మత్స్యకారుల వలకు అరుదైన చేపలు.. వేలం పాటలో కోటి ఆదాయం!

మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో వేటకు వెడతారు. వలేసి చేపలు పడతారు. రోజు బాగుంటే వల నిండుగా చేపలు పడతాయి. లేకుంటే శ్రమంతా వృధానే. అరుదుగా మత్స్యకారులు పంట పండింది అనుకునే రోజులు వస్తాయి. ఏదో వేటాడాం చేపలు పట్టాం అన్నట్లుగానే వారి జీవనం సాగుతుంటుంది. సముద్రంలోని ఆటుపోట్లలాగే వారి జీవితంలో కూడా ఆటుపోట్లు సహజం. వాతావరణం అనుకూలించాలి. అలా అనుకూలించిన రోజున వలకు చేపలు చిక్కుతాయి. రోజూ మంచి రోజే అంటూ ఆశ అనే చుక్కానితో జీవిత నావ లాగించేస్తూ ఉంటారు.

అలాంటి మత్స్య కారులే ఉప్పాడ మండలం యు.కొత్త పల్లికి చెందిన వంకా సత్తిబాబు, ఉమ్మిడి అప్పారావులు. చేపల వేటకు విరామం సమయం పూర్తయిన తరువాత వారు బోటులో చేపల వేటకు సముద్రంపైకి వెళ్లారు. అయితే వారి అదృష్టం పండింది. అత్యంత అరుదైన కోనం జాతి చేపలు వారి వలకు చిక్కాయి. అలా ఇలా కాదు పెద్ద సంఖ్యలో చేపలు వారి వలలో పడ్డాయి.

ఒక బోటులో వేటకు వెళ్లిన వారు.. ఒడ్డు నుంచి మరో రెండు బోట్లు తెప్పించుకుని వారి వలకు చిక్కిన చేపలను మొత్తం మూడు బోట్లలో ఒడ్డుకు తీసుకు వచ్చాయి. మార్కెట్ లో వారి వలకు చిక్కిన చేపల విలువ కోటి రూపాయలు పలికింది. పది రోజుల కిందట వేటకు వెళ్లిన ఈ మత్స్యకారులకు అత్యంత అరుదైన కోనం జాతి చేపలు, అవీ దాదాపు అన్నీ ఒకే సైజు ఉన్నవి పడటంతో వారి ఆనందానికి అవధులే లేకుండా పోయింది. మొత్తం 13 టన్నుల చేపలను వేటాడి తీసుకువచ్చారు.