వైఎస్ వివేకా హత్య కేసు.. జగన్ బంధువులకు నోటీసులు

జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ చిత్తుచిత్తుగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి వరకూ నత్తనడకన నడిచిన వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసుకు సంబంధించి కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బంధువులు సహా పలువురికి నోటీసులు జారీ చేశారు. అలా నోటీసులు అందుకున్న వారిలో జగన్ రెడ్డి బావమరిది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, కడప ఎంపీ వైస్ అవినాష్ రెడ్డి మావ మనోహర్ రెడ్డి, సోదరుడు అభిషేక్ రెడ్డి ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుడు జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డి ఉన్నారు. వీరు కాకుండా మరో ఐదుగురు సాక్షులకు నోటీసులు అందాయి. ఈ పది మందినీ కూడా గురువారం (డిసెంబర్ 5) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొన్నారు.   అయితే ఈ నోటీసులు వివేకా హత్య కేస దర్యాప్తులో భాగంగా కాకుండా వివేకానందరెడ్డి మాజీ పీఎ  కృష్ణారెడ్డి గత ఏడాది డిసెంబర్ 15న చేసిన ఫిర్యాదు మేరకు జారీ చేశారు. వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి అలాగే సీబీఐ అధికారి రామ్ సింగ్ లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.   ఈ ఫిర్యాదుపై పది రోజుల కిందటే కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులు తాజాగా జగన్ బంధువులు సహా పది మందికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  వాస్తవానికి వివేకా హత్య కేసు దర్యాప్తునకు సుప్రీం కోర్టు విధించిన గడువు ముగిసిపోయింది. దీంతో సీబీఐ విచారణ ఆపివేసింది. గడువు పెంచాలన్న సీబీఐ వినతిపై సుప్రీం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగానే వివేకా హత్య కేసు విషయంలో ఇటు దర్యాప్తు కానీ, అటు కోర్టుల్లో విచారణ కానీ జరగడం లేదు. అయితే ఇప్పుడు పోలీసులు వివేకా హత్య కేసులో తనను వేధిస్తున్నారంటే ఆయన మాజీ పీఏ చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.  దీంతో ఈ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆ విచారణలో ఆయన వెల్లడించిన అంశాల ఆధారంగానే ఇప్పుడు జగన్ బంధువులు సహా పది మందిని పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు.  
Publish Date: Dec 4, 2024 4:35PM

జగన్ చేతులు కాలిన తరువాత ఆకులు వెతుక్కుంటున్నారా?

