ఆరో వేలు అయినా సరే..

తోడు పెళ్లి కొడుకు అంటే తెలుసు కదా, ఇది కూడా అంతే. నిజానికి, పెళ్లి తంతులో తోడు పెళ్లి కొడుకుది,ఆటలో అరటి పండు పాత్ర, సినిమా భాషలో చెప్పాలంటే, పెళ్లి పీటల మాత్రమే కనిపించే, గెస్ట్ ఆర్టిస్ట్ రోల్. అయినా తోడు పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి తంతు పూర్తి కాదు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, దేశంలో ఇప్పడు మరో రకం తోడు పెళ్లి కొడుకుల  సందడి నడుస్తోంది. ఇంతకీ,ఎవరా తోడు పెళ్లి కొడుకులు,  ఏమా కథ.. వివరాలోకి వెళితే.. అధికారాల పరంగా అంతగా ప్రాధాన్యత లేని,ఉప ముఖ్యమంత్రుల ట్రెండ్ నడుస్తోంది. సగానికి పైగా రాష్టాల్లో ఒకరు అంతకంటే ఎక్కువ మంది, తోడు పెళ్లి కొడుకులు సారీ ఉప ముఖ్యమంత్రులు ( ముఖమంత్రి ) పక్కన కుర్చీ ఎక్కుతున్నారు. అందులోనూ ఆంధ్ర ప్రదేశ్   ‘స్పెషల్ స్టేటస్’లు సొంతం చేసుకుంది. అవును గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ళ పాలనలో మొత్తం  తొమ్మిది మంది తోడి పెళ్లి కొడుకులు తెరపై కొచ్చి తెరమరుగై పోయారు.  అదెలా ఉన్నా.. దేశంలో చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జోడీ పాలన సాగుతోంది. కొన్ని రాష్ట్రాలలో అయితే ఒకరి కంటే ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులున్నారు. అయితే,అన్ని రాష్ట్రాల కంటే, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ జోడీ  దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని  అంటున్నారు.  అందరికీ తెలిసిందే, అది ఆరో వేలు అయినా,  ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడే వారికి  కొదవ లేదు. నిజానికి, రాజ్యాంగంలో ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి పదవుల ప్రస్తావనే  లేదు. ఆ పదవికి ప్రత్యేక హక్కులు, అధికారాలు, బాధ్యతలు అనేవి ఏవీ ఉండవు.ఈ మధ్యనే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ఇందుకు సంబంధించి ఇంకొంత క్లారిటీ కూడా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రికి  ప్రత్యేక ‘ప్రోటోకాల్’ ఉండదని, స్పష్టంచేశారు. మంత్రులందరిలో ఉప ముఖ్యంత్రి కూడా ఒకరని, ఉన్నది ఉన్నట్లుగా తేల్చి చెప్పారు.  అయితే, అది నిజమే అయితే, ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు? అంటే .. రాజ్యాంగంలో ప్రస్తావించక పోయినా  రాజకీయంగా ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులు అందరూ సమానమే అయినా, ఉప ముఖ్యమంత్రి కొంచెం ఎక్కువ సమానం, అనేది పూర్తిగా కాదన లేని నిజం. అలాగే  ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన వారిని సర్దుకు పొమ్మని బుజ్జగించేందుకు పార్టీలు ఉపయోగించే ఒక రాజకీయ తాయిలం గానూ  ఉప ముఖ్యమంత్రి పదవి ఉపయోగ పడిన సందర్భాలు లేక పోలేదు. అలాగే, సంకీర్ణ ప్రభుత్వాలు ఒడిదుడుకులు లేకుండా సాగేందుకు, భాగస్వామ్య పార్టీల నాయకుల నడుమ సయోధ్యకు ఉప ముఖ్యమంత్రి ఒక ఉపయుక్త మంత్రంగా పని చేస్తుందని  అంటారు.  అయితే ఉప ముఖ్యమంత్రి పదవి రాజకీయ సంక్షోభానికి దారి తీసిన సందర్భాలు లేక పోలేదు. ఇటీవల కాలంలోనే, కర్నాటక, తెలంగాణ సహా మరి కొన్ని రాష్ట్రాలలో ఒకరికంటే ఎక్కువ మందికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే  ప్రతిపాదన వచ్చినప్పుడు అక్కడ డీకే శివ కుమార్, ఇక్కడ బట్టి విక్రమార్క ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. పంతం నెగ్గించుకున్నారు.   కర్ణాటకలో అయితే, ఇప్పటికీ, ఆ వివాదం అప్పుడప్పుడు తెర మీదకు వచ్చి పోతూనే వుంది.  ఆరేడు నెలల క్రితం  ముఖ్యమంత్రి సిద్దరామయ్య వర్గానికి చెందిన ముగ్గురు మంత్రులు, (సహకార మంత్రి కెఎన్ రాజన్న, గృహనిర్మాణ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ప్రజా పనుల మంత్రి సతీష్ జార్కిహోళి) సామాజిక న్యాయం పేరున తమకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు. వివాదం సృష్టించారు. అలాగే, మరి కొందరు సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వారితో గొంతు కలిపారు. అయితే, ఎదో విధంగా వివాదం సద్దుమణిగింది.  కానీ, మళ్ళీ మళ్ళీ డిప్యూటీ  వివాదం అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే వుంది. తాజాగా ఇప్పడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, ప్రియాక్  ఖర్గే పేరు కూడా డిప్యూటీ రేస్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. భవిష్యత్తులో  ముఖ్యమంత్రి  కుర్చీ ఆశిస్తున్నవారు  ముందు చూపుతో ఉపముఖ్యమంత్రి కుర్చీలో కర్చీప్  వేయడం, చాలా వరకు రాష్ట్రాల్లో, నడుస్తున్న చరిత్రలో ముఖ్యంగా ‘కర్ణాటకం’లో ఇది ప్రముఖంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి దగ్గర దారి  అనుకోవడం వల్లనో ఏమో, ఉప ముఖ్యమంత్రి పదవికి అక్కడక్కడ ఇలాంటి గట్టి పోటీ  కనిపిస్తోంది.  ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్  ను  ఉప ముఖ్యమంత్రిని చేయాలనే  డిమాండ్ తెరపై కొచ్చింది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కొందరు పార్టీ నాయకులు, ముఖ్యంగా యువ నాయకులు ఈ  డిమాండ్  చేసినా, ముఖ్యమంత్రి,పార్టీ అధ్యక్షుడు చద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో సున్చుకుని,  ఆ డిమాండ్ ను మొగ్గలోనే తుంచేశారు. సంకీర్ణ ధర్మంలో  భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ప్రాధాన్యత, గుర్తింపు కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ విధంగా ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించారు.  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కూడా సంకీర్ణ ధర్మంతో పాటుగా, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హుందాగా వ్యవహరుస్తున్నారు. అందుకే, దేశంలో ఎందరు ముఖ్యంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నా, ఏపీ జోడీ, (చంద్రబాబు, పవన్  కళ్యాన్) జాతీయ  స్థాయిలోనూ కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే,ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దన్నగా ముందుండి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో  కలిసి ముందుకుసాగుతున్నారు. అందుకే,ఏపీ మోడల్ ‘రోల్ మోడల్’ గా నిలిచింది. అదలా ఉంటే  ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, శాసన సభ ఉన్న మూడు కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. వాటిలో మణిపూర్ లోరాష్ట్ర పతి పాలన విధించడానికి ముందు 31 మంది ముఖ్యమంత్రులు 26 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అంటే, రాజ్యాంగంలో ఎక్కడా ఉప ముఖ్యమంత్రి ప్రస్తావన లేక పోయినా, ప్రస్తుతం దేశంలో సగానికి సగం (15) రాష్ట్రాలలో  ముఖ్యంత్రి, ఉప ముఖ్యమంత్రి జోడీ పాలన సాగుతోంది.  పెళ్లి పీటల మీద పెళ్ళి కొడుకుకు  తోడుగా తోడు పెళ్లి కొడుకును కూర్చో పెట్టినట్లు, ముఖ్యమంత్రికి తోడుగా పక్కన ఉప ముఖ్యమంత్రి కుర్చీ  ఉండడం ఒక ఆనవాయితీగా మారిపోయింది.  ఒక విధంగా ఇదొక రాజకీయ అవసరంగా మారింది. మరి కొన్ని రాష్ట్రాల్లో కులాల మధ్య సమతుల్యత కోసం ఉపముఖ్యంత్రుల నియమకాలు జరుగ్తున్నాయి. అందుకే  కొన్ని రాష్ట్రాల్లో ఒక్కరే ఉప ముఖ్యమంత్రి ఉంటే, మరి కొన్ని రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువమంది ఉప ముఖ్యమంత్రులు ఉంటున్నారు.  ఇంకొంచెం లోతుల్లోకి వెళితే, ఉప ముఖ్యమంత్రుల నియామకం గతంలో ప్రాంతీయ పార్టీలకే పరిమితం అయితే ఇప్పడు జాతీయ పార్టీలూ అదే బాటలో నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రల్లోనూ చాల వరకు రాష్ట్రాల్లో ఒకరికి మించి ఉప ముఖ్యమంత్రులున్నారు. ఉత్తర ప్రదేశ్ లో పెళ్లి పీటలే ఎక్కని, ముఖ్యమంత్రి యోగీఅదిత్య నాథ్ కు  అటు ఒకరు, ఇటు ఒకరు ఇద్దరు తోడి పెళ్లి కొడుకులున్నారు. అలాగే, మధ్య  ప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘఢ్, ఒడిస్సా, బిహార్  చివరకు నాగాలాండ్, మేఘాలయ రాష్టాలకు కుడా ఇద్దరేసి ఉప ముఖ్యమంత్రులున్నారు. ప్రాంతీయ పార్టీల ఏలుబడిలోని తమిళనాడులో తండ్రీ కొడుకులు (స్టాలిన్ ,ఉదయ నిధి స్టాలిన్)ముఖ్యమంత్రి, ఉప ముఖ్యంత్రిగా ఉన్నారు. ఎటొచ్చి, కమ్యూనిస్టుల ఎలుబడిలో ఉన కేరళ, మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్, బీజేపీ పాలిత అస్సాం వంటి రాష్ట్రాలలో మాత్రమే ముఖ్యమత్రుల  ఒంటి చేతి పాలన సాగుతోంది.  చివరగా, ఆంధ్ర ప్రదేశ్ ను ఐదేళ్ళు పాలించిన జగన్మోహన్ రెడ్డి  ఆ ఐదేళ్లలో మొత్తం 9 మందిని  ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు..ముందు అదేదో అద్భుత ప్రయోగం అన్నట్లు ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించుకున్న జగన్ రెడ్డి, ఆ తర్వాత మంత్రి వర్గం మార్పులు చేరుల్లో భాగంగా పాత వారిని తప్పించి కొత్తగా మరో నలుగురికి అవకాశం కల్పించారు. చివరకు, ఏమి జరిగింది ... 9 ప్లస్ 2 మిగిలింది.
ఆరో వేలు  అయినా సరే.. Publish Date: Mar 2, 2025 3:00PM

