రామ్ గోపాల్ వర్మ అతితెలివి.. తగ్గేది లేదంటూనే కాళ్ల బేరాలు!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు, క్వాష్ పిటిషన్ల విచారణ వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ఆయన అజ్ణాతంలోనే ఉండి కూటమి సర్కార్ ను తనను అరెస్టు చేయవద్దనీ, ఎక్కడకూ పారిపోననీ, సినీమా పనులలో బిజీగా ఉన్నాననీ వేడుకుంటున్నారు. అయితే ఆయన రామ్ గోపాల్ వర్మ కదా? అందుకే ఆ వేడుకోళ్లు, విజ్ణప్తులూ కూడా భిన్నంగా ఒక విధంగా తిరుగుబాటు ధోరణిలో ఉంటున్నాయి. అరెస్టు చేస్తే జైళ్లో ఉండి సినిమా కాథలు రాసుకుంటానంటూ అన్యాపదేశంగానైనా తన అరెస్టు తథ్యమన్న విషయం అంగీకరించేస్తున్నారు. సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మపై దాదాపు 9 కేసులు నమోదయ్యాయి. 

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై కించపరిచే వ్యాఖ్యలు, అసభ్య, అభ్యంతర పోస్టులు పెట్టినందుకు ఏపీ వ్యాప్తంగా  వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ అజ్ణాతంలోకి వెళ్లారు. పోలీసు నోటీసుల మేరకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా కోర్టులలో ఊరట లభిస్తుందన్న ఆశతో పరారీలో ఉన్నారు. అజ్ణాతంలో  ఉండగానే ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తనను అరెస్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు ప్రతీకార రాజకీయాలు చేస్తారని తాను అనుకోవడం లేదని  చెప్పుకొచ్చారు.

175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లు గెలిచి  ఇప్పటికే ప్రతీకారం తీర్చుసుకున్నారన్న రామ్ గెపాల్ వర్మ.. తన పోస్ట్‌లు,  సినిమాలు కనీసం ఒక్క ఓటును కూడా వారికి వ్యతిరేకంగా ప్రభావితం చేయలేదని తేలిపోయింది. ఇక ఇప్పుడు తనపై వారు ప్రతీకారం కోసం చూస్తారని బావించడం లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పుకున్నారు. ఓ పక్క తనపై కేసులు సమంజసం కాదని పోలీసులను విమర్శిస్తూనే రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, పవన్, లోకేష్ లను తనను క్షమించేయమని పరోక్షంగా వేడుకుంటూ, తన వ్యాఖ్యలను జనం ఇసుమంతైనా పట్టించుకోలేదని అంగీకరించేశారు. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే బాబ్బాబు నన్న వదిలేయండని ఆయన పరోక్షంగా ప్రాధేయపడుతున్నారు. 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై ఆయన చాలా అభ్యంతరకరమైన, కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన అరెస్టు తప్పదని తేలిపోయిన తరువాత అతి తెలివి ఉపయోగిస్తూ, తనను ఆదుకోవాలనీ, క్షమించాలనీ పరోక్షంగా నాడు తాను కించపరిచిన వారి కాళ్లా వేళ్లా పడుతున్నట్లు కనిపిస్తోంది.