రేవంత్ పిల‌క కేసీఆర్ చేతుల్లో ఉంది.. ష‌ర్మిల ఆవేద‌న‌తో మాట్లాడుతోంది..

కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు గుంజాల‌నేది పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టార్గెట్‌. తెలంగాణ‌లో ఎలాగైనా పాగా వేయాల‌నేది వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల ల‌క్ష్యం. ఆమె భ‌విష్య‌త్తుకు బ‌ల‌మైన ఆడ్డంకి రేవంత్‌రెడ్డి. ఆయ‌న్ను దాటుకొని వెళితేనే కేసీఆర్‌ను ఢీకొట్టగ‌ల‌రు ష‌ర్మిల‌. రేవంత్‌రెడ్డి దూకుడు రాజ‌కీయం ముందు.. ష‌ర్మిల సెటైర్లు తేలిపోతున్నాయి. అందుకే, త‌న రాజ‌కీయ భ‌విత‌కు అడ్డుగా ఉన్న రేవంత్‌రెడ్డిని అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా ఇర‌కాటంలో ప‌డేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ష‌ర్మిల‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రేవంత్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అందుకే, రేవంత్‌రెడ్డి త‌న‌దైన స్టైల్‌లో ఆన్స‌ర్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

"రేవంత్‌రెడ్డి గారి పిలక కేసీఆర్‌ చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలక కాదు.. మెడ తీసేయగలడు. అలాంటివాడు కేసీఆర్‌ మాట వింటాడా? కాంగ్రెస్‌ మాట వింటాడా? తెలంగాణ‌లో  ప్రతిపక్షమే లేదు. ఈ రోజు కాంగ్రెస్‌.. పార్టీగా కాకుండా ‘కాంగ్రెస్‌ సప్లయింగ్‌ కంపెనీ’గా మారింది. కేసీఆర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతకు కావాలి? అని బేరమాడే స్థితికి వచ్చింది కాంగ్రెస్‌. అది ప్రతిపక్షమెలా అవుతుంది? అంటూ ఆ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు ష‌ర్మిల‌". 

ష‌ర్మిల మాట‌ల‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. అయితే, కేసీఆర్‌పై అటాక్ చేసిన‌ట్టు ఎదురుదాడి చేయ‌కుండా.. ఆమె ఆరోప‌ణ‌లకు అంతగా ప్రాధాన్యం లేద‌న్న‌ట్టు మాట్లాడారు. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆవేదనతో ఏదో మాట్లాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. రాజకీయ పార్టీల నేతలు మాట్లాడితే తాను స్పందిస్తానని, ఎన్జీవో నడిపేవారు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాజకీయాలతో షర్మిలకు సంబంధం లేదని కొట్టిపారేశారు. వైఎస్ ఆస్తులకు వారసులు జగన్, షర్మిలేనని చెప్పారు. కులపెద్దల మధ్య పంచాయితీ పెట్టుకొని ఆస్తుల సమస్య తీర్చుకోవాలని సూచించారు. ‘‘వైఎస్ ఆస్తులు మాకొద్దు.. మేము వారసులం కాదు. రాజకీయంగా మాత్రం వైఎస్ కాంగ్రెస్ నాయకుడే’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. 

ఇలా రేవంత్‌రెడ్డి ఎలాంటి ఘాటైన వ్యాఖ్య‌లు చేయ‌కుండా.. వ్యూహాత్మ‌కంగా స్పందించ‌డం.. ఆమె ఆవేద‌న‌తో ఏదో మాట్లాడుతోందంటూ లైట్ తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న మెయిన్ టార్గెట్ కేసీఆర్ మాత్ర‌మేన‌ని.. ష‌ర్మిల‌తో త‌న‌కు పెద్ద‌గా పోటీ లేద‌న్న‌ట్టు ఉంది రేవంత్‌రెడ్డి రియాక్ష‌న్‌.