బాబు బాటలో పయ్యావుల.. సూపర్ బడ్జెట్

వంటను చూసి రుచి చెప్పడం కుదరదు. బడ్జెట్ విషయం కూడా అంతే.  బడ్జెట్ కు  ఈ సూత్రం వర్తిస్తుంది.  వడ్డించగానే రుచులు చెప్పడం ఎలా అయితే అయ్యే పనికాదో, ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టిన వెంటనే బడ్జెట్ బాగుందనో బాగా లేదనో చెప్పడం కుదరదు.  అయితే, ఆదాయ, వ్యయ ప్రాధన్యతలు,నిధుల కేటాయింపులన బట్టి, బడ్జెట్  ఎలా వుందో కొంతవరకు విశ్లేషించ వచ్చును. అంచనా వేయ  వచ్చును.  ఆ విధంగా చూసినప్పుడు, ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025 -2026 వార్షిక బడ్జెట్ బాగుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన తొలి పూర్తి స్థాయి  బడ్జెట్లోనే, తెలుగుదేశం వారసత్వాన్ని నిలబెట్టారు. చంద్రబాబు మార్క్ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, అభివృద్ధి, సంక్షేమం రెంటికీ సమ ప్రాధన్యత ఇచ్చారు. ఒక విధంగా చూస్తే, ఎన్నికల హామీల దృష్ట్యా కావచ్చును, సంక్షేమానికి ఒకింత ఎత్తు పీట వేశారు. అదే సమయంలో, గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో అన్ని విధాలా అణచివేతకు గురైన  అన్నదాతను ఆదుకునేందుకు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యతా క్రమలో నిధులు కేటాయించారు. ‘అన్నదాత  సుఖీభవ’ పథకానికి, రూ. 6, 300 రూపాయలు కేటాయించారు.   ఆవిధంగా రైతులకు భరోసా ఇచ్చారు. అలాగే, ‘తల్లికి వందనం’ వంటి ఇతర పధకాలకు లోటు లేకుండా రూ. 9,407 కోట్ల రూపాయలు కేటాయిచారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి’ పథకం విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చాంతాడంత  రాగం తీసి చివరకు అదేదో ... పాట పాడినట్లుగా తేల్చేశారు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కావచ్చును, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్,కోతలు, మినహాయింపులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే 1-12వ తరగతుల విద్యార్ధులు అందరికీ తల్లికి వందనం పథకం వర్తింప చేశారు.విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను స్కూళ్లు తెరిచే నాటికి అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీల సంక్షేమానికి, రూ.47,456 కోట్లు కేటాయించారు. కేటాయింపుల వరకు అయితే, వేలెత్తి చూపేందుకు పయ్యావుల ఎవరికీ ఆస్కారం ఇవ్వలేదు. అయితే,ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తమ ప్రసంగంలో పేర్కొన్నట్లుగా, దేశంలో అప్పు చేసే శక్తిలేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కావడం, విస్మరించలేని వాస్తవం. అంతే కాదు, గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంతటి దుస్థితికి చేర్చిందో తెలియచేస్తున్న వాస్తవం. జగన్ రెడ్డి ఐదేళ్ళ పాటు అందిన కాడికి అప్పులు చేసి, ఇక అప్పులు పుట్టే అవకాశమే లేకుండా చేశారు. కొత్త అప్పులకు ఆస్కారం లేక పోవడమే కాదు, జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు,అసలు చెల్లింపుల భారం మోయడం సామాన్య మైన విషయం కాదు.  నిజానికి ఇలాంటి పరిస్థితిలో బడ్జెట్ పరిమణాని రూ.3.22 లక్షల కోట్లకు పెంచడం ఒక విధంగా సాహసోపేత నిర్ణయమే. అయితే., ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలను అమలు చేయాలనే దృఢ సంకల్పంతో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సాహసోపేత మైన నిర్ణయం తీసుకుంది  అనుకోవచ్చును. అదే సమయంలో, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నట్లుగా ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు స్పూర్తితో రూపొందించిన ఈ ‘సూపర్’ బడ్జెట్ ‘సక్సెస్’ కు చంద్రబాబు శక్తి సామర్ధ్యాలే శ్రీరామ రక్ష.  జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఆయనకున్న గుర్తింపు, గౌరవాలే రాష్ట్రాన్ని రక్షించే తారక మంత్రం.
బాబు బాటలో పయ్యావుల.. సూపర్  బడ్జెట్ Publish Date: Feb 28, 2025 4:22PM

నడ్డా వారసుడెవరు?

