జగ్గారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్.. వేటు వేస్తారా?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో పీసీసి చీఫ్ రేవంత్ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా రాజుకున్న అసమ్మతి సెగలు, ఇంకా మండుతూనే ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా అప్పాయింట్ అయిన మరు క్షణం నుంచే మొదలైన అసమ్మతి, ఆ తర్వాత కొంత సర్ధు మణిగింది. అడపా తడపా కోమటి రెడ్డి సోదరలు ఒకటి ఆరా చురకలు వేస్తున్నా, పార్టీలో అసమ్మతి అంతగా ఫోకస్ లోకి రాలేదు. కానీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై సంధించిన అసమ్మతి అస్త్రాలు కాక పుట్టిస్తున్నాయి. అంతే కాదు జగ్గారెడ్డి వదిలిన బాణాలు ఢిల్లీని కూడా తాకాయి అంటున్నారు. 

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని, జగ్గారెడ్డిపై చర్యలు తీసుకున్నా తీసుకోవచ్చని పార్టీ వర్గాలా సమాచారం. జగ్గారెడ్డి చేసిన  విమర్శల సారాంశాన్ని, ఆ విమర్శల ప్రధాన ఉద్దేశాలకు సంబదించి రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, కొంతమంది నాయకలను అడిగి తెలుకున్నట్లు తెలుస్తోంది. జగ్గా రెడ్డి మాట్లాడిన వీడియో క్లిపులను కూడా మాణిక్కం ఠాగూర్,  తెప్పించుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో పీసీసీ చీఫ్ టూర్ కు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్ గా , జిల్లా ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనకు జిల్లాలో జరిగే కార్యక్రమంపై ఎందుకు చెప్పరని  జగ్గా రెడ్డి ప్రశ్నించారు. పీసీసీ చీఫ్, సర్వం తానే అన్నట్లు ఒంటెద్దు పోకడలు పోతున్నారని, మండి పడ్డారు. రేవంత్ రెడ్డి ఇదే ధోరణి  కొనసాగిస్తే పార్టీ మనగడకే ముప్పు ఏర్పడుతుంది జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్ చేసారు. 

అంతే  కాదు తాను పార్టీ వదిలి, తెరాసలో చేరినా తనను ఎవరూ ఏమీ చేయలేరని, సవాలు విసిరారు. ఇంకా ముందుకెళ్ళి  రేవంత్ రెడ్డి ధోరణి వలన పార్టీకి కోలుకోలేని దెబ్బ తప్పదని హెచ్చరించారు. పీసీసీ చీఫ్ టార్గెట్’ గా జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ, పార్టీ వర్గాల్లో అటు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అందుకే జగ్గారెడ్డి అసమ్మతిని చర్చించేందుకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, తక్షణమే  సమావేశం కావాలని చెప్పారు మాణిక్కం ఠాగూర్ రాష్ట్ర నాయకులను కోరారు. 

మరోవైపు రేవంత్ తీరుపై గుర్రుగా ఉన్న సీనియర్లు ఆ విషయం కూడా చర్చిచాలని అంటున్నారు.  పీసీసీ చీఫ్ పై  సీనియర్ నాయకులూ మరోమారు హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మాణిక్కం ఠాగూర్ , పీసీసీ చీఫ్ రేవంత్’తో పాటు షబ్బీర్ అలీ, ఇతర నేతలు హాజరవుతారు. జగ్గా రెడ్డి పై ఇప్పటికిప్పుడు వేటు వేయడం వంటి కఠిన నిర్ణయం తీసుకునే సాహసం కాంగ్రెస హై కమాండ్ అయిన చేయకపోవచ్చునని అంటున్నారు. ఏమవుతుందో .. చూడవలసి ఉంది.