రాజకీయాల్లో తనను తానో పెదరాయుడిగా ఊహించుకున్న జగన్.. పార్టీ నిర్వహణ నుంచి ముఖ్యమంత్రిగా పాలన సాగించడం వరకూ, పరాజయం తరువాత ఈవీఎంలపై నెపం నెట్టేసి, అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా మారిపోయాయంటూ గగ్గోలు పెట్టడం వరకూ అన్నీ కూడా అదే తరహాలో చేశారు.  అయితే అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెదరాయుడి తీరు నడిచిందేమో కానీ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన వ్యవహార శైలిని సొంత పార్టీ నేతలే భరించలేకపోతున్నారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పడానికి కూడా వెనుకాడటం లేదు.  అధికారంలో ఉన్నంత వరకూ జగన్ చూసి రమ్మంటే కాల్చేసి వచ్చినట్లుగా తెగరెచ్చిపోయిన నేతలు ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయనో కలిసి నడిచిన నేతలు కూడా ఇప్పుడు వేరు దారి చూసుకుంటున్నారు.   మరో  వైపు జగన్ హయాంలో యథేచ్ఛగా అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలకు పాల్పడిన ఒక్కొక్కరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జగన్ హయాంలో జరిగిన అవకతవలక మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ పునాదుల్లోనే ఉన్నాయన్నది దర్యాప్తులో వెల్లడౌతుండటంతో.. సోషల్ మీడియాలో అసభ్య, అనుచిత పోస్టుల నుంచి, అవినీతి, కుంభకోణాలు, హత్యల తీగ లాగే వరకూ అక్కర్లేకుండా ముట్టుకుంటేనే తాడెపల్లి డొంక కదిలిపోతున్నది. దీంతో జగన్ తో ఇంకా అంటకాగితే తమ పుట్టి మునుగుతుందన్న భయంతో ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు, కొందరైతే పార్టీకీ దూరమౌతున్నారు.   జగన్ కు సన్నిహితులుగా ఉన్న వారైతే ఉన్న పదవులకు సైతం రాజీనామాలు చేసేసి పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వదిలి వెడుతుంటే.. జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం నటిస్తూ..  తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే గతంలోలా ఆయన మాటలకు వంత పాడే వారు పార్టీలో కరవయ్యారు. అంబటి, పేర్ని వంటి ఒకరిద్దరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ వారిని పట్టించుకునే వారే కరవైన పరిస్థితి. ఇక పార్టీ క్యాడర్ ఇప్పటికే కకావికలైపోయింది. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి తరచూ మీడియా ముందుకు వస్తూ జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు.   ఈ నేపథ్యంలోనే తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో  జగన్ పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు.     ఈ సమావేశానికి రాష్ట్రంలోని పార్టీ అసెంబ్లీ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో  పార్టీ అభివృద్దితో పాటు భవిష్యత్ కార్యాచరణ  అజెండాగా  చెబుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి తరువాత నుంచి జగన్ ప్రజలలోకి వస్తారని చెబుతున్నారు.   ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పార్టీ క్యాడర్ తో భేటీ అయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పార్టీ క్యాడర్ నూ, ప్రజలనూ పట్టించుకోని జగన్ ఇప్పుడు వారితో మమేకమౌతానంటూ ముందుకు రావడాన్ని వారు స్వాగతించే అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలే అంటున్నాయి.  వాస్తవానికి వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాజీలుగా మారిన నేతల్లో అత్యధికులు జగన్ తీరు కారణంగానే ఓటమి పాలయ్యామని బాహాటంగానే చాటారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ నేతలనూ, కార్యకర్తలనూ పూర్తిగా విస్మరించిన జగన్ క్షేత్ర స్థాయి వాస్తవాలను గుర్తించడానికి నిరాకరించారు. చెబుదామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటూ గళమెత్తారు.   ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు  జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల డొంక కూడా కదులుతున్నట్లు భావిస్తున్నారు. ఆ కేసు విచారణ, దర్యాప్తు నత్తనడకన నడవడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం వివరాలన్నీ సమర్పించాల్సిందిగా సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ తరుణంలో పూర్తిగా చేతులు కాలిన తరువాత ఆకుల కోసం వెతికిన చందంగా జగన్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తానంటూ  నియోజకవర్గ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కీలకభేటీ కావడం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉంటుందని భావించలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Dec 4, 2024 3:47PM

వైసీపీ, బీజేపీ బంధం కొనసాగుతోందా?.. కూటమి ధర్మం నుంచి బీజేపీకి మినహాయింపు ఉందా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీసీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ, అంతకు ముందు విపక్షంలో ఉండగా మూడున్నరేళ్లూ బీజేపీ ఆ పార్టీకి అన్ని విధాలుగా అండదండగా నిలిచింది. వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుజుకోకపోవడం నుంచి, అధకారంలో ఉండగా జగన్ ఆర్థిక అరాచకత్వానికి ప్రోత్సాహం ఇవ్వడం నుంచీ బీజేపీ వైసీపీకి, జగన్ కు వెన్నుదన్నుగా నిలిచింది. ఇవి ఆరోపణలకు మాత్రమే కాదు.. అక్షర సత్యాలంటూ పరిశీలకులు బోలెడు ఉదాహరణలు చూపుతున్నారు. జగన్ హయాంలో ప్రభుత్వం అడ్డగోలు అప్పులు చేసిందంటే అందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ అత్యంత ఉదారంగా వ్యవహరించడమే కారణమనడంలో సందేహం లేదు. అంతకు ముందు వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో కూడా అప్పటికి అధికారంలో ఉన్న మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన మోడీ సర్కార్ విపక్షంగా వైసీపీ ఏపీలో బలపడటానికి తన వంతు సహకారం అందించారు.  అయిదేళ్ల జగన్ పాలన కారణంగా బీజేపీకి ఇంకా ఆ పార్టీకి వంత పాడితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో వైసీపీకి తెగదెంపులు తెచ్చి తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తు వల్ల ఏపీలో రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందింది. అంతే కాకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి తెలుగుదేశం రూపంలో బలమైన అండ కూడా లభించింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వ మనుగడ ఇప్పుడు తెలుగుదేశం మద్దతుపైనే ఆధారపడి ఉంది. అయినా కూడా బీజేపీకి వైసీపీతో అనుబంధం వదులుకోవడానికి మనసు రావడం లేదా? అంటే జరుగుతున్న పరిణామాలను, ఆ పార్టీ ఎంపీతో అమిత్ షా భేటీని, ఆ భేటీ జరిగిన సమయాన్ని బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తుంది.   తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ అయిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విజయసాయి అమిత్ షా భేటీ అయిన సమయాన్ని బట్టి చూస్తుంటే... వైసీపీ అధినేతను ఆదుకోవడానికి, ఆయనను ఆపదలలోంచి బయటపడేయడానికి బీజేపీ ఇంకా తహతహలాడుతోందని భావించవలసి వస్తోంది. ఎందుకంటే ఇటీవలే అమెరికాలో అదానీపై కేసు నమోదైంది. ఆ కేసులో జగన్ పేరు, ప్రస్తావన ఉంది.  సరిగ్గా ఈ తరుణంలో విజయసాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం అనుమానాలకు తావిస్తోంది.  జగన్ ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఆయన దూతగా విజయసాయి అమిత్ షాను కలిశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పైగా ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హస్తిన పర్యటన జరిగిన వెంటనే ఉండటంతో తెరవెనుక ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అదానీ, జనగ్ అమెరికా కేసు విషయంలో పవన్ కల్యాణ్ మాట్లాడకపోవడంతో బీజేపీ ఈ విషయంలో జగన్ కు సహకారం అందిస్తున్నదా? అందుకే పవన్ కల్యాణ్ ను అమెరికా కేసు గురించి మాట్లాడవద్దని సూచించిందా అన్న చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది.  
Publish Date: Dec 4, 2024 2:12PM

భోపాల్ గ్యాస్ ట్రాజిడీకి నాలుగు దశాబ్దాలు.. నేర్చుకున్న పాఠాలేంటి?

భోపాల్  గ్యాస్ ట్రాజిడీకి నాలుగు దశాబ్దాలు పూర్తయ్యింది. ఆ విషాదం నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా వాటికి రెడ్ కార్పెట్ పరుస్తు.. పర్యావరణం, ప్రజారోగ్యం విషయంలో జాగ్రత్తలకు తిలోదకాలిచ్చేస్తున్నాయి.  ముఖ్యంగా ఏమైనా విపత్తులు సంభవిస్తే సదరు కంపెనీలే పూర్తి బాధ్యత వహించాలన్న దిశగా ఇప్పటికీ చట్టాలు లేకపోవడం దారుణం.  1884 డిసెంబర్ 3వ  భోపాల్లో  యూనియన్ కార్బైడ్  ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసనియేట్ వాయువు లీకైంది. ఒక్కసారిగా నిద్రలో ఉన్న  చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. నిద్రలోనే ఈ విషవాయువు ను పీల్చడంతో కళ్లు విపరీతంగా మండడంతో ఇళ్లు నుంచి బయటకు వచ్చారు.ఊపిరి తిత్తులలోకి ఈ వాయువు వెళ్ళడంతో ఆస్పత్రులకు పరిగెత్తారు. మధ్యలోనే రోడ్లపై ప్రాణాలు వదిలారు. తెల్లవారేసరికి నగరంలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపించాయి. విషవాయువు పీల్చి మరణించిన వారి సంఖ్య  పాతిక వేలకు పైనే ఉంటుదన్నది ఒక అంచనా, మృతులే కాకుండా మరో ఆరు లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  ఇప్పటికీ వారిని ఆ పీడ వదలలేదు. అప్పుడు గర్భవతులు గా ఉన్న తల్లులు కన్న పిల్లలు ఇప్పటికీ అంతుపట్టని వ్యాధులతో బాధపడుతున్నారు. వారి తరువాత తరాల వారు కూడా అనేక రోగాలతో బాధపడుతునే ఉన్నారు. అత్యంత దారుణమేమంటే ప్రమాదం జరిగిన వెంటనే 6వతేదీ అమెరికా నుంచి ఆ కంపెనీ చైర్మన్ వారెన్ అండర్సన్ భోపాల్ వచ్చారు.ఆయనను పోలీసులు అరెస్టు చేసి కంపెనీ అతిధి గృహంలో బంధించారు. కేవలం మూడు వేల మంది చనిపోయారని,1.2లక్షల మంది అస్వస్థతకు గురైనారని అంచనా వేసి1989లో నష్టం పరిహారం 47కోట్ల డాలర్లతో భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అప్పటివరకూ ఈ  గ్యాస్ వల్ల వచ్చే దుష్పరిణామాలు కంపెనీ సరిగా వెల్లడించలేదు. అ  అండర్సన్ వెంటనే  స్వదేశానికి తిరిగి వెళ్లేలా  అమెరికా ప్రభుత్వం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై ఒత్తిడి తీసుకువచింది. దీంతో   కేవలం నామమాత్రపు పూచికత్తుపై బెయిల్ తీసుకుని అండర్సన్  విమానంలో అమెరికా వెళ్లిపోయాడు.పరిహారం నామమాత్రమే పుట్టడంతో బాధితులు కోర్టులు,అంతర్జాతీయ సంస్థలు చుట్టూ తిరిగినా ప్రయోజనం కలగలేదు. అండర్సన్ భారత్ వైపు తిరిగి చూడలేదు. కంపెనీ నష్టపరిహారం ఒప్పందం మించి ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయి.  ఆ కర్మాగారం మూతపడినా చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికీ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉన్నాయి. నిజానికి మిథైల్ ఐసోసనియేట్ వాయువు సైనేడ్ అంత ప్రమాదమని అనంతర పరిశోధనలలో తేలింది.ఈ ప్రమాదం అనంతరం జన్మించిన అనేక మంది పిల్లలు వికలాంగులుగా పుట్టారు.శిశు మరణాల రేటు భోపాల్ లో ఇప్పటికీ అధికంగానే ఉంది. మూడు తరాలు మారినా అనారోగ్య సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి.నేటికీ న్యాయంకోసం ప్రధాని మోడీకి కన్నీళ్లతో విజ్ఞాపనలు పంపేవారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఒక్క కంపెనీ నిర్లక్షమే ఇంతటి వినాశనం సృష్టిస్తే భారత్ కు కుప్పలుతెప్పలుగా వస్తున్న కంపెనీలు ఎంతవరకూ క్షేమదాయకమో ఊహించలేం.ఉన్న స్వదేశీ కంపెనీలే విషాన్ని కక్కుతుంటే కాలుష్య నియంత్రణ అధికారులు మీన వేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికీ మందుల తయారీ కంపెనీలు హైదరాబాద్ లాంటి నగరాల్లో నిషిద్ధ వాయువులను గాలిలోకి వదులుతున్నాయి. అయినా అటు ప్రజలు,ఇటు ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు లేదు.అదే విదేశీ కంపెనీల విషయంలో కఠినంగా ఉంటారా అనేది అనుమానమే. అలాంటి పరిస్థితి రాకుండా కాలుష్య నియంత్రణపై తగిన చర్యలు చేపట్టేలా అధికారులు,ప్రభుత్వాలు తగిన ఒప్పందాలు చేసుకునేలా చట్టాలు రావలసిన అవసరం ఉంది.  
Publish Date: Dec 4, 2024 1:33PM