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం కమలం పార్టీలో తీవ్ర పోరు నెలకొంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలన్న నిర్ణయానికి పార్టీ అధిష్ఠానం వచ్చింది. త్వరలో జరగనున్న పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు పార్టీలో తీవ్ర పోటీ నెలకొని ఉంది. మరో ఐదేళ్ల పాటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం బలమైన నాయకుడిని జాతీయ అధ్యక్ష స్థానానికి ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రధానంగా రేసులో నలుగురు ముందు వరుసలో ఉన్నారు. వారిలో మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజె,  పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, మహారాష్ట్ర బీజేపీ నేత వినోద్ థావ్డే ఉన్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ నలుగురిలో ఒకరు పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టే  అవకాశాలు మెండుగా ఉన్నాయి. వచ్చే నెల 15 నాటికి పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక పూర్తి చేయాలని కమలం అధిష్ఠానం భావిస్తున్నది. అయితే పార్టీ నిబంధనల మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి అయిన తరువాత మాత్రమే జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంటుంది. పార్టీ రాష్ట్ర శాఖలలో కనీసం సగం రాష్ట్రాల ఎన్నికలైనా పూర్తైతే కానీ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక చేపట్టడానికి పార్టీ రూల్స్ అంగీకరించవు. ఇప్పటి వరకూ 12 రాష్ట్రాలలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్ష ఎన్నిక జరపాలంటే మరో ఆరు రాస్ట్రాలలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంది.  కాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్, అసోం రాష్ట్రాలలో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చూసింది. అదే సమయంలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పేర్లు సూచించాల్సిందిగా కూడా పార్టీ హైకమాండ్ రాష్ట్రాల ఇన్ చార్జ్ లకు సూచించింది.  కాగా పోటీ తీవ్రంగా ఉండటంతో బీజేపీ శ్రేణులలో కూడా బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠ నెలకొంది.  
నడ్డా వారసుడెవరు? Publish Date: Feb 28, 2025 3:11PM

బద్రీనాథ్ హైవేపై మంచు చెరియలు విరిగిపడి 47 మంది గల్లంతు

ఉత్తరాఖండ్ లో ఘోరం సంభవించింది. బదరీనాథ్, చమోలీ హైవేపై మంచు చెరియలు విరిగిపడ్డారు. ఈ ఘటనలో అక్కడ రోడ్డు నిర్మాణ పనిలో నిమగ్నమై ఉన్న 47 మంది సజీవ సమాధి అయ్యారు. ఆ ప్రదేశంలో మొత్తం 57 మంది పని చేస్తుండగా వారిల పది మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 47 మంది జాడ తెలియరాలేదు. ఎస్ఆర్డీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీగా మంచుకురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.  చమోలి-బద్రినాథ్ హైవేపై గ్లేసియర్ (హిమానీనదం) బరస్ట్ అయింది. దీంతో 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మంచులో కూరుకుపోయారు. వారిలో 10 మందిని రక్షించగా, 47 మంది ఆచూకీ దొరకలేదు. సహాయక చర్యల కోసం SDRF, NDRF బృందాలు రంగంలోకి దిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా అక్కడ భారీగా మంచు కురుస్తోంది.
బద్రీనాథ్ హైవేపై మంచు చెరియలు విరిగిపడి 47 మంది  గల్లంతు Publish Date: Feb 28, 2025 2:50PM

పోసాని అరెస్టుతో విజయసాయి లో మొదలైన టెన్షన్!?

జనసేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై అనుచిత విమ‌ర్శ‌లు చేశార‌న్న ఫిర్యాదుపై పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు.  ఆయనపై 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేసి హైదరాబాద్ లోని మై హోం భూజా అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న ఆయనను అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. అన్నమయ్య జిల్లాలోని  ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్ లో ఆయనను సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయనను రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పోసాని కృష్ణ మురళిని రాజం పేట సబ్ జైలుకు తరలించారు.   వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో.. వారిని వదిలే ప్రసక్తే లేదు.. వెయిట్ అండ్‌ వాచ్.. మార్క్ మై వర్డ్స్‌.. టైం.. డేట్‌ కూడా రాసుకోండి అంటూ మంత్రి నారా లోకేశ్ మండ‌లిలో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. త‌ద్వారా త్వ‌ర‌లో మ‌రికొంత మంది వైసీపీ నేత‌లు అరెస్టు కాబోతున్నార‌ని లోకేశ్ క్లియర్ కట్ గా చెప్పారు. దీంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. ఎవ‌రు ఎప్పుడు క‌ట‌క‌టాల పాలుకావాల్సి వ‌స్తుందోన‌ని భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. సరిగ్గా ఆ పరిస్థితిలో పోసాని కృష్ణ మురళి అరెస్టయ్యారు. దీంతో ఇప్పుడు అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయిన వైసీపీయులందరిలో వణుకు మొదలైంది? తరువాతి వంతు ఎవరు? అన్న ఆందోళన ప్రారంభమైంది.  అయితే పోసాని కృష్ణ మురళి అరెస్టుతో అందరి కన్నా ఎక్కువగా ఆందోళన పడుతున్నది మాత్రం విజయసాయి రెడ్డి అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.  ఎందుకంటే వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత జ్ణానోదయం అయ్యి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి.. చేసిన తప్పులు దండంతో సరిపెట్టేయండి ప్లీజ్ అంటూ వేడుకున్న పోసాని కృష్ణ మురళి అరెస్టు అయ్యారు. విజయసాయిరెడ్డి కూడా అరెస్టు తప్పించుకోవడానికి రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. ఇక తన వ్యాపకం వ్యవసాయమేనని చాటి చెప్పారు. పనిలో పనిగా గతంలో తాను విమర్శలు చేసిన వారికి పరోక్షంగా క్షమాపణలు కూడా చెప్పేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రులని ఉద్ఘాటించారు. అంతే కాదు.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా కీలకమైన ఒక రాజ్య సభ స్థానాన్ని తెలుగుదేశం కూటమికి అప్పగించేశారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఒక్కటంటే ఒక్క రాజ్యసభ స్థానం కానీ, ఎమ్మెల్సీ స్థానం కానీ గెలుచుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు.    వైసీపీకి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేయడం, అప్పనంగా రాజ్యసభ సీటును పాలక కూటమికి అప్పగించేయడం ద్వారా ప్రభుత్వం తనపై కరుణ చూపుతుందని విజయసాయిరెడ్డి ఆశించారనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ స్థానంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి అవకాశం ఇస్తుందా లేదా అన్నది పక్కన పెడితే.. బీజేపీ మాత్రం ఏదో మేరకు విజయసాయిపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ తెలుగుదేశం మాత్రం విజయసాయి విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటుందని భావించలేం. ఎందుకంటే జగన్ ఆస్తుల కేసులో విజయసాయి ఆయన సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2. అలాగే వైఎస్ రాజారెడ్డి కాలం నుంచీ విజయసాయి వైఎస్ఆర్ కుటుంబానికి ఆడిటర్. అన్నిటికీ మించి రాజకీయాలలో జగన్ కు వెన్నంటి నడిచిన వాడు, నడిపించిన వాడూ కూడా విజయసాయిరెడ్డే. అటువంటి విజయసాయిరెడ్డి 2029 ఎన్నికల సమయానికి మళ్లీ రాజకీయాలలోకి వచ్చి జగన్ కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశాలను పూర్తిగా కొట్టి పారేయలేం. అందుకే విజయసాయిరెడ్డిని తేలికగా తీసుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉండే అవకాశాలు లేవు.    
పోసాని అరెస్టుతో విజయసాయి లో మొదలైన టెన్షన్!? Publish Date: Feb 28, 2025 1:32PM

 మాజీ మంత్రి హరీష్ రావు కు బిగ్ షాక్

మాజీ మంత్రి హ‌రీశ్‌రావుపై మ‌రో కేసు న‌మోదైంది.  చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే వ్య‌క్తి బాచుప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో  హ‌రీశ్‌రావుతో పాటు మ‌రో ముగ్గురి  పై కేసు నమోదైంది.  హరీష్ రావు నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని చక్ర‌ధ‌ర్ గౌడ్ తన  ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హ‌రీశ్‌రావుపై  బిఎన్ఎస్  యాక్ట్ 351(2), ఆర్‌డ‌బ్ల్యూ3(5) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు బాచుప‌ల్లి పోలీసులు తెలిపారు. హ‌రీశ్‌రావుతో పాటు సంతోశ్‌ కుమార్, రాములు, వంశీపై  కూడా కేసు న‌మోదైంది. ఎఫ్ఐఆర్‌లో రెండో నిందితుడిగా పోలీసులు హరీశ్‌రావు పేరును చేర్చారు.  ఇటీవలె బెయిల్ పై విడుదలైన హరీష్ రావు అనుచరులు   చక్రధర్ గౌడ్ పై బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. 
 మాజీ మంత్రి హరీష్ రావు కు బిగ్ షాక్ Publish Date: Feb 28, 2025 1:16PM