కేసీఆర్‌కు రేవంత్‌, ఈట‌లల‌ వ‌ర్రీ.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు కొర్రీ..!

అధికార పార్టీకి ఫుల్ బ‌ల‌ముంది. కావ‌ల‌సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగితే.. ఏడుకు ఏడు క్లీన్ స్వీప్‌. అందులో నో డౌట్‌. అయినా, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఇప్పుడు సాధ్యప‌డ‌దంటూ ఈసీకి బ‌దులిచ్చింది స‌ర్కారు. ఇదే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈజీగా గెలిచే అవ‌కాశ‌మున్నా.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ఇబ్బందీ లేకున్నా.. ప్ర‌భుత్వం ఎందుకు ఎన్నిక‌ల నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తోంద‌నే ప్ర‌శ్న వ‌స్తోంది. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌ల ఫిక‌ర్ ప‌ట్టుకుంద‌ని.. వారివ‌ల్లే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు స‌సేమిరా అంటోంద‌ని తెలుస్తోంది. ఇంత‌కీ.. ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్‌కి రేవంత్‌కి లింకేంటి? ఈట‌ల ఎలా కార‌ణం? 

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్‌లో మున‌ప‌టి జోష్ క‌నిపిస్తోంది. కేడ‌ర్లో ఉత్సాహం నెల‌కొంది. ఈ కొత్త వాత‌వ‌ర‌ణం చూసి నాయ‌కులు సైతం పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. టీఆర్ఎస్‌, బీజేపీలో ఉన్న అసంతృప్తులు హ‌స్తం పార్టీ వైపు చూస్తున్నారు. బీజేపీలో ఉన్న‌దే పిడికెడు మంది నాయ‌కులు. వారిలో ఇప్ప‌టికే ఇద్ద‌రు ముగ్గురు పార్టీ చెవిలో పువ్వెట్టి వెళ్లిపోయారు. అదే భ‌యం ఇప్పుడు టీఆర్ఎస్‌లోనూ నెల‌కొంది. కారు ఇప్ప‌టికే ఓవ‌ర్‌లోడ్. కేసీఆర్‌ గ‌ద్దెనెక్కాక‌.. కాంగ్రెస్ నుంచి అనేక‌మంది లీడ‌ర్ల‌ను లాక్కున్నారు. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ముగ్గురు న‌లుగురు ఎమ్మెల్యే స్థాయి నేత‌లున్నారు. వారంద‌రికీ ప‌ద‌వులు క‌ల్పించ‌డం అసాధ్యం. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ టికెట్ రావ‌డం చాలా క‌ష్టం. 

అలాంటి వారంతా.. ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌పై ఎప్ప‌టి నుంచో ఆశ‌గా ఉన్నారు. గులాబీ బాస్ సైతం ప‌లువురికి ఎమ్మెల్సీ ఇస్తానంటూ హామీ ఇచ్చి గులాబీ కండువా క‌ప్పేశారు. ఇప్పుడా స‌మ‌యం రావ‌డంతో ప్లేట్ ఫిరాయిస్తున్నారు. టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఆశావ‌హుల సంఖ్య జిల్లాకు ఒక్క‌రిని వేసుకున్నా.. 30మందికి పైనే ఉంటారు. ఉన్న‌వి మాత్రం కేవ‌లం 7 ఖాళీలే. ఏ ఏడుగురిని ఎమ్మెల్సీ చేసినా.. మిగ‌తా వారంతా ఎదురు తిర‌గ‌క త‌ప్ప‌దు. అందుకు రేవంత్‌రెడ్డే కార‌ణం. గ‌తంలో కేసీఆర్ త‌మ‌కు ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోయినా.. నోరు మూసుకొని కారులో ఓ మూల‌న ప‌డుండేవారు. కానీ, రేవంత్ రాక‌తో సీన్ మారిపోతోంది. కేసీఆర్ త‌మ‌ను ప‌ట్టించుకొని ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోతే కాంగ్రెస్‌లో చేరేందుకు అనేక‌మంది నాయ‌కులు రెడీగా ఉన్నారు. వారంతా ఎమ్మెల్సీ వ‌స్తుందేమోన‌నే ఆశ‌తో ఇంత‌కాలం మౌనంగా ఎదురుచూశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వ‌డంతో.. త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ ఎమ్మెల్సీ ఇస్తే స‌రేస‌రి. లేదంటే, రేవంత్‌కు జై కొట్ట‌డం త‌ప్ప‌నిస‌రిలా మారింది ప‌రిస్థితి. అందుకే, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌ర్కారు ముందుకు రావ‌డం లేద‌ని అంటున్నారు. ఎల‌క్ష‌న్‌పై ఈసీ ప్ర‌భుత్వ అభిప్రాయాన్ని కోరితే.. ఇప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేమంటూ తేల్చి చెప్పింది. 

ప్ర‌భుత్వం ఇప్పుడే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌ద్దు అన‌డానికి మ‌రోకారణం కూడా వినిపిస్తోంది. ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం వ‌ల్లే స‌ర్కారు ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్‌ను ఆల‌స్యం చేస్తోంద‌ని అంటున్నారు. హుజురాబాద్‌లో రాజ‌కీయ వేడి మామూలుగా లేదు. ఈట‌ల‌పై సానుభూతి వెల్లువెత్తుతోంది. ఇప్ప‌టికిప్పుడు ఉప‌ ఎన్నిక జ‌రిగితే.. రాజేంద‌ర్‌ భారీ మెజార్టీతో గెల‌వ‌డం ఖాయం అంటున్నారు. ఇలాంటి ఇంటలిజెన్స్ నివేదిక‌లు స‌ర్కారుకు ఆందోళ‌న క‌లిగిస్తోంది. అందుకే, హుజురాబాద్లో ఎల‌క్ష‌న్ ఎంత లేట్ అవుతుంటే.. రాజ‌కీయ వేడి అంత‌లా త‌గ్గి ఈట‌ల‌పై సానుభూతి స‌డ‌లిపోయే అవ‌కాశం ఉంటుంది. అందుకే, ఉప ఎన్నిక ఆల‌స్యం కావాల‌ని టీఆర్ఎస్ కోరుకుంటోంది. ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్ నిర్వ‌హ‌ణకు సానుకూలంగా స్పందిస్తే, హుజూరాబాద్‌ ఉప ఎన్నికకూ పరోక్షంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యపడదని ప్రభుత్వం ఈసీకి బదులిచ్చినట్లు తెలుస్తోంది. కుద‌ర‌ద‌ని ప్ర‌భుత్వం అభ్యంత‌రం చెబితే.. ఇక హుజురాబాద్‌ ఎన్నిక సైతం ఇప్ప‌ట్లో వ‌ద్ద‌ని ఈసీ ముందు గ‌ట్టిగా వాదించే ప్ర‌య‌త్నం చేయొచ్చ‌నేది స‌ర్కారు ఎత్తుగ‌డ‌లా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 

ఇలా ఇటు రేవంత్‌రెడ్డి, అటు ఈట‌ల రాజేంద‌ర్ ఎఫెక్ట్‌తోనే టీఆర్ఎస్ స‌ర్కారు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణకు మొకాలొడ్డుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. కేసీఆర్‌ను ఇంత‌లా కంగారు పెడుతున్నారంటే.. ప్ర‌జ‌ల్లో రేవంత్‌, ఈట‌ల‌ల క్రేజ్ ఓ రేంజ్‌లో ఉన్న‌ట్టేగా....