Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అనుమానం…అమానుష హత్యకు దారి
posted on: Mar 23, 2026 8:34PM
.webp)
ప్రేమతో మొదలైన ఒక కుటుంబ కథ… అనుమానం, మద్యం వ్యసనం, హింసతో భయానక ముగింపుకు చేరింది. ఓ వివాహితను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త… చివరికి ఆమెనే కిరాతకంగా హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో కలకలం రేపింది.మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన నర్సింలు (31), అదే ప్రాంతానికి చెందిన శోభ అలియాస్ శోభారాణి (33)ను నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
వారి ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి పుట్టింది. మొదట్లో సాఫీగా సాగిన సంసారం… కాలక్రమేణా మలుపు తిప్పింది. నర్సింలు మద్యానికి బానిస కావడం, భార్యపై అనుమానం పెంచుకోవడం వల్ల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ వేధింపులు భరించలేక శోభ తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లి నివసిస్తోంది. అయితే, భార్యపై అనుమానం పెంచుకున్న నర్సింలు ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. ఈ నెల 21న “నీ కుమారుడికి సైకిల్ కొనిపెడతాను” అంటూ మాయ మాటలతో శోభను షాద్‌నగర్‌కు పిలిపించాడు.
గదిలోకి తీసుకెళ్లిన అనంతరం మద్యం సేవించిన నర్సింలు మళ్లీ గొడవకు దిగాడు. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో… ముందుగానే సిద్ధం చేసుకున్న గ్రానైట్ రాయితో శోభ తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం గదిలోని రక్తపు ఆనవాళ్లను శుభ్రం చేసి, అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని మూటకట్టి బైక్‌పై తీసుకెళ్లాడు.అయితే ఈ ఘటనలో అత్యంత హృదయ విదారక అంశం… అదే బైక్‌పై మృతదేహంపై తన మూడేళ్ల కుమార్తెను కూర్చోబెట్టి వెళ్లడం. రంగారెడ్డిగూడ శివారులోని ఓ పొలంలో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను ట్రాక్ చేసి, కొన్ని గంటల్లోనే లింగంపల్లిలో నర్సింలును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన రాయి, రక్తపు మరకలున్న దుస్తులు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా… ఈ ఘటనలో మరొక విషాదకర దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాత్రంతా చలిలో, చీకట్లో ఆ చిన్నారి తన తల్లి మృతదేహం పక్కనే కూర్చొని ఏడుస్తూ గడిపింది. ఎంత పిలిచినా అమ్మ స్పందించకపోవడంతో… ఆ పసిప్రాణం చేసిన రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.ఉదయం గ్రామస్థులు చిన్నారి ఏడుపు విని దగ్గరకు వెళ్లి చూడగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ప్రేమతో ప్రారంభమైన బంధం… అనుమానంతో విషాదాంతానికి చేరిన ఈ ఘటన… సమాజాన్ని కుదిపేస్తోంది.


.webp)



