సెల‌బ్రిటీస్ సారీ..గామా!

ఒకే రోజు మూడు సారీలు. లారీల నిండా సారీలు. వారిలో టాప్ ప్లేస్ కి చెందిన సారీ చెప్పిన వారు.. మంత్రి కొండా సురేఖ‌. ఈమె గ‌తంలో అంటే తాను మంత్రి అయిన తొలి రోజుల్లో  నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఒక అబాంఢం వేశారు. దీంతో  నాగార్జున న్యాయాన్ని ఆశ్ర‌యించారు కూడా. ఆపై సురేఖ మంత్రిపదవి ఊడిపోతుందేమో అన్నంతగా వ్య‌వ‌హారం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.  అయితే.. , బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారే అలా వెంట్రుక వాసిలో  అప్పట్లో వేటు నుంచి కొండా సురేఖ త‌ప్పించుకున్నారు.  ఆమె మంత్రిగా ఉండి కూడా  ప్రభుత్వంలో తమను   తొక్కేస్తున్నార‌ని ఆరోపణలు గుప్పించి కూడా  పదవిని భద్రంగా కాపాడుకోగలుగుతున్నారు. అది వేరే విషయం.  అప్ప‌టి నుంచీ కూడా సురేఖ సైలెంట్ మోడ్ లో కి వెళ్లిపోయాన‌ని అంటారు. తానేదైనా అంటే  అది మ‌రొక‌టిగా రూపాంత‌రం చెందుతోంద‌ని.. ఫీల‌య్యి మీడియాతో మాట్లాడ్డ‌మే మానేశాన‌ని చెప్పుకొచ్చారీ మ‌ధ్య ఒక మీడియా చిట్ చాట్ లో. ఇప్పుడు కూడా సురేఖ‌.. ట్వీట్ చేసి స‌రిపుచ్చారు త‌ప్ప‌.. మీడియా ముందుకు రాకుండా జాగ్ర‌త్త వ‌హించారు చూశారా!? ద‌టీజ్ కొండంత సారీల సురేఖ‌  అంటే.

ఇక  రెండో బిగ్గెస్ట్ సారీ ఆఫ్ ద ఏపీ విష‌యానికి వ‌స్తే.. మాజీ ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్. ఒక స‌మ‌యంలో షాడో సీఎం గా వ్య‌వ‌హించార‌న్న పేరుండేది. అప్ప‌ట్లో ఇద్ద‌రి ప‌ట్ల తాను ఎంతో దారుణంగా ప్ర‌వ‌ర్తించాన‌నీ ఆయ‌న ఇప్పుడు తాజాగా ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ వారెవ‌రో చూస్తే మాజీ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, ఐఆర్ఎస్ జాస్తి కిషోర్ కుమార్. ఈ ఇద్ద‌రి ప‌ట్ల తాను అలా వ్య‌వ‌హ‌రించి ఉండ‌కుండా ఉండాల్సింద‌న్న కోణంలో ఆయ‌న చేసిన ఒక వీడియో ప్రెజంటేష‌న్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  అప్ప‌ట్లో జ‌గ‌న్ ఏదంటే  అది అన్న మాట‌క‌న్నా, ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ ఏదంటే అదీ అన్న టాక్ వినిపించేది. ఒక ద‌శ‌లో ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ మీద ఉపాధ్యాయులంతా  క‌ల‌సి కంప్ల‌యింట్ చేశారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. అలాంటి ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ నుంచి  సారీ.. అది  కూడా ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల‌కు అందింది. 

ఒక మూడో సారీ..  న‌టుడు ప్ర‌కాష్ రాజ్చెప్పారు.   బేసిగ్గా ప్ర‌కాష్ రాజ్ ఎంత అగ్రెసివ్ గా ఉంటారంటే.. జ‌స్ట్ ఆస్కింగ్ పేరిట ఏకంగా ప్ర‌ధాన మంత్రినే ఏ ప్ర‌శ్న‌లంటే ఆ ప్ర‌శ్న‌లు అడిగే బాప‌తు. దేశంలో ఏ చిన్న విష‌య‌మైనా స‌రే ఆయ‌న నిగ్గ దీసి అడుగు- ఈ సిగ్గులేని స‌మాజాన్ని అనే టైపు. అలాంటి ప్ర‌కాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ చేసినందుకుగానూ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తనకే పాపం తెలీదంటే అది త‌ప్పు అవుతుందని అన్నారు.  అయితే.. తాను గ‌తంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్ర‌చారానికిగానూ సారీ చెబుతున్నా! అంటూ మీడియా ముఖంగా చెప్పారు. దీంతో ఒకే రోజు ముగ్గురు ప్ర‌ముఖుల నుంచి మూడు సారీలు వెలువ‌డ్డంతో ఇదో స‌రికొత్త రికార్డు  సృష్టించింది. వీరంతా మామూలోళ్లు కారు. అలాంటి మొండి- జ‌గ‌మొండి ఘ‌టాల నుంచి ఇలాంటి క్ష‌మాప‌ణ‌ల ప‌ర్వం ఈ స‌మాజం చూస్తుంద‌నుకోలేదు. కాబ‌ట్టే ఇంత ఎగ్జ‌యిట్ మెంట్. ఇందులో ఏదైనా త‌ప్పుంటే సారీయే..!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu