అమ్మబాబోయ్ నమ్మరాదు!

 

 

 

రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్న తెలుగువారి నమ్మకం రోజురోజుకూ సడలిపోతోంది. ఈ నమ్మకం ఇలా సడలిపోవడానికి కారణం తెలుగువారు నమ్మకూడని వారిని నమ్మడమే! ముఖ్యంగా విభజన కారణంగా దారుణంగా మోసపోయే సీమాంధ్రులు ఎవర్ని నమ్మకూడదో వారినే నమ్మి ఇప్పుడు చింతిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాదంటూ సీమాంధ్రులను నమ్మించిన మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మంత్రులుగా బిజీగా వున్నారు.

 

కొత్త రాష్ట్రంలో తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దు మొర్రో అని సీమాంధ్రులు మొత్తుకుంటున్నా వినని కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రలోని ప్రజా ప్రతినిధుల భుజాల మీద ఎక్కి కూర్చుని ఈ ఆందోళన సాగరాన్ని దాటే ప్రయత్నం చేస్తోంది. దీనికితోడు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ సీమాంధ్ర నాయకులు ఇప్పటికీ రాష్ట్ర విభజన జరగదంటూ సీమాంధ్రులను మభ్యపెట్టే విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు వీరందరూ కలసి సీమాంధ్రులను మరో నమ్మకంలో ముంచేశారు.



ఆ నమ్మకం ఏమింటంటే, ‘‘తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల కంటే సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఆ బిల్లు అసెంబ్లీలో ఓడిపోతుంది. అప్పుడు రాష్ట్ర విభజన ఆగిపోతుంది’’. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు ఉద్యమించకుండా భ్రమల్లో ఉంచడానికే సీమాంధ్ర కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నాయకులు ఇలాంటి నమ్మకాలను ప్రచారం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.



ఇప్పటికే సీమాంధ్ర రాజకీయ నాయకులు సీమాంధ్రుల నమ్మకాలు ఎన్నింటినో నాశనం చేశారు.విభజనకు వ్యతిరేకంగా నిలబడతారని నమ్మినవారందరూ చివరికి ప్యాకేజీ ఇస్తే చాలంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ఓటింగ్ నమ్మకాన్ని కూడా వీళ్ళు నాశనం చేయరన్న నమ్మకం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విభజన బిల్లుకు అనుకూలంగా ఓటు వేయరన్న నమ్మకం ఏమిటన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నాయకులను నమ్మకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.