కాంగ్రెస్‌లోకి డీఎస్‌!.. అర్వింద్ కూడా? రేవంత్ వ్యూహం అదుర్స్‌..

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌ను క‌లిశారు. మామూలుగా అయితే ఇదేమంత ఆస‌క్తిక‌ర విష‌యం కాక‌పోవ‌చ్చు. కానీ, ఆ మాజీ పీసీసీ చీప్ ఇప్పుడు కాంగ్రెస్‌లో లేరు. టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. అందులోనూ కేసీఆర్‌తో తేడాలొచ్చి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక డీఎస్ త‌న‌యుడు అర్వింద్‌.. బీజేపీ ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ. మ‌రో త‌న‌యుడు సంజ‌య్ ఇటీవ‌లే రేవంత్‌ను క‌లిసి కాంగ్రెస్‌కు జై కొట్టారు. అలాంటి డి.శ్రీనివాస్‌ను ఇంటికెళ్లి మ‌రీ క‌లిసొచ్చారు రేవంత్‌రెడ్డి. 

ఇటీవ‌ల‌ డీఎస్‌ కిందపడిపోగా చెయ్యి విరిగింది. ఆ విషయం తెలిసి పరామర్శించేందుకు వెళ్లారు రేవంత్‌రెడ్డి. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని, డి.శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషని అందుకే పలకరించేందుకు వెళ్లిన‌ట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు. పైపైన చూస్తే.. ఇదే మామూలు ప‌రామ‌ర్శ‌లానే అనిపించినా.. ఈ ప‌రిణామం రేవంత్‌రెడ్డి రాజ‌కీయ చాతుర్యానికి నిద‌ర్శ‌నం అంటున్నారు. 

వైఎస్‌-డీఎస్ కాంబినేష‌న్ ఉమ్మ‌డి రాష్ట్రంలో బంప‌ర్ హిట్‌. రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు వారిద్ద‌రు. అలాంటి ఉద్దండుడైన డి.శ్రీనివాస్‌.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ప్రాభ‌వం కోల్పోవ‌డంతో టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ సైతం ఆయ‌న‌కు మంచి ప్రాధాన్య‌మే ఇచ్చారు. రాజ్య‌స‌భ‌కు పంపించారు. కానీ, ఆ త‌ర్వాత డీఎస్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. కేసీఆర్ తీరు న‌చ్చ‌క అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్నా.. త‌న‌యుడు అర్వింద్ మాత్రం బీజేపీలో యాక్టివ్‌గా కొన‌సాగుతున్నారు. నిజామాబాద్‌ ఎంపీగా అర్వింద్ గెల‌వ‌డంతో డీఎస్ స‌హ‌కారం ఉందంటారు. ఇక మ‌రో త‌న‌యుడు సంజ‌య్ మాత్రం రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వం మెచ్చి ఇటీవ‌లే కాంగ్రెస్ వైపు ఆక‌ర్షితుల‌య్యారు. సంజ‌య్ కాంగ్రెస్ వైపు చూట్టానికి డి.శ్రీనివాసే కార‌ణ‌మ‌ని చెబుతారు.

దీంతో.. రేవంత్‌రెడ్డి మ‌రో అడుగు ముందుకేశారు. ప‌రామ‌ర్శ‌క‌ని డీఎస్ ఇంటికెళ్లి ఆయ‌న్ను తిరిగి కాంగ్రెస్‌లోకి ర‌మ్మ‌ని ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ మాదిరి కాకుండా.. కాంగ్రెస్‌లో డీఎస్‌కు స‌ముచిత స్థానం, ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ప‌నిలో ప‌నిగా బీజేపీ ఎంపీ అర్వింద్‌కు సైతం న‌చ్చ‌జెప్పి పార్టీలో చేర్పించాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది. 

నిజామాబాద్‌కు ప‌సుపు బోర్డు తీసుకొస్తానంటూ వాగ్ధానం చేసి.. కేసీఆర్ కూతురు క‌విత‌ను ఓడించి.. ఎంపీగా గెలిచారు ధ‌ర్మ‌పురి అర్వింద్‌. అయితే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆయ‌న బీజేపీ ఎంపీ అయినా.. నిజామాబాద్‌కు మాత్రం ప‌సుపు బోర్డు తీసుకురాలేక‌పోయారు. ఆ విష‌యంలో నిజామాబాద్ రైతులు అర్వింద్‌పై-బీజేపీపై ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈసారి బీజేపీకి గుణ‌పాఠం చెప్పడం ఖాయం అంటున్నారు. ఆ విష‌యం ప‌సిగ‌ట్టిన రేవంత్‌రెడ్డి.. అర్వింద్ బీజేపీ నుంచి పోటీ చేస్తే గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని.. అందుకే కాంగ్రెస్‌లో చేరితే బెట‌ర‌ని.. రైతుల కోపం బీజేపీ మీద‌నే కానీ, అర్వింద్ మీద కాద‌ని.. డీఎస్‌కు వివ‌రించి చెప్పారట‌. ఆ మేర‌కు అర్వింద్‌ను ఒప్పించి కాంగ్రెస్‌లో చేరేలా చూడాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం. ఇలా.. ఇటు డీఎస్‌ను, అటు అర్వింద్‌ను ఒకేసారి పార్టీలో చేరేలా రేవంత్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. సంజ‌య్ ద్వారా ఆ మేర‌కు ధ‌ర్మ‌పురి ఫ్యామిలీతో రాజ‌కీయం న‌డిపిస్తున్న రేవంత్‌రెడ్డి ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి..