రాజాసింగ్, కేటీఆర్ సరదా సంభాషణ.. నవ్వులు పూయించిన సన్నివేశం!
posted on: Mar 17, 2026 7:14AM

తెలంగాణ అసెంబ్లీ వేదికగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. . బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు.. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వుల పువ్వులు పూయించింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం నేతలందరూ అసెంబ్లీ లాబీల్లోకి వచ్చారు.
ఆసమయంలో సమయంలో రాజాసింగ్, కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. కొద్ది సేపు ఇరువురూ నవ్వుతూ ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఫొటోలు తీస్తుంటే.. కేటీఆర్ రాజాసాంగ్ ను ఆటపట్టిస్తూ మనం ముచ్చటించుకుంటుంటే చూసే వారు ఇంకేదో అనుకునే చాన్స్ ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, బడ్జెట్ కేటాయింపులపై పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేటీఆర్, రాజాసింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ వాతావరణాన్ని తేలిక చేసిందని చెప్పవచ్చు.
అయితే ఇదొక రాజకీయ వ్యూహంగా కొందరు పేర్కొంటున్నారు. రానున్న రోజులలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలకు ఇది సంకేతంగా చెబుతున్నారు. ఈ సరదా సంభాషణ ద్వారా కేటీఆర్.. బీజేపీకి స్నేహహస్తం సాచారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ సన్నిహితంగా మెలుగుతోందనీ, ఒక దశలో పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న చర్చ కూడా జరిగిందనీ ఇటీవలి కాలంలో కవిత చేసిన విమర్శలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.


.webp)