అమరావతే చంద్రబాబు ఆవాసం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలని భావిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఉండవల్లి గ్రామంలోని లింగమనేని గెస్ట్‌హౌస్‌లో నివాసం ఉంటున్న ఆయన పలు సందర్భాలలో  అమరావతిలో తన సొంత ఇంటిని నిర్మించుకుంటానని వెళ్లడించారు. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది.  అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడి ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇంటికి కావాల్సిన అన్ని అవసరాలను తీర్చే విధంగా శాశ్వత నివాసాన్ని నిర్మించాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఇందు కోసం ఇటీవల వెలగపూడి లో పాతికవేల  చదరపు గజాల స్థలాన్ని చంద్రబాబు కుటుంబం కొనుగోలు చేసింది. రాష్ట్ర ల్యాండ్ పూలింగ్ పథకం కింద ముగ్గురు రైతుల నుండి కొనుగోలు చేసిన ఈ భూమి   గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, ఎన్జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలకు సమీపంలోనే ఉంది.  ఈ ప్లాట్‌కు నాలుగు వైపులా రహదారి సౌకర్యం ఉంది.  అలాగే  సీడ్ యాక్సెస్ మార్గానికి అనుసంధానమై ఉంది. దాదాపు 5.5 ఎకరాల్లో నిర్మించనున్న ఈ నివాసంలో పార్కింగ్ సౌకర్యాలు, సిబ్బందికి వసతి కల్పించనున్నారు. సన్నాహక భూ పరీక్షలు  జరుగుతున్నాయి మరియు త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది.  
Publish Date: Dec 4, 2024 1:12PM

పాపాల పుట్ట పగులుతోంది!

అధికారం అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన వారందరికీ ఇప్పుడు కర్మ ఫలం అనుభవించకతప్పని పరిస్థితి ఎదురౌతోంది.  జగన్ హయాంలో  దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదరింపులకు సంబంధించి ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడపోర్టు, కాకినాడ సెజ్ లలో బలవంతంగా షేర్లు లాక్కొని చేసిన దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై వైసీపీ ఎంపీ విజయసాయిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అలాగే అరబిందో కంపెనీపై కేసు నమోదైంది. కాకినాడ పోర్టు, సెజ్ లలో తన నుంచి బలవంతంగా  షేర్లు లాక్కొన్నారంటూ కేవీరావు సీఐడీకి చేసిన ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదైంది. కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయి, విక్రాంత్ రెడ్డి, అరబిందో కంపెనీలు కేవీరావును బెదరించి దౌర్జన్యంగా కాకినాడ పోర్టు, సెజ్ లలో షేర్లు లాక్కొన్నారు. కాకినాడ పోర్టులో పాతిక వందల కోట్ల రూపాయల విలువైన షేర్లు తీసుకుని కేవలం 494 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారనీ, అలాగే కాకినాడ సెజ్ లో 1104 కోట్ల వివువైన షేర్లకు కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారనీ కేవీరావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు విజయసాయి, విక్రాంత్, అరబిందో కంపెనీపై పోలీసులు క ేసు నమోదు చేశారు.  కాగా తాను ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వీరి దుర్మార్గంపై ఫిర్యాదు చేశాననీ, అయినా ఆయన పట్టించుకోలేదనీ కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.    కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు  పోర్టులో రూ.2500 కోట్ల విలువైన తన వాటాను రూ.494 కోట్లకు, సెజ్‌లో ఉన్న రూ.1109 కోట్ల విలువైన వాటాను కేవలం రూ.12 కోట్లకే లాక్కున్నారని సీఐడీ అడిషనల్ డీజీకి ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదు మేరకు  మంగళగిరి సీఐడీ అధికారులు  ఐపీసీ 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్‌ విత్‌ 34 ఐపీసీ, భారతీయ న్యాయ సంహితలోని ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  జగన్‌ మోహన్ రెడ్డి హయాంలో తమ కంపెనీని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని కేవీరావు ఆ ఫిర్యా దులో పేర్కొన్నారు.  చెన్నైకి చెందిన శ్రీధర్‌ అండ్‌ సంతానం కంపెనీ, ముంబైకి చెందిన మరో సంస్థ తోనూ ఆడిట్‌ చేయించామని చెప్పి ఎలాంటి అవకతవకలకూ పాల్పడకుండా నిజాయితీగా నడుపుతున్న తమ సంస్థ .. ప్రభుత్వానికి రూ.994 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆడిట్ నివేదిక ఉందని చెప్పారనీ, అదే సమయంలో విజయసాయి రెడ్డి తమకు ఫోన్ చేసి జగన్‌ మోహన్ రెడ్డి బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌ రెడ్డిని కలవాలని చెప్పారని తెలిపారు. ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడగా.. ‘మీ కుటుంబం జైలుకు వెళ్లకూడదనుకుంటే కంపెనీ షేర్లన్నీ అమ్మేయండి’ అంటూ బెదిరించానని కేవీ రావు వాపోయారు. ఇది తన మాట కాదని, సీఎం జగన్‌ హుకుం అంటూ విక్రాంత్ రెడ్డి బెదరించారని కూడా కేవీరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.    ఇక కాకినాడ సెజ్‌ విషయానికి వస్తే  1999 నుంచి జీఎంఆర్‌తో  కలిపి తాము అభివృద్ధి చేశామని కేవీ రావు పేర్కొన్నారు. సెజ్‌లో 48.74శాతం తమ కుటుంబ వాటా కాగా, మిగిలింది జీఎంఆర్‌ వాటా అని వివరించారు. తమ వాటాగా 8 వేల ఎకరాల భూమి, పోర్టులో షేర్లు ఉన్నాయని, వైసీపీ సర్కారు బాధలు పడలేక సెజ్‌లో తమ భూమి, వాటాను రూ.400 కోట్లకు భాగస్వామి జీఎంఆర్‌కు అప్పగించాల నుకున్నామని తెలిపారు. వాస్తవానికి ఆ ఆస్తి విలువ రూ.1104 కోట్లే అయినప్పటికీ భాగస్వామి కావడంతో జీఎంఆర్‌‌కు వదిలేయాలనుకున్నామని, ఈ మేరకు అగ్రిమెంట్ కూడా కుదిరిందని పేర్కొన్నారు. అయితే ఈ డీల్‌ను రద్దు చేసుకొని భూమి మొత్తం తమకే అప్పగించాలంటూ అరబిందో యాజమాన్యం తమను బెదిరించిందని కేవీ రావు వివరించారు. భూమిని తమకు ఇవ్వకుంటే జైలుకు పోవాల్సి ఉంటుందని బెదిరించిందని పేర్కొన్నారు. రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చి కాకినాడ సెజ్‌లో ఉన్న 48.74 శాతం తమ వాటాను లాక్కున్నారని కేవీరావు పేర్కొన్నారు.  
Publish Date: Dec 4, 2024 9:49AM