌ణ పనుల విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో వెనుక‌డుగు వేసేది లేద‌ని తేల్చి చెప్పారు. ఇళ్లు న‌ష్ట‌పో యిన వారికి డ‌బుల్ ఇళ్లు ప్ర‌భుత్వం క‌ట్టించి ఇస్తుంద‌ని, ప‌రిహారం కూడా అందించేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తామ‌ని, అంద‌రికీ న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో అనేకమంది పెద్దలు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని చెబుతూ  వారి పేర్లను కూడా ప్రస్తావించారు. ఆయన అలా ప్రస్తావించిన పేర్లలో బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రాంచందర్‌రావు పేరు కూడా ఉంది. కేవీపీ అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించుకున్నారని రేవంత్ అన్నారు.   కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ పేరు నే రేవంత్‌ ఉటంకించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియ‌ర్ లీడ‌ర్ని అని ఆ లేఖలో చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. పార్టీకి చెడ్డ పేరు వస్తే, తన కాంగ్రెస్ రక్తం సహించదు అని పేర్కొన్న కేవీపీ,  తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించండి.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించండి,  సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేయిస్తా అని  ఆ లేఖలో స్పష్టం చేశారు.  అయితే, కేవీపీ లేఖ కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ లీడ‌ర్‌ నైన నా ఫామ్ హౌస్ నే కూల్చేస్తావా అన్న హెచ్చరికను రేవంత్ కు పంపినట్లు ఉందని  కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అయితే అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం అంటూ రేవంత్ కేవీపీ పేరును ప్ర‌స్తావించ‌డం వెనుక పెద్ద‌కార‌ణ‌మే ఉంద‌న్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేవీపీ రామచంద్రరావు హవా నడిచిం దన్న ఆరోపణలున్నాయి. వాటిని రేవంత్ నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టులు.. ఇతర విషయాల్లో కేసీఆర్ కు కేవీపీ అన్ని విధాలుగా సహకారం అందించారనీ, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉండటంతోనే   రేవంత్ కేవీపీ పేరు ప్రస్తావిస్తూ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరించారనీ పరిశీలకులు భావిస్తున్నారు.   గతంలో కూడా రేవంత్‌ కేవీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయాన్నిగుర్తు చేస్తున్నారు.   కేవీపీ, కేసీఆర్‌ది ఒకే సామాజికవర్గం కావడంతో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేవీపీ కేసీఆర్ కు అన్ని విధాలుగా సహకరించారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.   ఇప్ప‌టికే కేవీపీ వ్య‌వ‌హారాన్ని రేవంత్ అధిష్ఠానం దృష్టికి తీసు కెళ్లార‌ని.. బీఆర్ ఎస్ హయాంలో కేవీపీ కేసీఆర్ కు ఏ విధంగా అండ‌గా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశారో వివ రించారని  కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  హైకమాండ్ అనుమతితోనే రేవంత్  అక్రమ నిర్మాణాలు చేసిన వారిలో కేవీపీ కూడా ఉన్నారని వెల్లడించారని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో సీనియ‌ర్లుగా చ‌లామ‌ణి అవుతూ ప‌దేళ్ల‌ పాటు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారికంగా స‌హ‌కారం అందించిన కొంద‌రు సీనియర్ల ను రేవంత్ టార్గెట్ చేశారనీ, వారిలో  కేవీపీ కూడా ఒక‌ర‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. మొత్తానికి కేవీపీ ఎపిసోడ్ తో  కాంగ్రెస్ పార్టీ లోని క‌ట్ట‌ప్ప‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 
Publish Date: Oct 6, 2024 8:24AM

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తోడు దసరా సెలవులు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఉండటంతో తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం (అక్టోబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని 76 వేల 552 మంది దర్శించుకున్నారు. వారిలో 35వేల 885 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండా ఆదాయం 2 కోట్ల 54లక్షల రూపాయలు వచ్చింది.
Publish Date: Oct 6, 2024 8:14AM

జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి వచ్చిన నేషనల్ అవార్డు రద్దయింది. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన యువతి మీద అత్యాచారం జరిపాడన్న ఆరోపణ మీద జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో, ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా వచ్చిన నేషనల్ అవార్డును అవార్డుల కమిటీ రద్దు చేసిసింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ ఎంపిక అయ్యారు. తిరుచిట్రంబళం అనే తమిళ సినిమాలోని ‘మేఘం కరుకాథ’ అంటూ సాగే పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు ఆయన్ని ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు జాతీయ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం జానీ మధ్యంతర బెయిల్ పొందారు. ఈ నెల 8న ఆయన అవార్డు అందుకోవలసి వుంది. నేషనల్ అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్‌కి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ అవార్డు రద్దు చేయడంతో బెయిల్ రద్దుపై సందిగ్ధం ఏర్పడింది. అవార్డు అందుకోవడం కోసం జానీ మాస్టర్‌కి బెయిల్ ఇచ్చినందుకు ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యాచారం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అవార్డు ఇవ్వడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వచ్చాయి. జానీ మాస్టర్‌కి జాతీయ అవార్డుల కార్యక్రమంలో కనిపించడానికి సిగ్గు వుండాలి లాంటి ఘాటు విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌కి ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దయింది.
Publish Date: Oct 5, 2024 10:42PM

కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేబినెట్ నుంచి ఉద్వాసనేనా?

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉంది. ఆమెపై చర్యలకు సిద్ధమౌతోంది. నటి సమంతపై ఆమె చేసిన వ్యాఖ్యల వేడి హస్తినను తాకింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమంతపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖను ఆదేశించారు. రాజకీయ విమర్శలలో మహిళలను ఎలా లాగుతారని రాహుల్ గాంధీ కొండా సురేఖను నిలదీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమంతపై చేసిన  వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ కొండా సురేఖను ఆదేశించారు. ఆమె కూడా క్షణం ఆలస్యం చేయకుండా తన వివరణను రాహుల్ కు పంపారు. ఆమె సుదీర్ఘ వివరణపై ఇంకా రాహుల్ నుంచి ఎటువంటి స్పందనా వెలువడ లేదు.  అయితే సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల అనంతరం అన్ని వైపులనుంచీ ఆమెపై విమర్శల దాడి జరిగింది. ఇంత జరిగినా జరుగుతున్నా.. కొండా సురేఖకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి సహా ఆయన కేబినెట్ సహచరులెవరూ పెద్దగా స్పందించలేదు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆమె వ్యక్తిగత హోదాలో చేశారంటూ కాంగ్రెస్ సర్కార్ తప్పించుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు. తన వ్యాఖ్యలకు కొండా సురేఖ మాత్రమే కాకుండా క్యాబినెట్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణగాలంటే, కొండా సురేఖ వ్యాఖ్యల ప్రభావం కాంగ్రెస్ సర్కార్ పై పడకుండా ఉండాలంటే ఆమెపై చర్యలు తీసుకోవడమే మార్గమని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.  టీపీసీసీ చీఫ్ రంగంలోకి దిగి వివాదానికి ముగింపు పలకడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించినట్లు కనిపించదు. కొండా సురేఖ ఒక  అడుగు తగ్గి సమంతకు క్షమాపణలు చెప్పడమే కాకుండా, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినా ఆమెపై వెల్లువెత్తుతున్న విమర్శల హోరు ఇసుమంతైనా తగ్గలేదు. టాలీవుడ్ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించింది.  ఇక విషయాన్ని హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకుని ఆమె వివరణ కోరడంతో సురేఖపై వేటు తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఆమె వివరణ ఇవ్వడంతో ఇక చర్యలే తరువాయి అని కాంగ్రెస్ వర్గాలు కూడా అంటున్నాయి. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. అయితే కేబినెట్ నుంచి మాత్రం కొండా సురేఖకు ఉద్వాసన పలికే అవకాశాలున్నాయని అంటున్నారు. కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం ద్వారా ఈ వివాదం ప్రభావం ప్రభుత్వంపై పడకుండా నివారించినట్లౌతుందనీ, ఆ తరువాత ఈ విషయంలో కొండా సురేఖ తన వ్యక్తిగత హోదాలో పోరాడాల్సి ఉంటుందని పరివీలకులు విశ్లేషిస్తున్నారు.   
Publish Date: Oct 5, 2024 3:38PM