ఎల్లుండి నుంచే పాఠశాలలు ప్రారంభం

తెలంగాణలో మళ్లీ బడిగంట మోగేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈనెల 31 నుంచి అంటే సోమవారం నుంచే పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో జనవరి 31 నుంచి స్కూల్స్ తెరవాలని నిర్ణయించారు. తెలంగాణలో డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉన్న కేసీఆర్... దాని వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ కు ఎలా అడ్డుకట్ట వేయాలో సుదీర్ఘంగా చర్చించారు. అదే సమయంలో స్కూల్స్ విషయంలోనూ ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.  అయితే పాఠశాలల్లో కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకోవాలని, నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. ఫలితంగా సోమవారం స్కూల్స్ మొదలవుతున్నాయి. 

దాదాపు గత రెండేళ్లుగా కరోనా కారణంగా అన్నింటికన్నా ఎక్కువ దెబ్బతిన్నది విద్యా వ్యవస్థే. పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు అర్థం కావడం లేదని, ఇక పల్లెల్లో అయితే ఫోన్లు కూడా చాలామందికి అందుబాటులో లేని కారణంగా ఆన్ లైన్ క్లాసులతో పెద్దగా ప్రయోజనం ఏమీ మిగల్లేదు. అటు పేరెంట్స్ కూడా ఆన్ లైన్ క్లాసులు ఆపాలంటూ పలు సందర్భాల్లో వినతిపత్రాలు సమర్పించారు. అయినా కరోనా విజృంభణ రీత్యా స్కూల్స్ ప్రారంభించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. కేవలం ఫీజుల వసూళ్ల వరకే అనుమతిస్తూ ఆ తరువాత స్కూల్స్ మూసేస్తున్నారన్న అపవాదు కూడా మూట గట్టుకుంది. మరోవైపు పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా సంక్రాంతి సెలవులు పొడిగిస్తారని భావించినా జగన్ మాత్రం ఆ దిశగా  నిర్ణయమేమీ తీసుకోలేదు. దీంతో కేసీఆర్ సర్కారు కూడా స్కూల్స్ ఓపెన్ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.