Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీమిండియా యువ క్రికెటర్‌కు...యూపీ ప్రభుత్వ అరుదైన గౌరవం
posted on: Mar 24, 2026 9:36PM

భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన స్టార్ బ్యాటర్, పవర్ హిట్టర్ రింకూ సింగ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు గుర్తింపుగా, అతడిని రాష్ట్ర క్రీడా శాఖలో రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం లక్నోలోని లోక్ భవన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రింకూ సింగ్‌తో పాటు పలువురు క్రీడాకారులకు ముఖ్యమంత్రి స్వయంగా నియామక పత్రాలను అందజేశారు.
టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచ కప్ 2026 లో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీ సమయంలోనే తన తండ్రి తీవ్ర అనారోగ్యంతో మరణించినప్పటికీ, వ్యక్తిగత బాధను దిగమింగుకుని దేశం కోసం అద్భుతంగా రాణించిన రింకూ అంకితభావాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించింది. క్రీడా కోటా కింద నేరుగా గెజిటెడ్ అధికారి హోదాలో రింకూను నియమించడం ద్వారా ఇతర యువ క్రీడాకారులకు స్ఫూర్తిని నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.
వాస్తవానికి గత ఏడాది రింకూను విద్యా శాఖలో నియమించాలని భావించినా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇప్పుడు క్రీడా శాఖలోనే బాధ్యతలు అప్పగించడం ద్వారా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఆయన సేవలను వినియోగించుకోవాలని యోగి సర్కార్ భావిస్తోంది. ఈ నియామకం ద్వారా రింకూ సింగ్ నెలకు సుమారు 50 నుండి 60 వేల రూపాయల వేతనంతో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను పొందనున్నారు.
రింకూ సింగ్‌తో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో రాణించిన హాకీ ప్లేయర్ రాజ్‌కుమార్ పాల్‌ను డీఎస్పీగా, పారాలింపిక్ విజేతలు ప్రవీణ్ కుమార్, అజిత్ సింగ్, సిమ్రన్ తదితరులకు కూడా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నత పదవులను కేటాయించారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ వేదికలపై మెరిసిన ఆరుగురు క్రీడాకారులకు ఈ గౌరవం లభించింది.
ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న రింకూ సింగ్, ఈ టోర్నీ ముగిసిన అనంతరం తన కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం పట్ల క్రీడా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మైదానంలోనే కాకుండా, పరిపాలనా పరంగా కూడా రింకూ తనదైన శైలిలో రాణిస్తాడని ఆశిస్తున్నారు.



.webp)


