కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి "వైట్ ఛాలెంజ్‌".. ముదిరిన డ్ర‌గ్స్ జ‌గ‌డం..

మాట‌కు మాట‌. స‌వాల్‌కు ప్ర‌తిస‌వాల్‌. కేటీఆర్‌-రేవంత్‌రెడ్డి మ‌ధ్య డ్ర‌గ్స్ జ‌గ‌డం ముదురుతోంది. ప‌ర‌స్ప‌ర స‌వాళ్లతో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. మంత్రి కేటీఆర్‌కు డ్ర‌గ్స్‌కు లింకు పెడుతూ కొద్దిరోజులుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. గ‌జ్వేల్ స‌భ‌లో మ‌రింత సంచ‌ల‌న కామెంట్లు చేశారు. డ్ర‌గ్స్ వాడేవారికి కేటీఆర్ అంబాసిడ‌ర్ అంటూ ర‌చ్చ రాజేశారు. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్‌. డ్ర‌గ్స్‌తో త‌న‌కేంటి సంబంధం అంటూ రేవంత్‌రెడ్డిని నిల‌దీశారు. 

డ్ర‌గ్స్ వివాదంలో మ‌రో అడుగు ముందుకేసిన కేటీఆర్‌.. త‌న ర‌క్త న‌మూనాలు, లివ‌ర్ టెస్ట్‌కు శాంపిల్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌న్నారు. ద‌మ్ముంటే రాహుల్‌గాంధీ కూడా డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల‌కు రావాల‌ని స‌వాల్ చేశారు. త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోమ‌ని.. అవ‌స‌ర‌మైతే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని రేవంత్‌రెడ్డిని హెచ్చ‌రించారు కేటీఆర్‌. నోటికొచ్చిన‌ట్టు వాగితే.. బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్‌. 

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఏమాత్రం త‌గ్గ‌ట్లే. మంత్రి కేటీఆర్ స‌వాల్‌కు ప్ర‌తిగా.. "వైట్ స‌వాల్" విసిరారు రేవంత్‌. కేటీఆర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిల‌కు తాను "వైట్ ఛాలెంజ్‌" విసురుతున్న‌ట్టు చెప్పారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు గ‌న్‌పార్కు ద‌గ్గ‌ర‌కు వ‌స్తా. మీరు ఏ హాస్పిట‌ల్‌కు ర‌మ్మంటే అక్క‌డికి వ‌స్తా. త‌న ర‌క్తం, వెంట్రుక‌లు ఇస్తా. మీకిష్ట‌మొచ్చిన ప‌రీక్ష‌లు చేయించుకోండి. అంటూ కేటీఆర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిల‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి "వైట్ ఛాలెంజ్" విసిరడం సంచ‌ల‌నంగా మారింది. 

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో రాణా, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌ల‌ను కేటీఆర్ కాపాడాల‌ని చూసింది నిజం కాదా? బెంగ‌ళూరులో డ్ర‌గ్స్ కేసుపై విచార‌ణ జ‌రుగుతుంటే టీఆర్ఎస్ నేత‌లు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? హైద‌రాబాద్ స్కూల్స్, కాలేజెస్‌, ప‌బ్స్‌లో డ్ర‌గ్స్ అమ్ముతుండ‌టం  మీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కాదా?  యువ‌త‌రాన్ని కాపాడే బాధ్య‌త లేదా? డ్ర‌గ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించ‌రు? అంటూ రేవంత్‌రెడ్డి నిల‌దీశారు. మ‌రి, రేవంత్ విసిరిన "వైట్ ఛాలెంజ్"ని కేటీఆర్, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిలు స్వీక‌రిస్తారా?