Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమరావతి రైతులదే ఈ విజయం.. రాజ్యసభలో రేణుకా చౌదరి భావోద్వేగ ప్రసంగం
posted on: Apr 2, 2026 3:07PM

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై, రాజ్యసభలో గురువారం (ఏప్రిల్ 2)చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా రైతులపై పోలీసులు లాఠీచార్జీలు చేసినా, వారు వెనకడుగు వేయకుండా నిలబడ్డారన్న ఆమె, వారి త్యాగాల పునాదులపైనే అమరావతి పునర్నిర్మాణం జరగాలన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన రేణుకా చౌదరి.. జగన్ సర్కార్ మూడు రాజధానుల విధానం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు తరలిపోయాయి, రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో పడిందని విమర్శించారు. కేవలం కాగితాల మీద బిల్లులు పెట్టడం కాకుండా, నిర్దేశిత గడువులోగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నారు.
కాగా అమరావతిపై జరిగిన చర్చలో పాల్గొన్న రేణుకా చౌదరి.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా తెలుగు రాష్ట్రాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం వంటి కీలక హామీలను పక్కన పెట్టడాన్ని ఎత్తి చూపుతూ విమర్శించారు. మొత్తానికి, అమరావతికి పూర్వ వైభవం రావాలని ఆశిస్తూనే, కేంద్రం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలన్నారు.



.webp)