శంభో శివ శంభో, ఇవేమి బంధాలు శివ శంభో

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కమర్షియల్ గా మారిపోతున్నాయి. అనుబంధాలు, ఆత్మీయత అన్న మాటలు చరిత్రగర్భంలో కలిసిపోతున్నాయి. తల్లీ, తండ్రీ, భర్త, భార్య, పిల్లలు అన్న బంధాలనే లెక్క చేయని తరం ఒకటి మొదలైంది. చిన్న చిన్న మొత్తాల కోసమే ఒకరినొకరు తెగనరుక్కునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. సొమ్ములు ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రినే హతమార్చిన కొడుకు.. ఆస్తిపై పెత్తనం ఇవ్వడం లేదన్న కక్షతో తాతను తెగనరికిన మనవడు.. తన జల్సాలకు అడ్డువస్తోందన్న కోపంతో భార్యను హతమార్చిన భర్త, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఇలా దాదాపు ప్రతి రోజూఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటోంది. తాజాగా భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన భార్య ఉదంతం ఒకటి హైదరాబాద్ లో వెలుగు చూసింది. సామాజిక మాధ్యమంలో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడిన వివాహిత భర్తా జయరాజ్, ఇద్దరు పిల్లలను వదిలేసి చెప్పాపెట్టకుండా ప్రియుడితో లేచిపోయింది. భార్య ఏమైందో తెలియక వెతికి వెతికి వేసారిన భర్త జయరాజ్ పోలీసులకు భార్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ పేట్ బషీర్ బాగ్ లో చోటు చేసుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. భార్య, ఆమె ప్రియుడు బైక్ పై జల్సాగా వెడుతూ భర్త కంటే పడ్డారు. దీంతో వారిని వెంబడించాడు. దీంతో వారు బైక్ వదిలేసి రన్నింగ్ బస్సు ఎక్కి పారిపోయారు. దీంతో భర్త విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారైన వారి కోసం గాలింపు చేపట్టారు. 
శంభో శివ శంభో, ఇవేమి బంధాలు శివ శంభో Publish Date: Mar 2, 2025 9:19AM

రోజాకేమైంది.. ఆ ట్వీట్ వెనుక అర్దమేంటి?

మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఆమె మాటలూ, చేష్టలూ అన్నీ సంచలనమే. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రోజా ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  ఆ తరువాత కాంగ్రెస్ గూటికి అక్కడ నుంచి వైసీపీకి మారారు. వైసీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రోజా, జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు.  రాజకీయ ప్రత్యర్థులపై రోజా చేసే వ్యాఖ్యలు, ఆమె ఉపయోగించే భాష కారణంగా ఆమె తరచూ వివాదాస్పదం అవుతూనే ఉంటాయి.  అటువంటి రోజా తాజాగా చేసిన ఒక ట్వీట్ రాజకీయవర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలను రేకెత్తించేలా ఆమె ట్వీట్ ఉంది. జగన్ ఆమెకు చేయిచ్చి నగరి నియోజకవర్గ ఇన్ చార్జ్ గిరీ నుంచి పీకేయనున్నారా అన్న చర్చకు తెరలేపింది.   సాయం చేస్తే మరిచిపోతారు.. చేయకపోతే గుర్తు పెట్టుకుంటారు.. అందుకే ఈ హెల్ప్ అనేది చాలా విచిత్రమైనది అంటూ రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అదే సమయంలో నెటిజనులు రోజాను ఓ  రేంజ్ లో ట్రోల్ చేయడానికి కూడా కారణమైంది.     ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆర్కే రోజా.. అంతలోనే బేలగా సాయం చేస్తే మరిచిపోతారు.. చేయక పోతే గుర్తుంచుకుంటారు అంటే చేఃసిన ట్వీట్.. వైసీపీలో ఆమె స్థాయి తగ్గించేశారా అన్న అనుమానాలకు తెర తీసింది.   నగరి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా రోజా స్థానంలో గాలి జగదీష్ ను తీసుకురానున్నారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన చేరికకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఇదే విషయాన్ని జగన్ రోజాకు క్లియర్ కట్ గా చెప్పేశారనీ, ఆ కారణంగానే రోజా ఒక విధమైన నైరాశ్యంలో తాను వైసీపీకి ఎంత హెల్ప్ చేశానో అన్యాపదేశంగా గుర్తు చేస్తూ దానిని జగన్ మరచిపోయారన్న అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవడమంటే రోజాకు పొమ్మన లేక పొగపెట్టడమేనని అంటున్నారు.   అసలు 2024 ఎన్నికలలోనే రోజాకు నగరి టికెట్ ఇచ్చే ఉద్దేశం జగన్ కు లేదన్న వార్తలు బలంగా వినిపించాయి. వరుసగా రెండు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించినప్పటికీ.. పార్టీలోనే కాకుండా నియోజకవర్గ ప్రజలలో కూడా ఆమెపై తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత గూడు కట్టుకుందని భావించిన జగన్ ఆమెకు టికెట్ నిరాకరించాలని భావించారని అప్పట్లోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రోజా నోటికి జడిశారో ఏమో జగన్ అయిష్టంగానే రోజాను మళ్ళ నగరి నుంచి పోటీకి దింపారు. ఆమె ఘోరంగా పరాజయం పాలయ్యారు. అది వేరే సంగతి ఇప్పుడు ఇక రోజాను వదిలించేసుకోవడమే లక్ష్యంగా జగన్ గాలి జగదీష్ ను రంగంలోకి దింపుతున్నారు. దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడే గాలి జగదీష్. ఆయన మరో కుమారుడు గాలి భాను ప్రకాశ్ నగరి ఎమ్మెల్యే. 2024 ఎన్నికలలో గాలి భాను ప్రకాష్ తెలుగుదేశం అభ్యర్థిగా రోజాపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకుని నగరి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రోజాను వదిలించుకోవడంతో పాటు.. తెలుగుదేశం బలాన్నీ దెబ్బతీయవచ్చన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా ఒక విధమైన వైరాగ్యంలో హెల్ప్ ట్వీట్ చేసి ఉంటారని అంటున్నారు. 
రోజాకేమైంది.. ఆ ట్వీట్ వెనుక అర్దమేంటి? Publish Date: Mar 2, 2025 8:55AM

కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ దారుణ హత్య

కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్  దారుణ హత్యకు గురయ్యారు. హర్యానాకు చెందిన హిమానీ నర్వాల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కార్ విధానాలను వ్యతిరేకించండంలో క్రియాశీలంగా వ్యవహరిస్తారు. నిశిత విమర్శలతో బీజేపీ సర్కార్ పై విరుచుకుపడుతుంటారు. అటువంటి హిమానీ నర్వాల్ ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. ఈ హటన రోహతక్ జిల్లాలో జరిగింది. ఆమెను హత్య చేసి ఓ సూట్ కేసులో కుక్కి సప్లా బస్టాండ్ సమీపంలో పడేశారు.  హిమానీ నర్వాల్ హత్యకు కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆమె హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసింది. హిమానీ నర్వాల్ హంతకులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్ట కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.  
కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ దారుణ హత్య Publish Date: Mar 2, 2025 7:29AM