ఉప రాష్ట్రపతి వెంకయ్య గుమ్మడికాయల దొంగ అంటే ఆర్జీవీ భుజాలు తడుముకున్నారు

తెలుగు వారెవరికీ పరిచయం అక్కర్లేని పేరు రామ్ గోపాల్ వర్మ.. సినిమా దర్శకుడిగా ఆయన ఎంత ప్రముఖుడో అంతటి వివాదాస్పద వ్యక్తి. కెరీర్ తొలి నాళ్లలో అందరి అభిమానాన్ని చూరగొనే విధంగా కొన్ని సినిమాలు తీసిన రామగోపాల వర్మ ఆ తరువాత రాజకీయ సినిమాలతో తెలుగునాట రచ్చ చేసిన వ్యక్తి.  

ఇక అక్కడ నుంచి మరీ బరితెగించేసి  నా సినిమా నా ఇష్టం అంటూ సభ్య సమాజం అంగీకరించలేని కథలతో సినిమాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. సామాజిక మాధ్యమంలో అత్యంత చురుకుగా ఉండే రామ్ గోపాల్ వర్మ.. ఎవరేం అనుకుంటే నాకేంటి నా బతుకు నా ఇష్టం అంటూ ఇష్టారీతిన పోస్టులు పెడుతుంటాడు. తరచూ మీడియాలో కూడా కనిపిస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు.

ఆయన వివాదాలను ఆహ్వానిస్తాడు. తన సినిమాలు ఫ్లాప్ అయినా.. వివాదాలే తనకు విందు భోజనం అన్న రీతిలో బే ఫికర్ గా గడిపేస్తుంటాడు. అలాంటి వ్యక్తి ఉప రాష్ట్ర పతి వ్యాఖ్యలకు షేక్ అయిపోయాడు. నేరుగా తనను పేరు పెట్టి చేసిన వ్యాఖ్యలు కాకపోయినా భుజాలు తడిమేసుకున్నాడు. వ్యంగ్య ట్వీట్లతో మరోసారి రచ్చకెక్కాడు. ఇంతకీ జరిగిందేమిటంటే... పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

ఆ కార్యక్రమంలో ఆయన సిరివెన్నలా బాషా వైదుష్యాన్ని పొగుడుతూ, ఇటీవల కోందరి సినిమాలు అజ్ణానానికి కేరాఫ్ అడ్రస్ లా ఉంటున్నాయనీ, అశ్లీలతా, అసభ్యతల హద్దులు చెరిపేస్తున్నాయనీ వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు జనరల్ గా చేసిన ఆ వ్యాఖ్యలు సూటిగా రామగోపాల వర్మకే తగిలినట్లున్నాయి. అందుకే ఓహోఅలాగా, నిజామా? ఫెంటాస్టిక్.. మంచి సూచనలు ఇచ్చినందుకు ధ్యాంక్స్ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై నెటిజన్లు మండి పడుతున్నారు. అయినా ఇలాంటి మండి పాట్లను లెక్క చేసే తత్వం కాదనుకోండి ఆయనది. కానీ తాను తీస్తున్న సినిమాలు సభ్య సమాజం మెచ్చేవి కావని రామ్ గోపాల్ వర్మకు స్పష్టంగా తెలిసు కనుకనే వెంకయ్యనాయుడు జనరల్ గా చేసిన వ్యాఖ్యలకు గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా స్పందించారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.